బ్రిక్స్ వార్షిక సదస్సు ప్రారంభం
ప్రధాని మోదీకి స్వయంగా స్వాగతం పలికి.. కరచాలనం చేసిన జిన్‌పింగ్
సాక్షి, జియామెన్: ప్రతిష్టాత్మక బ్రిక్స్ తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు సోమవారం ఉదయం చైనాలోని జియామెన్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బ్రిక్ దేశాల అధినేతల కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అంతకుముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్నేహపూర్వక వైఖరిని కనబరుస్తూ కరచాలనం చేశారు. రెడ్ కార్పెట్‌పై ప్రధాని మోదీతో సహా బ్రెజిల్, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలను జిన్‌పింగ్ స్వయంగా సదస్సుకు ఆహ్వానించారు.
బ్రిక్స్ సదస్సు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న మూడో నేత ప్రధాని మోదీ. ఆయన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేరుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం జిన్‌పింగ్‌తో భేటీ అయి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
డోక్లాం సరిహద్దు వివాదం నేపథ్యంలో జరుగుతున్న తొలి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్ సదస్సు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో డోక్లాం కొండప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు ఉపసంహరించుకునేందుకు అంగీకరించి.. వివాదానికి తెరదించిన సంగతి తెలిసిందే. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి అయిన బ్రిక్స్ సదస్సులో శాంతియుతంగా చర్చలు చేపట్టాలని, స్నేహపూర్వక వైఖరికి పెద్దపీట వేయాలని అధినేతలు భావిస్తున్నారు.
వివాదాస్పద అంశాల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు దౌత్యమార్గాన్ని కొనసాగించాలని జిన్‌పింగ్ ఇప్పటికే పిలుపునిచ్చారు. భారత్‌తో ఇటీవలి డోక్లాం వివాదం ప్రస్తావన లేకుండా.. విభేదాల పరిష్కారానికి శాంతి, అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని, ప్రపంచం యుద్ధ, ఘర్షణ పూరిత వాతావరణం కోరుకోవడం లేదని స్నేహపూర్వక ధోరణిలో ఆయన మాట్లాడారు.