తీవ్ర నిరసనలు, అట్టుడికిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్నపళంగా దేశం వీడాల్సి వచ్చింది. రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాలో ప్రస్తుతం దేశ పాలన సైన్యం నియంత్రణలోకి తీసుకుంది. నిరసన కారులను శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు దేశ ఆర్మీ ప్రయత్నిస్తోంది. అదేవిధంగా నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ సలహాలతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తలు ప్రతిపాదించారు.
దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా తన సమ్మతిని తెలిపారు.
తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హసీనా రాజకీయ విరోధి, మాజీ ప్రధాని ఖలీదా జియా. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లాం.
ఖలీదా జియా.. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు రాష్ట్రపతి ఆదేశించారు. అధికారాన్ని ఆర్మీ హస్తగతం చేసుకున్న వెంటనే ఈమేరకు దేశాధ్యక్షుడి నుంచి ఆదేశాలు వెలువడటం గమనార్హం. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది.
ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన రాజకీయ నాయకురాలు. అలాగే దేశ తొలి మహిళా ప్రధాని. 1991 నుంచి 1996, 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేశారు. ఖలీదా 1996లో రెండవసారి పీఎంగా గెలిచినప్పటికీ షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఆమె రెండవ పదవీకాలం 12 రోజులు మాత్రమే కొనసాగింది. అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తరువాత ఎన్నికలు నిర్వహించగా.. హసీనా ప్రధానిగా గెలుపొందారు.
2007లో ఖలీదా అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. 2018లో దోషిగా నిర్ధారించడంతో జైలు శిక్ష పడింది. అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఎక్కువ కాలం ఆమె ఆసుపత్రిలోనే గడిపారు. మరి ఈ సమయంలో విడుదలవుతున్న ఖలీదా ప్రధానమంత్రి పదవిని చేపడతారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు.
మహమ్మద్ యూనస్.. అతను 1983లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించాడు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో రుణాలను (రూ 2,000 వరకు) అందిస్తుంది. ఇది లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడటానికి సహాయపడుతోంది. అందుకే యూనస్‌కు ి 'పేదలకు బ్యాంకర్' అనే మారుపేరు వచ్చింది. ఈ మోడల్ ఇప్పుడు 100 కంటే ఎక్కువ దేశాలలో కొనసాగుతోంది.
బంగ్లాదేశ్‌లో కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న మైక్రోఫైనాన్స్ సంస్థ అయిన గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అయితే యూనస్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. జూన్‌లో తన టెలికాం కంపెనీ అయినా గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి 252.2 మిలియన్ టాకా (రూ. 219.4 కోట్లు) నిధుల దుర్వినియోగం చేసిన ఆరోపణలపై అభియోగాలు మోపారు.
కానీ తనపై అభియోగాలు రాజకీయ ప్రోద్బలంతో మోపారని ఆరోపించారు.జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత అధికారాన్ని కైవసం చేసుకునేందుకు షేక్ హసీనా ప్రత్యర్థులు పెనుగులాడుతుండగా.. విద్యార్థులు మాత్రం యూనస్‌ను ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు విద్యార్ధులు అంగీకరించడం లేదు.
నహీద్ ఇస్లాం..26 ఏళ్ల నహీద్ ఇస్లాం సోషియాలజీ విద్యార్థి. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశాడు. ఈ కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు. చివరకు హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేతకు దారి తీసిన నేత ఇస్లాం.
జూలై 19వ తేదీన సుమారు 25 మంది నహిద్ ఇస్లామ్‌ను ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. అతని కళ్లకు గంతలు కట్టి, చేతులకు బేడీలు వేసి వేధించారు. రెండు రోజుల తర్వాత పూర్బాచల్ వద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అతన్ని అపస్మారక స్థితిలో గుర్తించారు. జూలై 26వ తేదీ మరోసారి కూడా అతన్ని కిడ్నాప్ చేశారు. గోనోసహస్త్య నగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో.. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్, హా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకునే కొందరు అతన్ని అపహరించారు. కానీ నహిద్‌ను తాము ఎత్తుకెళ్లలేదని ఢాకా డిటెక్టివ్ పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment