సాక్షి, ముంబై: త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి. అమరావతి నగరంలో స్థానిక బీజేపీ కార్యకర్తలు చేపట్టిన బంద్ సందర్భంగా హింస చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా మూడు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. త్రిపురలో మైనార్టీలపై దాడిచేసి, ఓ ప్రార్థనా మందిరాన్ని దుండగులు «ధ్వంసం చేశారన్న వార్తలతో అమరావతిలో శుక్రవారం ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వి, ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. శుక్రవారం జరిగిన హింసను వ్యతిరేకిస్తూ శనివారం అమరావతి బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ బంద్ సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్వాయి. ఉదయాన్నే వందలాది మంది కాషాయం జెండాలు చేతబూని వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌కమల్ చౌక్‌తోపాటు పలు ప్రాంతాల్లో దుకాణాలపై రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనకారులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులపాటు చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకొని పోలీసులు అమరావతి నగర పరిధిలో కర్ఫ్యూ విధించారు. నాందేడ్, నాసిక్, యావత్మల్ తదితర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ నేతలు బలవంతంగా దుకాణాలు మూసివేయించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, హోంశాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో బీజేపీ కార్యకర్తల బంద్ దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment