
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ఈనెల 22, 23 తేదీల్లో ఆ దేశంలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు.
‘గ్లోబల్ డెవలప్‌మెంట్, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం’ అనే థీమ్‌తో జరిగే ఈ సమ్మిట్ లో పలు కీలక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. బ్రిక్స్ ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని అంచనా వేయడంతోపాటు.. భవిష్యత్ సహకారంకోసం శిఖరాగ్ర సమావేశం ఉపయోగపడుందని విదేశాంగశాఖ పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది.
గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా రష్యాలోని భారత సంతతి ప్రజలతో కూడా భేటీ అయ్యారు.
2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment