వాషింగ్టన్: ఉగ్ర గ్రూపుల భరతం పట్టాలని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. టెర్రరిస్టు గ్రూపులపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని, వారి స్ధావరాలను ధ్వంసం చేయాలని కోరింది. తమ భూభాగంలో ఉగ్ర మూకలను ఏరివేయాలని తాము పలుమార్లు పాక్‌ను కోరామని విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చెప్పారు. ఉగ్రవాదుల స్ధావరాలు, కార్యకలాపాలపై తాము అవసరమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేసి, వారి నుంచి నిర్థిష్ట చర్యలు కోరుతున్నామని దక్షిణాసియా పర్యటన ముగింపు సందర్భంగా టిల్లర్‌సన్ పేర్కొన్నారు.
75 మంది ఉగ్రవాదుల వాంటెడ్ జాబితాను పాక్‌కు అందించిన అమెరికా హఖాని నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు చేపట్టాలని ఒత్తిడి పెంచింది. అయితే పాకిస్తాన్‌కు అమెరికా ఎలాంటి జాబితా ఇవ్వలేదని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ పేర్కొనడం గమనార్హం.
తమ డిమాండ్లపై పాకిస్తాన్‌కు సవివర నివేదిక ఇచ్చామని పాక్ నుంచి చర్యల కోసం ఎదురుచూస్తున్నామని టిల్లర్‌సన్ చెప్పుకొచ్చారు. ఉగ్రమూకలు ఎక్కడున్నా వాటిని ఏరివేసేందుకు పాకిస్తాన్ చొరవ చూపేలా మరిన్ని చర్యలుంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment