
ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉద్రిక్తతలకు దారి తీస్తే? ఎవరూ హర్షించరు. కానీ, ఇలాంటి పరిణామాలు ఎక్కువవుతున్నాయి. మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా గత వారం రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో తలెత్తిన ఘర్షణలే అందుకు సాక్ష్యం. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన పండుగ,శాంతియుతంగా సాగాల్సిన శోభాయాత్రలు కొన్నేళ్ళుగా శత్రుత్వానికీ, అరెస్టులకూ, అభాగ్యుల మర ణాలకూ దారితీయడం శోచనీయం. ఈసారీ బిహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీల్లో రెండు మతాల ఘర్షణగా నవమి ఉత్సవం మారిపోయింది.
అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ హింసాకాండ చెలరేగింది. ప్రధానంగా ప్రతిపక్షాల హయాంలోని పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో భారీ విధ్వంసం రేగిన తీరు ఆందోళనకరం. నిరుటి లాగే ఈసారీ రాళ్ళు రువ్వడం, నినాదాలు చేయడం, గృహదహనాలు, లూటీలు! సోకాల్డ్ భక్తుల చేతుల్లో కత్తులు, తుపాకీలు. వెరసి, పవిత్ర రామనవమి, రంజాన్ మాసం కలిసొచ్చే సమయం దేశంలో కొత్త తరహా హింసాత్మక ధోరణికి అనువైన సందర్భంగా మారిపోవడం ఓ విషాదం.
బెంగాల్‌లో హౌరా జిల్లాలో వరుసగా రెండురోజులు, సోమవారం రాత్రి హుగ్లీ దగ్గర రిష్రాలో మరోసారి ఘర్షణలు రేగాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి, నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి. బిహార్‌లో సాసారామ్, నలందా జిల్లాల్లో హింసకు పలువురు గాయపడ్డారు. నలందా వద్ద 110 ఏళ్ళ చరిత్ర కలిగిన మదరసాలో వేలకొద్దీ అరుదైన పుస్తకాలకు నిలయమైన గ్రంథాలయం దుండగుల చేతిలో బూడిదైన ఘటన కదిలించేస్తుంది. రెచ్చగొట్టే ధోరణి వల్ల సామరస్యం దెబ్బతింటుందే తప్ప సమాజానికి మేలు చేకూరదు. ఇప్పుడు జరుగుతున్నదదే.
వార్తల్ని గమనిస్తే – మథురలో జామా మసీదు పక్కనే కాషాయ జెండాలు కట్టారు. మరో రాష్ట్రంలో మసీదులో ప్రార్థనల వేళ పెద్దగా నినాదాలు చేస్తూ, లౌడ్ స్పీకర్లు హోరెత్తించారు. బెంగాల్‌లో అనుమతించిన మార్గంలో కాక రెండు వర్గాలూ ఉండే సున్నితమైన ప్రాంతం మీదుగా కత్తులతో ఊరేగింపు జరిపారు. నిరుటి ఉద్రిక్తతల రీత్యా ఢిల్లీలో ఓ పార్కులో నవమి యాత్ర, నమాజు – రెంటినీ పోలీసులు నిషేధించారు. అయినా కొన్ని మతవాద సంస్థలు అక్కడే యాత్ర, పూజ చేయడాన్ని ఏమనాలి? అదే సమయంలో రెండు చేతులూ కలవనిదే చప్పుడు రాదంటూ రెండోవర్గపు తప్పులు చెబుతున్నవారినీ కొట్టిపారేయలేం.
ఈ హింసాకాండ రాజకీయ నిందలకు దారి తీస్తోంది. ఈ ఘర్షణలకు తమ పాలనలోని లోపాలు, ఉదాసీనతలు కారణమని అంగీకరించడానికి మమత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ సహజంగానే సిద్ధంగా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గూండాలతో బీజేపీ ఈ ఘర్షణలకు పాల్పడుతోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. బెంగాల్ పోలీసులు ఒక వర్గానికే కొమ్ముకాస్తూ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని బెంగాల్ బీజేపీ ఛీఫ్ నింద. ఇక, ఆ రాష్ట్ర గవర్నర్ సైతం బాధితప్రాంతాల్లో పర్యటించి గట్టిగానే గళం విప్పారు.
ఘర్షణలపై కేంద్ర హోమ్‌శాఖ నివేదిక కోరే పరిస్థితి వచ్చింది. శ్రీరామనవమి ఘర్షణలతో గురువారం నాటి హనుమాన్ జయంతికి అప్రమత్తత అవసరమైంది. ఈసారి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జాగరూకతతో వ్యవహరించాల్సిందిగా వివిధ రాష్ట్రాలకు హోమ్ శాఖ బుధవారం సలహా ఇవ్వాల్సి వచ్చింది. కలకత్తా హైకోర్ట్ ఆదేశంతో హనుమాన్ జయంతికి బెంగాల్ సర్కార్ 3 జిల్లాల్లో పారా మిలటరీ దళాలను బరిలోకి దింపాల్సొచ్చింది. ఈ ఘటనలన్నీ ధార్మిక ఉత్సవాలు అతి సున్నితంగా మారిన పరిస్థితులకు దర్పణం.
నిజానికి, ఇలాంటివన్నీ నివారించదగ్గ విపరిణామాలు. ధార్మిక ఉత్సవాలు భారత సమాజంలో ఒక అంతర్భాగం. కానీ, వాటిని ఆసరాగా చేసుకొని, వివిధ మతాల మధ్య విషబీజాలను నాటాలనీ, రాజకీయ లబ్ధి పొందాలనీ చూస్తే అంతకన్నా నేరం, ఘోరం ఉండవు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ ప్రజలు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను అనుసరించేలా రక్షణ కల్పించాలి. వారి ధార్మిక యాత్రలకు భద్రతనివ్వాలి. అది ఆయా ప్రభుత్వాల, అధికార యంత్రాంగాల బాధ్యత.
అదే సమయంలో రెచ్చగొట్టే చర్యలు, నినాదాలు, పుకార్ల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లక్ష్మణరేఖ దాటిన దోషులపై కఠినంగా వ్యవహరించాలి. ప్రతి ఎన్నికలో అధికారపీఠంపై పార్టీలు మారవచ్చేమో కానీ, మారకుండా ప్రజాసేవలోనే ఉండేది పోలీసు యంత్రాంగం. కాబట్టి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు ఏర్పాట్లలో లోపాలను సవరించాలి. విభిన్న వర్గాల మధ్య అపనమ్మకం పెంచే దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలి.
కలసిమెలసి బతకాల్సిన సమాజంలో విషబీజాలను విత్తితే అది యావత్ దేశానికే నష్టం. రాజ కీయ లబ్ధి కోసం అంగలారుస్తున్నవారు అది గ్రహించాలి. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓటర్లను వర్గాలుగా చీల్చాలనే ప్రయత్నాలు పెరిగితే ఆశ్చర్యం లేదు. ఇలాంటి నీచ రాజకీయ వ్యూహాల ఉచ్చులో పడకుండా, జనం అప్రమత్తంగా ఉండాలి.
రాజ కీయ వర్గాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజ్యాంగ విహితంగా వ్యవహరిస్తూ, మారణకాండకూ, మనుషుల్లో చీలికకూ చెక్ పెట్టాలి. ఒక్కమాటలో – సహనం, శాంతి, క్షమ పాటించిన ఆ రాముడైనా, అల్లా అయినా పొరుగువాడిని ద్వేషించమనలేదు. తమ ధర్మం గొప్పదని చాటుకోవడా నికి పరధర్మాన్ని తక్కువ చేయమని ఏ సమాజమూ, ఏ దేవుడూ చెప్పలేదు. అంతర్యామి సైతం హర్షించని ఘర్షణలతో మానవతా ధర్మాన్ని సైతం మర్చిపోతే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ ధర్మంలోనూ లేదు. పాపఫలం మాత్రం ఇక్కడే, ఇప్పుడే మనమందరం అనుభవించాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment