ఇప్పటికైనా గ్రహిస్తారా?! | Sakshi Editorial On Road Accidents | Sakshi
Sakshi News home page

ఇప్పటికైనా గ్రహిస్తారా?!

Published Thu, Jan 4 2024 12:05 AM | Last Updated on Sat, Jan 6 2024 3:36 AM

Sakshi Editorial On Road Accidents

సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి.

చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది.

ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? 

మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు.

అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది.  2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్‌ఎస్‌ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి.

ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్‌లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్‌ఎస్‌లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది.  పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. 

అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్‌ఎస్‌ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. 

నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్‌ఎస్‌లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది.

అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement