మన పొరుగు దేశం, మనతో సాన్నిహిత్యాన్ని నెరపుతున్న దేశం బంగ్లాదేశ్. భౌగోళికంగా, జనాభా రీత్యా అది చిన్న దేశమే కావొచ్చు. కానీ దానితో మనకు 4,096 కిలోమీటర్ల సరిహద్దువుంది. ఇందులో దాదాపు 1,116 కిలోమీటర్ల మేర నదీ పరీవాహ ప్రాంతం. వలస పాలకులు వదిలివెళ్లిన సరిహద్దు వివాదాన్ని అయిదేళ్లక్రితం రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలి గాయి. తీస్తా నదీ జలాల విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అమలు చేయదల్చుకున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్‌ఆర్‌సీ), జాతీయ ప్రజా నమోదు పట్టిక(ఎన్‌పీఆర్) బంగ్లాదేశ్‌లో కలవరం కలిగిస్తున్న సూచనలు కొంతకాలంగా కనబడుతున్నాయి. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ అమలు మొదలైన తర్వాత వరసగా ఇద్దరు బంగ్లాదేశ్ మంత్రులు మన దేశంలో జరిపే పర్యటనలు వాయిదా వేసు కున్నారు. అందుకు కారణాలేమిటో బాహాటంగా చెప్పలేదు. కానీ మన దేశానికి విషయమేమిటో అర్థమైంది. ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ అస్సాంలో పూర్తయ్యాక పరాయివారిగా తేలిన 19 లక్షలమందిలో ముస్లింలు కూడా గణనీయంగావున్నారు. వీరంతా బంగ్లా నుంచి వచ్చినవారేనని మన కేంద్ర మంత్రులు చెబుతుండటం ఆ దేశానికి అంత రుచించడంలేదు.
తమ గడ్డపై నుంచి ఎవరూ అక్రమంగా భారత్ వెళ్లలేదన్నదే వారి వాదన. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రెండురోజుల క్రితం సీఏఏపై తొలిసారి నేరుగా మాట్లాడారు. అయితే సాధ్యమైనంత లౌక్యంగా ఉండే ప్రయత్నం చేశారు. సన్నిహితంగా మెలగుతున్న రెండు ఇరుగు పొరుగు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఎవరికీ మంచిది కాదు. మన ఇరుగు పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ మినహా మిగిలినవన్నీ పైకి ఏం చెబుతున్నా ఏదోమేర ఇప్పటికే చైనాకు దగ్గరయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్‌తోనూ ఇలాంటి పరిణామాలే ఏర్పడొచ్చునా అనే సందేహం హసీనా వ్యాఖ్యలు చూశాక పలువురిని కలవరపెడుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనలోవున్న హసీనాను అక్కడి పాత్రికేయులు ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు భారత్ ఆంతరంగిక వ్యవహారమని చెబుతూనే, సీఏఏ అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అసలు దాన్నెందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. సీఏఏలో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ లతోపాటు బంగ్లాదేశ్‌ను కూడా ప్రస్తావించి అక్కడున్న మైనారిటీలు హింసకూ, అణచివేతకు గురవుతున్నారని, అటువంటివారికి పౌరసత్వం ఇవ్వడమే ఉద్దేశమని చట్టం చెప్పడంపై హసీనాకు తీవ్ర అభ్యంతరాలే వున్నట్టు ఈ వ్యాఖ్య తేటతెల్లం చేస్తోంది.
అంతేకాదు...ఆమె మరో మాటన్నారు. ఆంతరంగికంగా భారత ప్రజలకు సమస్యలున్నమాట యదార్థమని హసీనా చెప్పారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ కింద స్థానికేతరులుగా తేలిన 19 లక్షలమంది పౌరులూ భారత్‌లోని వేరే ప్రాంతాల నుంచి అక్కడికెళ్లినవారు అయివుండొచ్చని ఈ మాటలద్వారా ఆమె చెప్పదల్చుకున్నట్టు కనబడు తోంది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేసి, ఇలాగే మరిన్ని లక్షలమంది పౌరులు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని ముందూ మునుపూ భారత్ అనే ప్రమాదం వున్నదని బంగ్లాదేశ్ నేతలు అనుమా నిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా హసీనా స్పష్టంగానో, అస్పష్టంగానో తన అభిప్రాయం వివరించే యత్నం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో మైనారిటీలను వేధి స్తున్నారని, బాధిస్తు న్నారని చెబితే ఎవరైనా విశ్వసించడం పెద్ద కష్టం కాదు. కానీ బంగ్లాదేశ్‌ను సైతం ఆ గాటనే కట్టడం సరైందేనా? ఒక అంచనా ప్రకారం 16.10 కోట్లమంది బంగ్లా జనాభాలో 10.7 శాతంమంది హిందువులు కాగా, 0.6 శాతంమంది బౌద్ధులు. బంగ్లాలో వుండే ఛాందసవాద ఇస్లామిక్ సంస్థలు అన్య మతస్తులపైనా, తమ మతంలో సెక్యులరిస్టులుగా వుండేవారిపైనా దాడులకు దిగడం రివాజు.
ఈ కారణంవల్లే బంగ్లాదేశ్‌తో మనకు అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వున్న సరిహద్దుల వద్ద అక్రమంగా మన దేశంలోకి అనేకులు వలసవస్తుంటారని ఆ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ఆరోపిస్తుంటారు. అటు అఫ్ఘానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సైతం హసీనా మాదిరే వాదిస్తున్నారు. తమ దేశంలో అందరికీ వేధింపులుంటాయని సీఏఏలో హిందువులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు మాత్రమే వేధింపులు ఎదుర్కొంటున్నట్టు చెప్పడం సరికాదంటున్నారు. అక్రమ వలసలుంటున్నాయా లేదా, ఉంటే అవి ఏ మేరకుంటున్నాయన్నది అంత సులభంగా తేలేదికాదు. ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్, సీఏఏల వల్ల అంతా తేటతెల్లమవుతుందనుకోవడం కూడా సరికాదు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ అమలైన తీరే అందుకు ఉదాహరణ. అడిగిన పత్రాలు చూపలేని కారణంగా ఇప్పుడు స్థానికేతరులుగా లెక్కతేలి, నిర్బంధ శిబిరాల్లో వుంటున్నవారిలో ఆ పత్రాల్ని భద్రపరచుకోలేక జాబితాకెక్కిన అమాయకులెందరో ఉండొచ్చు. రేపు దేశమంతా అదే స్థితి తలె త్తదన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఇరుగు పొరుగుతో... ముఖ్యంగా బంగ్లాదేశ్ వంటి మిత్ర దేశంతో పొరపొచ్చాలు రావడం మంచిది కాదు.
ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా వైపు చూస్తున్న ధోర ణులు కనబడుతున్నాయి. హసీనా గత జూలైలో ఆ దేశం పర్యటించి పలు ఒప్పందాలు కుదు ర్చుకున్నారు. త్వరలో బంగ్లాదేశ్ పితామహుడు ముజిబుర్ రెహ్మాన్ శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. అందులో ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు పాల్గొనాల్సివుంది. ఈ ఉత్సవాలకు ముందు మన దేశంపై హసీనా ఇలా వ్యాఖ్యానించడం, పైగా వేరే దేశంలో పర్యటిస్తుండగా మాట్లాడటం గమనిస్తే ఆమె ఆగ్రహం అర్థమవుతుంది. మన ప్రభుత్వం దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని, చాకచక్యంతో వ్యవహరించి ఇరుగు పొరుగులో తలెత్తే అసంతృప్తిని పోగొట్టాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment