
కిగాలి, రువాండా : ఆఫ్రికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి రువాండా చేరుకున్నారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే ఎయిర్‌పోర్టుకు వచ్చి మోదీకి సాదర స్వాగతం పలికినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే దిశగా చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. పాల్ కగామేతో భేటీ సందర్భంగా రువాండాకు 2 వందల మిలియన్ డాలర్ల రుణాన్ని అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. రువాండాలో భారత హై కమిషన్‌ను ప్రారంభించడం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవచ్చని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, రక్షణ, వ్యాపారం తదితర రంగాల్లో పరస్పర సహకారానికై రువాండాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మోదీ తెలిపారు.
జిన్‌పింగ్ తర్వాత మోదీ..
తూర్పు ఆఫ్రికా దేశమైన రువాండా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా అభివృద్థి చెందుతోంది. ఆసియా దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రువాండాలో పర్యటించారు. ప్రస్తుతం మోదీ కూడా ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా మొదటగా రువాండా చేరుకున్నారు. భారత్ రుణంగా అందించిన 2 వందల మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణం కోసం, మరో వంద మిలియన్ డాలర్లు వ్యవసాయం కోసం ఖర్చు చేయనున్నట్లు రువాండా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా పేద కుటుంబాల ఉపాధి కోసం రువాండా ప్రభుత్వం చేపట్టిన ‘గిరింకా’ (కుటుంబానికి ఒక ఆవు చొప్పున అందించే కార్యక్రమం)లో పాల్ కగామేతో కలిసి మోదీ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా భారత్ తరపున 200 ఆవులను మోదీ రువాండా ప్రజలకు కానుకగా ఇవ్వనున్నారు. కాగా రువాండాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బుధవారం బ్రిక్స్ సదస్సులో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment