ఎస్సార్ ఆయిల్, రోస్‌నెఫ్ట్ డీల్ పూర్తి
Published Mon, Aug 21 2017 1:05 PM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
సాక్షి, ముంబై : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ ఎస్సార్ ఆయిల్‌తో, రష్యన్ ప్రభుత్వ ఆధీన సంస్థ రోస్‌నెఫ్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కుదుర్చుకున్న డీల్ ముగిసింది. ఎస్సార్ ఆయిల్ తన భారత ఆస్తులను పూర్తిగా రోస్‌నెఫ్ట్‌కు, దాని భాగస్వామ్య సంస్థలకు అమ్మేసింది. ఈ డీల్ విలువ రూ.12.9 బిలియన్ డాలర్లు(రూ.82,605 కోట్లు). గతేడాది అక్టోబర్ 15న గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. డీల్ ప్రకటించిన 10 నెలల అనంతరం ఈ రెండు సంస్థలు డీల్‌ను ముగించాయి. రూ.45వేల కోట్లకు పైనున్న రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకులు కోరడంతో, ఇన్నిరోజులు ఈ లావాదేవీ కొంత ఆలస్యమైంది.
ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎస్సార్-రోస్‌నెఫ్ట్ డీలే. రోస్‌నెఫ్ట్ ఈ డీల్‌కు కన్సోర్టియంగా నిర్వహిస్తోంది. ఈ డీల్‌లోనే గుజరాత్‌లోని వదినార్‌లో వద్దనున్న 20 మిలియన్ టన్ను రిఫైనరీ అమ్మకం కూడా ఉంది. 3500 పైగా పెట్రోల్ పంపుల అమ్మకం కూడా డీల్‌లో భాగమే. ఈ డీల్ ముగిసిన నేపథ్యంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, స్టాన్‌ఛార్ట్ వంటి లెండర్లకు రూ.70వేల కోట్లను సంస్థ చెల్లించనుంది. దేశంలో అత్యంత రుణ భారం మోస్తున్న కంపెనీల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్‌నకు ఈ డీల్ ముగింపుతో కొంత ఊరట కలిగింది. దీంతో ఎస్సార్ గ్రూప్ రుణ భారం 60 శాతం మేర తగ్గిపోనుంది.
Advertisement
Advertisement