సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ ఒక దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పిందని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ లీగల్ (YSRCP Legal Cell) సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడపలో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే నానా అల్లరి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం జరగకుండా గొడవ చేశారని.. గాలివీడు(Galividu)లో కూడా ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించారని మనోహర్‌రెడ్డి(Manohar Reddy) నిప్పులు చెరిగారు.
‘‘జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కారప్పొడి, పెప్పర్ స్ప్రేతో 100 మందికి పైగా దాడి చేసేందుకు యత్నించారు. సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేశారని కట్టుకథ అల్లారు. నిత్యం ప్రజల్లో ఉండే సుదర్శన్ రెడ్డికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న సుదర్శన్ రెడ్డిని తీవ్రవాది మాదిరి ఈడ్చుకుంటూ పోవడం దారుణం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ కక్ష, రాజకీయ దురుద్ధేశంతో చేసినవే’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘గాలివీడులో వైఎస్సార్‌సీపీలో చురుగ్గా ఉండే నాయకులపై కేసులు బనాయించాలని కుట్ర చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. బాధితుల పక్షాన నిలబడకుండా రాజకీయ దురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించారు. బలవంతంగా వైఎస్సార్‌సీపీ వారి ఆస్తులు లాక్కుంటున్నా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ప్రభుత్వంపై ఎవరు నిరసన తెలిపినా.. వారి పై కేసులు పెడుతున్నారు. అధికారంలోకి రాకముందు 34 వేల మంది మహిళలు అపహరణకు గురయ్యారని పవన్ చెప్పారు. ఈ రోజు ఆ 34 వేల మంది ఎక్కడున్నారో పవన్ సమాధానం చెప్పాలి’’ అని మనోహర్‌రెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి: చంద్రబాబూ.. విజన్ అంటే అప్పులేనా?: బుగ్గన
‘‘కాకినాడలో దళిత డాక్టర్‌పై జనసేన ఎమ్మెల్యే బూతులు తిడుతూ దాడి చేస్తే పవన్ ప్రశ్నించలేదు. పరామర్శించలేదు. యలమంచిలి ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే పవన్ ప్రశ్నించలేదు.. పరామర్శించలేదు. ముచ్చుమర్రిలో మైనర్ బాలిక పై అత్యాచారం చేస్తే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ స్పందించలేదు. పిఠాపురంలో టీడీపీ నేత బాలికపై లైంగికదాడి చేస్తే ఆ కుటుంబాన్ని పవన్ ప్రశ్నించలేదు. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నేత వీఆర్వో పై బీర్ బాటిల్ తో దాడి చేస్తే స్పందించలేదు.. ఖండించలేదు. కేవలం రాజకీయదురుద్ధేశంతోనే పవన్ గాలివీడులో పర్యటించాడు’’ అని మనోహర్‌రెడ్డి చెప్పారు.
‘‘మూడు పార్టీలు ఏకమైతేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సింగిల్‌గా పోటీ చేస్తే 40 శాతం ఓట్లు వచ్చాయని పవన్ గుర్తుంచుకోవాలి. ఆరు నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి రేగింది. మరో ఆరు నెలల తర్వాత గన్‌మెన్లు లేకుండా కూటమి నేతలు ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. గాలివీడు ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. పోలీసులు కూటమి నేతలు మాటలు వినడం మానుకోవాలి. గాలివీడు ఘటనను న్యాయవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment