
ఢాకా–చిట్టగాంగ్ రహదారిపై టైర్లను తగులబెడుతున్న ఆందోళనకారులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ సంస్థ హెఫాజత్–ఇ–ఇస్లామ్ పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. భారత ప్రధాని మోదీ పర్యటనపై హెఫాజత్–ఇ–ఇస్లామ్ తదితర సంస్థలు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు మృతి చెందటాన్ని నిరసిస్తూ ఈ బంద్ జరిగింది. నారాయణ్‌గంజ్ జిల్లా సనర్‌పారాలో పోలీసు కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. నిరసనకారులు రాజధాని ఢాకాతో తీరప్రాంత నగరం చిట్టగాంగ్‌తో కలిపే ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పెద్ద సంఖ్యలో బస్సులు, ట్రక్కులకు నిప్పుపెట్టారు.
దీంతో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. బ్రహ్మణ్‌బారియా జిల్లాలో ఆందోళనకారులు రైలుపై దాడికి దిగారు. ఇంజిన్ రూం సహా అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పది మంది వరకు గాయాలపాలయ్యారు.ఇదే జిల్లా సరైల్‌లో భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. అల్లర్ల అనంతరం ఈ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. బంద్ కారణంగా రాజధాని ఢాకాలో వీధులు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ నేరుగా మద్దతు ప్రకటించలేదు. కాగా, హెఫాజత్–ఇ–ఇస్లామ్ బంగ్లాదేశ్ వ్యాప్తంగా మత విద్యాసంస్థలు నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment