పాక్ ఉగ్రమూకలకు బ్రిక్స్ వార్నింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి తొలిసారి పాకిస్థాన్ ఉగ్రమూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హక్కానీ నెట్‌వర్క్ తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను తొలిసారి ప్రస్తావించింది. ఉగ్రవాదం విషయంలో ఇన్నాళ్లు పాకిస్థాన్‌ను చైనా గుడ్డిగా వెనకేసుకొస్తున్న నేపథ్యంలో బ్రిక్స్ కూటమి నేరుగా పాక్‌లోని ఉగ్రమూకలను పేరు ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'అమాయకులైన ఆఫ్గన్ ప్రజల మృతికి కారణమైన ఉగ్రవాద దాడులను మేం ఖండిస్తున్నాం. ఇదే విషయమై ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై, తాలిబన్, ఐసిస్/డాషే, అల్‌కాయిదా, వాటి అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఉజ్బెకిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, హక్కాని నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్-తాహిర్ వాటి వల్ల తలెత్తుతున్న హింసపై, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం' అని బ్రిక్స్ దేశాధినేతల ఉమ్మడి డిక్లరేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉత్తర కొరియా అణుపరీక్ష నిర్వహించడాన్ని బ్రిక్స్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం చైనా జియామెన్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.