బంగబంధు కుమార్తెలు రెహానా, ప్రధాని హసీనాలకు శాంతి బహుమతి అందజేస్తున్న భారత ప్రధాని మోదీ
ఢాకా: 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో (ముక్తి జుద్దో) బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంతోపాటు భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్ పరేడ్ స్క్వేర్‌లో దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు. ఈ రక్తం రెండు దేశాల నడుమ గొప్ప అనుబంధాన్ని ఏర్పర్చిందని, దాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టలేరని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి వెనుక అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కృషి మరువలేనిదన్నారు.
రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం
బంగబంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చారని, ముక్తి వాహినిగా మారారని మోదీ అన్నారు. 1970వ దశకంలో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అకృత్యాలకు సంబంధించిన చిత్రాలు భారతీయులను కలచి వేసేవని గుర్తుచేశారు. అప్పట్లో తన వయసు 20–22 అని, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగా మిత్రులతో కలిసి సత్యాగ్రహం చేశానని వివరించారు. రాబోయే 25 సంవత్సరాలు భారత్, బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకమని చెప్పారు.
మన వారసత్వాన్నే కాదు అభివృద్ధిని, లక్ష్యాలను, అవకాశాలను కూడా పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో భారత్, బంగ్లాదేశ్‌కు ఒకే తరహా అవకాశాలు ఉన్నట్లే, ఉగ్రవాదం లాంటి ఉపద్రవాలు కూడా పొంచి ఉన్నాయని మోదీ హెచ్చరించారు. వాటిని ఎదిరించడానికి ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ఇండో–బంగ్లా సంబంధాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా 50 మంది బంగ్లాదేశీ పారిశ్రామికవేత్తలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. అంతకుముందు భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు.
‘పొరుగు ప్రథమం’ భేష్
దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి చొరవ తీసుకోవాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రసంగించారు. భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘పొరుగు ప్రథమం’ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. బంగ్లాదేశ్‌తోపాటు ఇరుగు పొరుగు దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం సరఫరా చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. ఢాకా–న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరాయని తెలిపారు.
బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి
షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని ఆయన కుమార్తెలు షేక్ రెహానా, షేక్ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. ఈ వేడుకల్లో ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళిగా ఖాదీ బట్టతో తయారైన నల్లరంగు ముజీబ్ జాకెట్‌ను మోదీ ధరించారు. ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఢాకాలో అధికార మహాకూటమి నేతలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు.
ఆందోళనల్లో నలుగురి మృతి
మోదీ రాకను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాలు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఆందోళన చేపట్టాయి. పొలీసులతో ఘర్షణకు దిగాయి. చిట్టగాంగ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురు మరణించినట్లు తెలిసింది. అలాగే మరో 12 మంది గాయపడ్డారు. ఢాకాలో జరిగిన ఘర్షణలో 50 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment