సాక్షి, హైదరాబాద్: నేరం చేసిన వారికి శిక్షపడాలి.. ఇది న్యాయసూత్రం. కానీ చాలా మంది నేరస్తులకు తగిన శిక్షలు పడటం లేదు. ఆయా కేసుల్లో సరైన ఆధారాలు సేకరించలేకపోవడంతోపాటు ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు కూడా. నేరస్తులు ఏమైనా చేస్తారోనన్న భయం, వారి బెదిరింపులు వంటివాటితో సాక్షులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో కీలక కేసుల్లో సాక్షుల రక్షణ కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మేరకు నల్సార్ యూనివర్సిటీ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’పేరిట దీనికి రూపకల్పన చేస్తున్నాయి. సాక్షులకు భద్రత కల్పించడం, అవసరమైతే ఇతర ప్రాంతాలకు తరలించడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం, భద్రతకు, తగిన ఏర్పాట్ల కోసం నిధులు కేటాయించడం వంటి చర్యలు చేపట్టనున్నారు. సాక్ష్యం చెప్పడం హక్కుగా, సాక్షిని కాపాడుకోవడం, గౌరవం కల్పించడం బాధ్యతగా, వారు దర్యాప్తుకు సహకరించేలా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని ఈ చట్టం ముసాయిదాలో పేర్కొన్నారు.
మూడురకాలుగా గుర్తిస్తారు
తీవ్రమైన నేరాల్లో సాక్షులకు భద్రత, వారికి అందజేయాల్సిన సహాయ సహకారాలను మూడు కేటగిరీలుగా పర్యవేక్షించాల్సి ఉంటుందని ‘ప్రొటెక్షన్ స్కీమ్’లో పేర్కొన్నారు. కేటగిరీ–ఏ కింద ఏదైనా కేసులో సాక్ష్యం చెబుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబంలో జీవితాంతం ప్రమాదం ఉన్నవారు ఉంటారు. కేటగిరీ–బీలో కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో హాని ఉండే సాక్షులను చేరుస్తారు. కేటగిరీ–సీ కింద పోలీసుల దర్యాప్తు దశలో ఉన్నప్పుడే బెదిరింపులు రావడం, హాని కలిగించడం, సమాజంలో తిరగనీయకుండా చేయడం వంటివి ఎదుర్కొన్న సాక్షులను చేరుస్తారు. సాక్షులకు ఈ కేటగిరీలను బట్టి భద్రత కల్పిస్తారు.
నిధుల కోసం ప్రత్యేక ఫండ్
విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్‌ను అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో కొన్ని నిధులను కేటాయించడం, స్వచ్చంద సంస్థల నుంచి నిధులు సేకరించడం, కోర్టుల్లో డిపాజిట్ రూపంలో వచ్చే నిధి నుంచి కొంత మొత్తాన్ని ఈ ఫండ్‌కు జమచేయడం వంటివి చేసేలా కార్యాచరణ రూపొందించారు.
ఈ ఏడాది నుంచే అమలు
కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం రూపొందిస్తున్న ఈ చట్టాన్ని ఈ ఏడాదే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ అంశాలన్నింటినీ ముసాయిదాలో పేర్కొన్నారు. త్వరలోనే మరిన్ని అంశాలను జత చేయడం లేదా అనవసరమైన వాటిని తొలగించడం పూర్తి చేసి.. తుదిరూపు దిద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చేపట్టనున్న భద్రతా చర్యలివీ..
- కేసు దర్యాప్తు లేదా కోర్టు విచారణ సమయంలో నిందితులకు, సాక్షులు నేరుగా (ఫేస్ టు ఫేస్) కనిపించకుండా ఏర్పాట్లు చేయడం.
- సాక్షులతోపాటు నేరస్తుల మెయిల్స్, ఫోన్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం.
- సాక్షికి సంబంధించిన ఫోన్ నంబర్లు మార్చడంతోపాటు సంబంధిత టెలికం సంస్థకు తీవ్రత వివరించి నంబర్‌ను అన్‌లిస్ట్ చేయడం.
- సాక్షి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, సెక్యూరిటీ డోర్స్, అలారం, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయడం.
- వారి గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు మరో పేరుతో బయట తిరిగేలా ఏర్పాట్లు.
- సాక్షుల నివాసం పరిసరాల్లో 24 గంటలూ పెట్రోలింగ్ చేపట్టి భద్రత కల్పించడం.
- అవసరమైతే సాక్షులను వారి దూరపు బంధువుల ఇంటికి లేదా మరో రక్షణ గృహానికి తాత్కాలికంగా తరలించడం.
- కోర్టులో వాంగ్మూలం లేదా విచారణ ఉన్న సమయంలో పోలీసు భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో చేర్చడం.
- సాక్షులను కోర్టు వరకు తీసుకువచ్చి, తిరిగి సురక్షిత ప్రదేశానికి తరలించడం ప్రమాదకరమని భావిస్తే... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఏర్పాట్లు.
- ఇన్‌కెమెరా ట్రయల్స్‌కు సిఫారసు చేయడం.
- తీవ్రత ఎక్కువ కల్గిన నేరాలపై రోజువారీగా త్వరితగతిన దర్యాప్తు, విచారణ చేపట్టడం.
- సాక్షుల జీవన ప్రమాణాలకు ఇబ్బంది కలిగినప్పుడు వారికి ఆర్థిక సహాయం లేదా మరో వృత్తిలో నిలదొక్కుకునేలా నిధులను ఇప్పించడం.
- ‘విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీమ్’ను అక్రమ మార్గానికిగానీ, ఎలాంటి హానీ లేకున్నా భద్రత కోసం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే.. వారికోసం చేసిన ఖర్చును తిరిగి వసూలు చేస్తారు.
లీగల్ సెల్ అథారిటీ నేతృత్వంలో..
ఏదైనా కేసులో సాక్ష్యం చెబితే తనకు ప్రమాదకరమని భావించిన వ్యక్తులు జిల్లాస్థాయిల్లోని డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీలను, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ లీగల్ సెల్ అథారిటీలను సంప్రదించి.. రక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అథారిటీలు ఈ దరఖాస్తులను పోలీస్ కమిషనర్లు/జిల్లా ఎస్పీలకు సిఫార్సు చేస్తాయి. సంబంధిత కేసుల్లో బెదిరింపులు, సాక్షులకు హాని కలిగించే అంశాలపై నివేదిక తెప్పించుకుని.. పోలీసు–లీగల్ సెల్ సంయుక్తంగా చర్యలు చేపడతాయి. సాక్షులకు భద్రత కల్పించేలా అథారిటీలు మానిటరింగ్ చేస్తాయి. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చేందుకు విట్‌నెస్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment