సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక చాలా మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేశారు, ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఇదే సమయంలో సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.
తాజాగా మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో దుష్ట సంప్రదాయం కొనసాగుతోంది. బాధితుల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజలను ఆలోచింపచేసేలా పోస్టులు పెడుతున్నా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడి పెట్టాలని లోకేష్ ట్వీట్ పెట్టారు. ఈ రెండిటినీ కలుపుతూ ఇంటూరి రవి కిరణ్ వ్యంగ్యంగా పోస్టు పెడితే కేసు పెట్టారు. సూపర్ సిక్స్‌లో ఒకటి తక్కువ అయిందంటూ సినిమా విలన్ పాపులర్ డైలాగుతో పోస్టు పెడితే కేసు పెట్టారు.
బుడమేరు వరద పరిహారంలో జరిగిన దోపిడీపై వ్యంగ్యంగా పోస్టు పెడితే మరో కేసు పెట్టారు. గాంధీజీ ఏం చెప్పారు? చంద్రబాబు మద్యం షాపుల పెంపు ద్వారా ఏం చెప్తున్నారో తెలుపుతూ ఒక జోక్ పోస్టు పెడితే దాన్ని కూడా తప్పు పట్టారు. కనకదుర్గమ్మ గుడి కవర్‌తో బయటి నుండి తెచ్చిన లడ్డూలు పెట్టి విక్రయించిన వైనంపై పోస్టు పెడితే కేసు పెట్టారు. డీజీపీ కోయ ప్రవీణ్ ఫక్తు పొలిటికల్ లీడర్ లాగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఆయనకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావాలేగానీ పోలీసు డ్రెస్సులో రాజకీయాలు మాట్లాడవద్దు.
వైఎస్ జగన్‌పై అత్యంత దారుణమైన భాషతో టీడీపీ వారు పోస్టులు పెట్టారు. వైఎస్ జగన్ తనపై తానే దాడి చేయించుకున్నట్టు టీడీపీ నేతలు మాట్లాడారు. వీళ్ల మనసులో ఎంత విషం ఉంటే ఇలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదు?. టీడీపీ అధికారంలోకి వచ్చాక చాలామంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. దీన్ని బట్టే టీడీపీ సైకో మెంటాల్టీని అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ మేలు చేస్తే జనం నోటి దగ్గర తిండిని తీసేశారంటూ పోస్టులు పెట్టారు.
ఈ ఆరు నెలల్లోనే చంద్రబాబు రూ.73వేల కోట్ల అప్పు చేశారు. ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు తెలపాలి. కాకినాడ పోర్టును గురిపెట్టి లాక్కున్నట్టు నిస్సిగ్గుగా పోస్టు పెట్టారు. టీడీపీ అఫీషియల్ ట్విట్టర్‌లోనే వైఎస్ జగన్‌పై దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. కేవలం వ్యంగ్యంగా పోస్టులు పెట్టిన ఇంటూరి రవికిరణ్‌పై 20పైనే కేసులు పెట్టారు. మరి దుర్మార్గంగా పోస్టులు పెట్టిన టీడీపీ వారిని ఏం చేయాలి?. పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టుని రాజమండ్రి పోలీసులు నగ్నంగా లాకప్‌లో పడేశారు. పెద్దిరెడ్డి సుధారాణి అనే మహిళను కస్టడీలోనే పోలీసులు కొట్టారు. ఇలా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలోని మేధావులు, ప్రజాసంఘాల నేతలు ఆలోచించాలి. ఈ దారుణాలను గట్టిగా ప్రశ్నించాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెడుతున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment