పాక్‌పై బ్రిక్స్ దేశాలకు మోదీ స్ట్రాంగ్ మెసేజ్!
గోవా: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ విషయంలో బ్రిక్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గట్టి సందేశం ఇచ్చారు. ఉగ్రవాద గ్రూప్‌లు, ఉగ్రవాదుల విషయంలో ఉద్దేశపూరిత సంకుచిత వైఖరి ఎంతమాత్రం ప్రయోజనకరం కాదని, భవిష్యత్తులో ఇది భస్మాసుర హస్తం కాగలదని ఆయన చైనా సహా ఇతర బ్రిక్ దేశాలను హెచ్చరించారు. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా ఆ దేశం ఉగ్రవాదం విషయంలో అవలంబిస్తున్న ద్వంద్వ విధానాల్ని ప్రధాని మోదీ కడిగిపారేశారు. ఉగ్రవాదానికి మాతృత్వ దేశంగా పాకిస్థాన్ మారిపోయిందని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ ప్లీనరీ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ టాప్ వ్యాఖ్యలివే.
- ప్రస్తుతం మనం నివసిస్తున్న ప్రపంచంలో భద్రత, ఉగ్రవాద నిరోధం అత్యవసరంగా మారిపోయాయి. మన ప్రగతి, పురోగతి, సౌభాగ్యాలపై ఉగ్రవాదం పడగనీడ పరుచుకుంది.
- మన ఆర్థిక సుసంపన్నతకు ఉగ్రవాదం ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది. విషాదకరంగా దీని మాతృత్వం పొరుగుదేశంలో ఉంది.
- ఆ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడమే కాదు.. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదం సమంజసమైనదేనని దృక్పథాన్ని ఆ దేశం గట్టిగా చాటుతోంది.
- ఉగ్రవాదులకు అందుతున్న నిధులు, ఆయుధాలు, శిక్షణ, రాజకీయ మద్దతును వ్యవస్థాగతంగా దూరం చేయాల్సిన అవసరం ఉంది.
- ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మన జాతీయ భద్రతా సలహాదారుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై తొందరగా ఒక సమగ్ర తీర్మానాన్ని చేయాలి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దృఢమైన నిశ్చయాన్ని ప్రకటించాలి.