భారత్‌పై జిన్‌పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
గోవా: పాకిస్థాన్ విషయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు కుంటుపడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మనదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ ప్లీనరీలో మాట్లాడిన జిన్‌పింగ్ 2014లో తాను భారత్‌ను సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. '2014లో నేను భారత్ వచ్చాను. ఈ గొప్ప దేశానికి చెందిన కష్టపడే ప్రజలు, రంగురంగుల సంస్కృతి నన్ను చాలా ముగ్ధున్ని చేశాయి' అని పేర్కొన్నారు. బ్రిక్స్ సహకారం ప్రారంభమై ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతున్నదని, ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల బ్రిక్స్ దేశాలకు ఫలప్రదంగా మారాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 'మనం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. బ్రిక్స్ దేశాలమైన మనం మంచి స్నేహితులుగా, సోదరులుగా, భాగస్వాములుగా ఉండి ఒకరినొకరు నిజాయితీగా గౌరవించుకోవాలి' అని జిన్‌పింగ్ సూచించారు.
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శనివారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరుదేశాల విశ్వాసాన్ని మరింతగా పాదుకోల్పాలని నిర్ణయించినట్టు ఈ భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చైనా పేర్కొంది. అయితే, భారత్ కీలకంగా భావిస్తున్న ఉగ్రవాదంపై పోరులో ఐక్యత, అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ)లో భారత్ స్వభ్యత్వానికి మద్దతు అంశాలపై చైనా తన అధికారిక ప్రకటనలో ప్రస్తావించకపోవడం గమనార్హం. పాక్ ఉగ్రవాది మసూద్ అజార్ పై ఐరాస ఆంక్షల విషయంలోనూ మరింత సంప్రదింపులు జరిపి సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నట్టు చైనా పేర్కొంది.