ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ
ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ
భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల చర్చ
జియామెన్: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదం అనంతరం ప్రధాని మోదీ, జిన్‌పింగ్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల సంబంధాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపిన ఇరునేతలు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.
బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. 1954లో భారత్-చైనా కుదుర్చుకున్న పంచశీల ఒప్పందం అమలులో భారత్‌తో కలిసి పనిచేసేందుకు, భారత్ మార్గదర్శకత్వాన్ని కోరేందుకు చైనా సిద్ధంగా ఉందని జిన్‌పింగ్ చెప్పారు. భారత్-చైనాలు పరస్పరం అగ్ర పొరుగుదేశాలని, ప్రపంచశక్తులుగా ఆవిర్భవిస్తున్న అతిపెద్ద దేశాలని, ఇరుదేశాల నడుమ ఆరోగ్యకరమైన సంబంధాలు అవసరమని జిన్‌పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 73 రోజుల డోక్లాం సైనిక ప్రతిష్టంభనకు తెరపడిన నేపథ్యంలో బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. బ్రిక్స్ దేశాల కూటమి మరింత బలోపేతం కావాలని, ప్రపంచాన్ని అస్థిరత్వం నుంచి సుస్థిరత దిశగా నడుపాలని సూచించిన సంగతి తెలిసిందే.