తాడేపల్లి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వేళ.. ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటం చేద్దాం. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గాల నాయకత్వం వెంటనే స్పందించాలి. పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేస్తే న్యాయ సహాయం అందించాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్టీ తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు కావాలి’’ నేతలకు దిశానిర్దేశం చేశారాయన.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని ఈ సమావేశంలో సజ్జల అన్నారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తే పార్టీ లీగల్ టీం వెంటనే పీఎస్ లకు వెళ్లాలి. కావాల్సిన న్యాయ సహాయం అందించాలి. సీనియర్ అడ్వకేట్స్ తో కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కొందరు లాయర్లను ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవటంలో ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన పనిలేదు. వైయస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారు’’ అని సజ్జల చెప్పారు.
ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, లీగల్ సెల్ ముఖ్య నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment