ప్రస్తుతానికి తాత్కాలికమే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉద్యోగుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడివారు అక్కడే
సెక్రటేరియట్ అధికారులు, హెచ్‌వోడీల్లో మార్పులు
ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర హోంశాఖతో కమలనాథన్, సీఎస్ భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రస్తుతానికి తాత్కాలికంగానే ఉద్యోగుల విభజన చేపట్టాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఉద్యోగుల విభ జనకు సంబంధించి ఇరు ప్రాంతాల నుంచి వేర్వేరు డిమాండ్లు వస్తుండటం, కొద్ది రోజుల్లోనే ఏర్పడనున్న కొత్త ప్రభుత్వాలు దీనిపై తమ విధానాన్ని తెలిపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో... శాశ్వత మార్గదర్శకాల రూపకల్పనకు మరింత సమయం పట్టవచ్చని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు, ఉద్యోగుల విభజన అంశాలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ బుధవారం నార్త్‌బ్లాక్‌లో సమావేశం నిర్వహించింది. దీనికి హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, డీవోపీటీ కార్యదర్శి శ్యామేల్‌కుమార్ సర్కార్, ప్రభుత్వ సీఎస్ పీకే మహంతి, ఉద్యోగ విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల కమిటీ చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ హాజరయ్యారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి చేసిన కసరత్తుపై రాష్ట్ర అధికారులు నివేదికలు సమర్పించారు. ఇదే సమయంలో ఉద్యోగుల తుది పంపిణీని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక చర్చించాకే పంపిణీ చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వాలు ఏర్పాటు కాకుండా ఉద్యోగుల తుది పంపిణీ సాధ్యం కాదని... అలా చేస్తే వచ్చేసమస్యలను పరిష్కరించడం కష్టతరమని రాష్ట్ర అధికారులు కేంద్ర హోంశాఖకు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులు జరపాలని సూచించినట్లు సమాచారం.
దీంతో విభజన అనంతరం ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేయాలని, దీనికోసం ప్రభుత్వం నుంచి ఆర్డర్ టు సర్వ్ కింద ఉత్తర్వులు జారీచేయాలని నిర్ణయించారు. ఇక సెక్రటేరియట్ స్థాయిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, శాఖాధిపతుల్లో మాత్రం చిన్నపాటి మార్పులు చేర్పులతో కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సీఎస్ మహంతి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి తాత్కాలిక కేటాయింపులుంటాయి. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు, అధికారులు ఎక్కడివారు అక్కడే పనిచేస్తారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి శాశ్వత మార్గదర్శకాలు సిద్ధం అయ్యాక శాశ్వత కేటాయింపులు ఉంటాయి’ అని తెలిపారు.
ప్రతిపాదనలు చేసిన బాబు!: అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు పలు ప్రతిపాదనలు కేంద్ర హోంశాఖకు పంపినట్లు తెలిసింది. బాబుతో పాటు కొందరు ఇతర పార్టీల నేతలు సైతం ప్రతిపాదనలు పంపారు. బుధవారం నాటి సమావేశంలో వీటిపైనా చర్చ జరిగినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని శాశ్వత మార్గదర్శకాలు తయారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.