గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రొద్భలంతోనే దాడుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ విభాగంతో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘న్యాయం ధర్మం అందరికీ ఒకటే అని ఆరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మనం చెప్పాం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందో చూడండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. రెడ్ బుక్‌లో పేర్లు పెట్టుకున్నారు. మంచికోసం కాకుండా.. ఎవరిని తొక్కాలి, ఎవరిపైకేసులు పెట్టాలి, ఎవరి ఆస్తులను ధ్వంసం చేయాలని అందులో రాసుకున్నారు. అరాచకాలు చేస్తున్నారు, విధ్వంసాలు చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ తెరవడం మొదలుపెట్టారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామస్థాయిల్లో రెడ్‌బుక్‌ల పేరిట విధ్వంసాలు చేస్తున్నారు.
.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. గోబెల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు మనదగ్గర లేవు. పెద్దిరెడ్డి మీద ఎలాంటి దారుణాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కార్యాలయంలో పేపర్లు కాలిపోతే… నేరుగా పెద్దిరెడ్డికి లింకు పెడుతున్నారు. ఒక కార్యాలయంలో పేపర్లు కాలిపోతే.. వాటికి సంబంధించిన పేపర్లు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్, హెచ్‌డీఓ కార్యాలయాల్లో ఉంటాయి. డిజిటల్ రూపంలో అన్ని పత్రాలు ఉంటాయి. టీడీపీ వాళ్లే చేసి.. దొంగకేసులు పెట్టే ప్రయత్నంచేస్తున్నారు.
.. లా అండ్ ఆర్డర్‌మీద ఎవరికీ బాధ్యత లేకుండా పోయింది. ఎదుటి వాడు మనవాడు కాదనుకుంటే.. ఏదైనా చేయొచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి వాటికి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు అభయం హస్తం ఇస్తున్నారు. నేరం చేయాలంటే భయపడాలంటూ చంద్రబాబు నిన్న అన్నారు. కానీ తాడిపత్రిలో పోటీచేసిన పెద్దారెడ్డిని అడుగుపెట్టనీయకుండా టీడీపీ మూకలన్నీ దాడులు చేశారు. మురళి అనే కార్యకర్తమీద దాడులు చేశారు.. ఆ ఇంటిని తగలబెట్టారు.
.. ఓవైపు చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు.. మరోవైపు దాడులు చేస్తున్నారు. పద్ధతి ప్రకారం భయాందోళనలు ప్రజల్లో సృష్టిస్తున్నారు. తన మీడియాను వాడుకుని తిరిగి రివర్స్ కథనాలు రాయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర కీలకం. కోర్టులు న్యాయం చేయాలన్నా.. చొరవ అనేది ముఖ్యం. కేసులు పెట్టిన దగ్గరనుంచి వాదనలు వినిపించి బాధితుల తరఫున నిలవాల్సింది మీరే. లేకపోతే.. మన వాళ్లకు న్యాయం దక్కదు.
.. న్యాయవాదులుగా మీరు నిర్వహించే పాత్ర చాలా కీలకం. అందరం ఒక్కతాటిపైకి వద్దాం. అందరం కలిసి గట్టిగా యుద్ధం చేయాలి. అప్పుడే అన్యాయాల్ని ఎదుర్కోగలం. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ దారుణాలు, అరాచకాలు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో లీగల్‌సెల్స్ బలంగా ఉండాలి. ఏ ప్రభుత్వం చేయని విధంగా వైయస్సార్‌సీపీ న్యాయవాదులకు మేలు చేసింది.
మనం మాత్రమే రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం. కొత్తగా వృత్తిలోకి వచ్చే న్యాయవాదులకు మూడేళ్లపాటు ప్రతి ఆరునెలలకోసారి రూ.30 వేలు చొప్పున ఇచ్చాం. న్యాయవాదులకు తోడుగా ఉంటే.. పేదవాళ్లకు అండగా ఉంటారని మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది. లీగల్‌సెల్‌ను మరింత విస్తృతపరచాలి. అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలి. వైయస్సార్ కాంగ్రెస్ యంగ్ పార్టీ. కాబట్టి కొన్ని కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలి అని వైఎస్ జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment