కువైట్‌.. స్వదేశానికి రైట్‌ రైట్‌! | Kuwait government given chance to the Illegal residents | Sakshi
Sakshi News home page

కువైట్‌.. స్వదేశానికి రైట్‌ రైట్‌!

Jan 28 2018 3:58 AM | Updated on Nov 9 2018 5:56 PM

Kuwait government given chance to the Illegal residents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కువైట్‌లోని అక్రమ నివాసితుల కోసం అక్కడి ప్రభుత్వం సరికొత్త అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానాలు లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా జరిమానా చెల్లించి వీసా గడువు పొడిగించుకునే వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ఆ దేశ హోం శాఖ అమ్నెస్టీ డిక్రీ 64/2018ని జనవరి 23న విడుదల చేసింది. ఇది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ డిక్రీ ఆధారంగా అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు సురక్షితంగా దేశం విడిచి వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కువైట్‌ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అక్కడ ఉంటున్న భారతీయులు ఉపయోగించుకోవచ్చు. జరిమానా కట్టి తమ నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవడమో లేదా తిరిగి స్వదేశం రావడమో చేయొచ్చు. ఇందుకోసం భారత రాయబార కార్యాలయం లేదా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగంలోని ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు చూసే ఓ అధికారి మీడియాకు తెలిపారు.  

జరిమానా లేకుండానే.. 
- కువైట్‌లో అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు ఎలాంటి అనుమతి, జరిమానా లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లవచ్చు. ఇలాంటి వారు మళ్లీ సరైన పత్రాలతో, అన్ని అనుమతులతో తిరిగి కువైట్‌కు వెళ్లొచ్చు. అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు కావాలనుకుంటే తగిన జరిమానా చెల్లించి వీసా పొడిగించుకుని అక్కడే ఉండిపోవచ్చు. 
రెసిడెన్సీ నిబంధనలు ఉల్లఘించి నిషేధానికి గురైన వారు, కోర్టు కేసులున్న వారు ఇప్పుడు రెసిడెన్సీ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడి తమకు వీసా వచ్చే అవకాశం ఉందేమో చర్చించుకోవాల్సి ఉంటుంది. 
క్షమాభిక్ష కాలం ముగిశాక మాత్రం ఈ ఉత్తర్వులు చెల్లవు. క్షమాభిక్ష సమయంలో దొరికిన వారిని వెంటనే ఆయా దేశాలకు తరలిస్తారు. ఈ సమయంలో దేశం విడిచి పెట్టని వారిపై జరిమానా విధిస్తారు. వారికి వీసా ఇవ్వకుండా, స్వదేశం పంపించేస్తారు. వారు తిరిగి కువైట్‌ రాకుండా నిషేధిస్తారు. 

నిబంధనలు తెలీక జైలు పాలు 
ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. అక్కడ ఇళ్లల్లో సహాయకులుగా, వివిధ కంపెనీల్లో కార్మికులుగా, పశువుల కాపర్లుగా, నిర్మాణ రంగంలో పని చేయడానికి పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే సరైన వీసా లేకపోవడం, యాజమాన్యంతో విబేధాలొచ్చి బయటకు వచ్చే వాళ్ల సంఖ్యా ఎక్కువే. కువైట్‌ వెళ్లే వారికి వివిధ పనుల కోసం భిన్నరకాల వీసాలు ఇస్తుంటారు. వాటిని కాదని వేరే పనులకు వెళ్లకూడదు. అంటే ఇంట్లో సహాయకులుగా పని చేయడానికి వెళ్లిన వారు, అక్కడ ఇబ్బంది ఎదురై ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే వారిని నేరుగా వేరే పనిలో పెట్టుకోకూడదు. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. తెలిసో తెలియకో కొందరు వీసా నిబంధనలు ఉల్లంఘిస్తారు. ఇంకొందరి విషయంలో యాజమాన్యాలు పాస్‌పోర్టు, వీసా తమ దగ్గర ఉంచేసుకుని వారికి తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీనికితోడు పాస్‌పోర్టు, వీసా కాల పరిమితి ముగిసిపోవడం మరో సమస్య. దాక్కున్న వారిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటుంది. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న వారు, చిన్న తప్పులకు జైలు పాలైన వారికి సాధారణంగా రంజాన్‌ మాసంలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతుంది. ఇది రెండేళ్లకోసారి జరిగే ప్రక్రియ. కానీ కొన్నేళ్లుగా కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు.

అవకాశాన్ని వినియోగించుకోండి
కువైట్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు ఆ దేశం ప్రకటించిన క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వేర్వేరు కారణాలతో చట్ట వ్యతిరేకంగా అక్కడ ఉంటున్న విదేశీయులకు ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించిందని పేర్కొంది.

అందరికీ తెలియాలి 
22 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిన్న తప్పులతోనే జైలు పాలైన వారు, పాస్‌పోర్టు కాలపరిమితి ముగిసిన వారు, అక్రమ నివాసితులు దాదాపు 30 వేల మంది కువైట్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారు డబ్బులుంటే స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు. కొందరికి ఎంబసీ, స్వచ్ఛంద సంస్థలు స్వదేశానికి వెళ్లడానికి టికెట్‌ ఖర్చులు ఇస్తాయి. ఏడేళ్లుగా కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ఇవ్వలేదు. వీసాతోపాటు ఇక్కడ పని చేసేందుకు ఇచ్చే అనుమతిని ‘అకామా’అంటారు. అది కచ్చితంగా ఉండాలి. మేం ఇప్పటికే దీని గురించి ప్రచారం ప్రారంభించాం. ఇలాంటి నిబంధన వచ్చిందని చాలా మందికి తెలియదు. దీని గురించి అందరికీ చెప్పాలనేదే మా ప్రయత్నం.
–కొల్లాబత్తుల రాజు, కువైట్‌లో ఉంటున్న తెలంగాణ వాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement