గో.. గో..గోవా | goa with beautiful beaches and nice holiday spot | Sakshi
Sakshi News home page

గో.. గో..గోవా

Published Sun, Oct 23 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

గో.. గో..గోవా

గో.. గో..గోవా

సెలవులొస్తే.. గో గో..గోవా అంటుంటారు. చిన్నా పెద్దా అందరు కలిసి గోవాకి చేక్కేస్తుంటారు. అందమైన సముద్రం.. తెల్లని ఇసుక బీచ్‌లు.. ఆహ్లాదకరమైన వాతావరణం గోవా సొంతం. మనదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి సైతం పర్యాటకులు గోవా బీచ్‌లలో సేదతీరేందుకు వస్తుంటారు. ఇటీవల గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ఆఫ్రికా) ప్రతినిధులు ఒక్కచోట చేరి పలు విషయాలపై చర్చించారు. దీంతో ఇప్పటికే పర్యాటక స్థలంగా పేరొందిన గోవా పేరు రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ నేపథ్యంలో గోవా అందాలపై స్పెషల్ ఫోకస్..
 
బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్
గోవా వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన  ప్రదేశం ఈ చర్చి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రై స్తవులు వస్తుంటారు. యునెస్కో దీన్నీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిల్లో ఒకటైన సెయింట్ కేథరీన్ చూడదగ్గవి. కేథడ్రల్, అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ చర్చి, శాంత దుర్గ టెంపుల్, సలీమ్ అలీ బర్డ్ శాంక్చురీ,  గోవా స్టేట్ మ్యూజియం, ఫట్రోడ స్టేడియంలు చూడాల్సినవి. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలెన్నో కనిపిస్తాయక్కడ. పనాజీలోని ఫాంటెన్‌హౌస్ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తించారు. గోవా జీవనానికి, నిర్మాణాలకు ప్రతిబింబం ఇది. కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఈ శైలిలోనే కనిపిస్తాయి.
 
రైలు ప్రయాణమే థ్రిల్లింగ్!
గోవా రైలు ప్రయాణం భలే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ప్రయాణంలో పడమటి కనుముల ప్రకృతి అందాలతోపాటు, లోతైన లోయలు, సుందర జలపాతాలు మనకు దర్శనమిస్తాయి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, చీకటి గుహల మీదగా ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యమధ్యలో సొరంగ మార్గాల ద్వారా రైలు వెళుతున్నప్పుడు కొన్ని క్షణాలవరకూ అది మిట్టమధ్యాహ్నమో మధ్యరాత్రో అర్థంకాదు. అంతచీకటి కమ్ముకుంది.
 


అందాల దూధ్‌సాగర్..
రెళ్లో గోవాకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఒకటోట రెండు ఎత్తయిన కొండలు కనిపిస్తాయి. ఆ రెండు కొండల శిఖరాల మధ్య నుంచి దూధ్ సాగర్ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం కన్నుల పండువల ఉంటుంది. తెల్లని నురగలతో పై నుంచి కిందకి జాలువారే ఆ జలపాతాన్ని చూస్తుంటే ఆకాశగంగ భువికి చేరుతున్నట్లుగా ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దుల మధ్య పరవళ్లుతొక్కే పాల జలపాతాన్ని తప్పక చూడాల్సిందే. ఈ జలపాతం వర్షాకాలంలో రెట్టింపు అందంగా కనిపిస్తుంది. ఇది దేశంలోనే ఐదవ అతిపెద్ద జలపాతం.
 
పసందైన విందు!
గోవాలో పురాతన ఇళ్లు ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలుగా మారారుు. కళాప్రేమికులకు ఇండియన్ పెయింటింగ్స్, యాంటిక్స్ పండగ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఎంపోరియాలు, ప్రైవేట్ షాప్‌లు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలప్పుడు గోవా కళకళలాడుతుంటుంది. క్రిస్మ్‌స వేడుకలు, గోవా కార్నివాల్, వినాయక చవితి, గ్రేప్ ఫెస్టివల్, హోలీలను ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. మసాలాలు, మూలికలకు గోవా ఫేమస్. స్పా ట్రీట్‌మెంట్ తీసుకోవాలనుకుంటే బోలెడు మసాజ్ సెంటర్లు ఉన్నాయి.  చేపలు, మసాలా దినుసులు... అబ్బో ఒకటేంటి ఒక పక్క షాపింగ్ ప్రియుల మనసుదోచి మరో పక్క భోజనప్రియులకు రుచికరమైన విందును అందిస్తుంది గోవా.

సన్ బర్న్ ఫెస్టివల్..
గోవాలోని వగాటర్‌లో ఈ సన్‌బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్‌లో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. గోవా ప్రత్యేక వంటకాలను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కూడా చేయవచ్చు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యటకులు ఈ ఫెస్టివల్‌కు తరలివస్తారు.
 
భలే బీచ్‌లు..!
పాలోలెమ్, బాగా, కాలన్ ఘాట్, అంజునా, కాండోలిమ్, మజోర్డా, మిరామర్, సింక్వేరియమ్, వగాటర్, వర్కా, కోల్వా బీచ్‌లు తప్పక చూడాలి. ఒక్కో బీచ్‌దీ ఒక్కో ప్రత్యేకత. కొబ్బరిచెట్లు కొలువుదీరింది ఒకటయితే నల్లరాళ్లతో నిండినబీచ్ మరొకటి. అడుగడుగునా రంగురంగుల చేపలతో పెద్ద అక్వేరియంను తలపించే బీచ్ ఒకటయితే ఆరు బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ కూర్చునేది మరొకటి. ఓల్డ్‌గోవాలో ఎక్కువగా అరబ్బులు, పర్షియన్లు, యూదులు, మలబార్ వాసుల పడవలు కనిపిస్తాయి.
 
మహవీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం..
గోవా రాజధాని పనాజీకి 60 కి.మీ. దూరంలో భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. గోవాలోనే అతిపెద్దది ఇది. పశ్చిమకనుమల పాదభాగంలో సుమారు 240 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏనుగులు, పులులు, లేళ్లు, జింకలు, పెద్దపెద్ద ఉడుతలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సఫారీలకు జీపులు కూడా దొరుకుతాయి. ఈ అడవిలో ఉండేందుకు అతిథిగృహాలున్నాయి.
 
ఎన్నెన్నో..
మనదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గోవా వైశాల్యం తక్కువ..కానీ చూసి ఆస్వాదించాల్సిన ప్రాంతాలు ఎక్కువ. సీ, సాండ్, సర్ఫ్, సన్ కలిసి ఆహ్వానం పలికేచోటు ఇది! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్‌లు, చర్చిలు, దేవాలయాలు, ఇంకా మరెన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్‌గోవాలో ఆహారపు అలవాట్ల నుంచి భవన నిర్మాణాల వరకు పోర్చుగీసు సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. అందమైన బీచ్‌లు, పురాతన కట్టడాలు, అందమైన జలపాతాలతో పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement