Road Accidents Hyderabad: దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమూ కారణమే. ప్రమాద సమయంలో ఆ కారు గంటకు 100 కి.మీకి పైగా వేగంతో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వాహనం ప్రయాణించిన కారణంగానే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఫలితం దక్కలేదు. కేవలం ఈ ఒక్క ప్రమాదమే కాదు.. సిటీలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం అతివేగం వల్లే జరుగుతున్నాయని పోలీసులే అంగీకరిస్తున్నారు. సిటీ రహదారులు గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణించడానికి మాత్రమే అనువైనవని రవాణా రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గంటకు 65 కి.మీలు వేగం దాటితే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అని వివరిస్తున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యం, వాటి పైకి వస్తున్న వాహనాల గరిష్ట వేగానికి మధ్య పొంతన లేకపోవడం గమనార్హం.
ఆ రెంటికీ సంబంధం లేదు..
►రాజధానిలో వాహనాల సరాసరి వేగం గంటకు 25 కి.మీ మించట్లేదు. రహదారులు పరిస్థితి, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న కొత్త వాహనాలు, ఆక్రమణలు సహా మరెన్నో దీనికి కారణంగా మారుతున్నాయి. మరోపక్క సిటీ రహదారులు గంటకు గరిష్టంగా 50 కిమీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేసినవే.
►నగర రోడ్ల పైకి కొత్తగా వస్తున్న, ఇప్పటికే ఉన్న వాహనాల గరిష్ట వేగం గంటకు 200 కి.మీపైగా ఉంటోంది. దిగుమతి చేసుకున్న వాహనాలది ఇంతకంటే ఎక్కువే. రహదారుల స్థితిగతులు, వాహనాల గరిష్ట వేగం మధ్య ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ వీటిని నియంత్రించే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం, నిబంధనలు లేవని పేర్కొంటున్నారు.
చదవండి: (ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే బజ్జీ !)
రాత్రి వేళల్లోనే ఎక్కువ..
►వాహనాల రద్దీ, ట్రాఫిక్ పోలీసుల నిఘా తదితర కారణాల నేపథ్యంలో పగటి పూట సిటీ రహదారులపై మితిమీరిన వేగానికి ఆస్కారం లేదు. కొన్ని రోడ్లలో వేగంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. జంక్షన్లలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే సిగ్నల్స్ కారణంగా దీనికి బ్రేక్ తప్పట్లేదు.
►కేవలం ఇన్నర్ రింగ్ రోడ్, శివారు రహదారులు వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పగటిపూట వేగంగా, ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రయాణించే ఆస్కారం ఉంది. రాత్రి వేళల్లో రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఫలితంగా వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణించడంతో పాటు రేసింగ్స్ వంటివి జరుగుతున్నాయి. ఏటా నగర రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా బాధితులుగా మారుతోంది పాదచారులే కావడం గమనార్హం.
►వాహన వేగం మితిమీరి ఉంటే... ఈ సమయంలోపే డ్రైవర్ లేదా ప్రయాణికులు స్టీరింగ్, డ్యాష్‌బోర్డ్, సీట్లకు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ఎయిర్ బ్యాగ్స్ పేలిపోవడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా వాహనంలోని వారిని రక్షించలేవు.
►హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం 1,785 ప్రమాదాలకు కారణమైంది. ఫలితంగా 213 మంది చనిపోయారు. 1,548 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 237 ప్రమాదాలు జరిగాయి. వీటిలో ఓవర్ స్పీడింగ్‌తో జరిగినవి 178.
కొంపల్లిలో కారు బీభత్సం
కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో కారు నడపడంతో వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఛోటాబజార్‌కు చెందిన సాయి శ్రీనివాస్ (27) అకౌంటెంట్. ఆదివారం రాత్రి ఆర్మూర్ నుంచి నగరానికి కారులో తన స్నేహితులు పిండిత శ్రీకాంత్, పవన్‌లతో కలిసి వస్తున్నారు.
ఈ క్రమంలో కొంపల్లిలోని మహీంద్రా షోరూమ్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి డివైడర్ గ్రిల్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీశారు. వీరికి బ్రీతింగ్ అనలైజ్ పరీక్ష చేయడంతో మద్యం తాగినట్లు వెల్లడైంది. వీరిపై ఐపీసీ సెక్షన్ 337, 185 కింద కేసులు నమోదు చేశారు. సదరు కారుపై ఇప్పటికే 3 చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment