Rosneft
-
భారత్‌తో రాస్‌నెఫ్ట్ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాజీ డైరెక్టర్ జీకే సతీష్ (62)ను బోర్డులో నియమించింది. రాస్‌నెఫ్ట్ బోర్డులో ఒక భారతీయుని నియా మకం ఇదే తొలిసారి. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని సంస్థ భావిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఓసీలో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా 2021లో జీకే సతీష్ పదవీ విరమణ చేశారు. 11 మంది డైరెక్టర్ల బోర్డులో నియమితులైన ముగ్గురు కొత్తవారిలో జీకే సతీష్ ఒకరని రష్యన్ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రష్యాలోని చమురు, గ్యాస్ క్షేత్రాలకు సంబంధించి రాస్‌నెఫ్ట్‌కు సతీష్ గతంలో పనిచేసిన ఐఓసీతో భాగస్వామ్యం ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర సంస్థలకు రాస్‌నెఫ్ట్ క్రూడ్ ఆయిల్‌నూ విక్రయించింది. ఇటీవలి కాలంలో సంస్థ గుజరాత్ రిఫైనరీలకు నాఫ్తా విక్రయాలనూ ప్రారంభించింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అమ్మకంసహా భారత్ సంస్థలతో భాగస్వామ్యం విస్తృతం చేసుకోడానికి రాస్‌నెఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. -
రాస్నెఫ్ట్తో ఐవోసీ ఒప్పందం
న్యూఢిల్లీ: రష్యాకి చెందిన రాస్నెఫ్ట్తో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఓ ఒప్పందంపై సంతకం చేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో మరింత చమురును తక్కువ ధరకే దిగుమతి చేసుకోవాలన్నది ఐవోసీ ప్రయత్నం. చమురు దిగుమతులు గణనీయంగా పెంచుకునేందుకు తాజా ఒప్పందం ఉపకరిస్తుందని ఐవోసీ ప్రకటించింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఇగోర్ సెచిన్ భారత్ పర్యటనలో భాగంగా ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. -
బీపీసీఎల్ కొనుగోలు రేసులో దిగ్గజాలు
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) కొనుగోలుకి విదేశీ చమురు కంపెనీలు జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ బిడ్స్‌ను దాఖలు చేశాయి. బీపీసీఎల్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) సంస్థలతో ఇతర కంపెనీలు సైతం జత కలిసే వీలున్నట్లు ఒక డాక్యుమెంట్ పేర్కొంది. తద్వారా కన్సార్షియంగా ఏర్పాటుకావచ్చని తెలుస్తోంది. 2020 నవంబర్ 16న బిడ్డింగ్‌కు గడువు ముగిసింది. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98% వాటా విక్రయానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్, అదానీతోపాటు.. రాయల్ డచ్ షెల్, బీపీ, ఎగ్జాన్ బిడ్డింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్, మధ్యప్రాచ్యానికి చెందిన పలు చమురు దిగ్గజాలు బీపీసీఎల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా బిడ్స్ దాఖలు చేసిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. కన్సార్షియంగా ఏర్పాటయ్యాక బిడ్స్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీసీఎల్ కొనుగోలు చేసే సంస్థకు దేశీ చమురు శుద్ధి సామర్థ్యంలో 14% వాటా లభించనుంది. అంతేకాకుండా 23% ఇంధన మార్కెట్ వాటానూ దక్కించుకునే వీలుంది. -
ఎస్సార్ ఆయిల్ షేరుకు అదనంగా రూ.75.48
మాజీ మైనారిటీ వాటాదారులకు శుభవార్త న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ మాజీ మైనారిటీ వాటాదారులకు ఎస్సార్ గ్రూపు తీపి కబురు అందించింది. ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున అదనంగా చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఇతర ఇన్వెస్టర్ల కూటమి 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ విక్రయానికి ముందే 2015లో ఎస్సార్ ఆయిల్‌ను స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి ఎస్సార్ గ్రూపు డీలిస్ట్ చేసింది. ఆ సమయంలో బైబ్యాక్‌లో పాల్గొన్న ఇన్వెస్టర్లకు వారి దగ్గరున్న ఒక్కో షేరుకు రూ.262.80 చొప్పున చెల్లించింది. తాజాగా ఎస్సార్ ఆయిల్‌ను రాస్‌నెఫ్ట్‌కు విక్రయించగా, ఒక్కో షేరుకు రూ.338.28 చొప్పున తమకు చెల్లింపులు జరిగాయని, ఈ నేపథ్యంలో ఒకనాటి మైనారిటీ వాటాదారులకు గతంలో చెల్లించిన రూ.262.80కు అదనంగా ఇప్పుడు ఒక్కో షేరుకు రూ.75.48 చొప్పున చెల్లించనున్నట్టు ఎస్సార్ గ్రూపు తెలిపింది. -
రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్...
♦ 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న రష్యా కంపెనీ ♦ విక్రయ లావాదేవీ పూర్తి ♦ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ డీల్ ♦ దేశీయ బ్యాంకులకు ఊరట ముంబై: రుణభారంతో సతమతం అవుతున్న ఎస్సార్ గ్రూపు తన పరిధిలోని ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది. ఎస్సార్ ఆయిల్, దాని పరిధిలోని పోర్టు, విద్యుత్తు, రిటైల్ ఆస్తులను రాస్‌నెఫ్ట్‌తోపాటు ఇతర ఇన్వెస్టర్ల కన్సార్టియం 12.9 బిలియన్ డాలర్లు (రూ.82,500 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. వాస్తవానికి ఈ డీల్ గతేడాది అక్టోబర్ 15న గోవా బ్రిక్స్ సదస్సు సందర్భంగా సాకారం కాగా అదిప్పుడు పూర్తయింది. రాస్‌నెఫ్ట్ రష్యా ప్రభుత్వ సంస్థ. ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద చమురు, సహజవాయువు సంస్థగా ఉంది. ఎస్సార్ ఆయిల్‌కు చెందిన గుజరాత్‌లోని 20 మిలియన్ టన్నుల వాదినార్ రిఫైనరీ, 58 మిలియన్ టన్నుల క్యాప్టివ్ పోర్ట్, 1,010 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, 3,500 పెట్రోల్ బంక్‌లు రాస్‌నెఫ్ట్, దాని కూటమికి చెందుతాయి. మొత్తం మీద ఈ ఆస్తుల్లో రాస్‌నెఫ్ట్ ఒక్కటే 49.13 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 49 శాతం వాటా నెదర్లాండ్స్‌కు చెందిన ట్రాఫిగురా గ్రూపు, రష్యన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యునైటెడ్ క్యాపిటల్ పార్ట్నర్స్ (యూసీపీ) దక్కించుకున్నాయి. ఎస్సార్ ఆయిల్లో డీల్‌కు ముందు ఎస్సార్ ఎనర్జీ హోల్డింగ్స్‌కు 98.26 శాతం, బిడ్కో మారిషస్‌కు మిగిలిన వాటా ఉంది. తాజా డీల్‌తో రుయాలు పూర్తిగా కంపెనీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం కంపెనీలో రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా–యూసీపీ కన్సార్టియం కాకుండా మైనారిటీ వాటాదారుల చేతిలో ఇంకా 1.75 శాతం వాటా ఉంటుంది. ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్‌కు ముందు తమ షేర్లను విక్రయించని వారు వీరు. వీరి దగ్గరున్న వాటాలకు సెబీ బైబ్యాక్ నిబంధనల మేరకు చెల్లింపులు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, ఎస్సార్ ఆయిల్‌ను విక్రయించిన తర్వాత కూడా చమురు రంగంలో రుయాల ప్రస్థానం కొనసాగనుంది. బ్రిటిష్ ఆస్తులు, ఓ ఆయిల్ రిఫైనరీ, కోల్బెడ్ మీథేన్ బ్లాక్‌లు వారి పరిధిలోనే ఉంటాయి. బ్యాంకులకు దక్కేది రూ.4,000 కోట్లే ఎస్సార్ ఆయిల్‌కు చెందిన 5 బిలియన్ డాలర్ల (రూ.35,000 కోట్లు) విలువైన రుణభారాన్ని సైతం ఒప్పందంలో భాగంగా రాస్‌నెఫ్ట్‌తోపాటు కొత్త యజమానులు స్వీకరించారు. రుణాలిచ్చిన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు ఇతర రుణదాతలు తమ సమ్మతి తెలిపారు. దీంతో ఈ సంస్థలకు ప్రస్తుతానికి రూ.4,000 కోట్ల మేరే ఎస్సార్ గ్రూపు నుంచి చెల్లింపులు జరగనున్నాయి. రుణదాతలు కొత్త యజమానిగా రాస్నెఫ్ట్ను అంగీకరించడంతో మిగిలిన రుణానికి రష్యా కంపెనీ బాధ్యత వహిస్తుంది. రుణదాతలకు తక్షణం రూ. 4,000 కోట్లు చెల్లిస్తాం: ప్రశాంత్ రుయా ఎస్సార్ గ్రూపు మొత్తం రుణ భారం రూ.1.35 లక్షల కోట్లు కాగా, ఎస్సార్ విక్రయం నేపథ్యంలో రూ.70,400 కోట్ల మేర రుణ భారం తమ గ్రూప్ నుంచి తగ్గుతుందని ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా తెలిపారు. రుయాల మొత్తం రుణంలో ఇది 60 శాతం. ‘‘ఈ డీల్‌కు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ. దేశ చరిత్రలో భారీ స్థాయిలో రుణాలను తీర్చివేస్తున్న డీల్. మూడోది రష్యా నుంచి ఓ దేశానికి భారీ స్థాయిలో నిధులు వెళుతున్న సందర్భం కూడా ఇదే’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. విక్రయ ఒప్పందం పూర్తయినట్టు సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ బ్యాలన్స్ షీట్లలో గణనీయమైన రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. రాస్‌నెఫ్ట్ డీల్ తర్వాత భారత్‌లోని రుణదాతలకు రూ. 4000 కోట్ల మేర నేరుగా చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎల్ఐసీకి రూ. 800 కోట్లవరకూ చెల్లిస్తామని అన్నారు. మిగిలిన మొత్తాన్ని ఏ బ్యాంకుకు లేదా బీమా కంపెనీకి ఎంతెంత చెల్లించేదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. రూ.1.2 లక్షల కోట్ల మూలధన విస్తరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విస్తృతమైన తమ పోర్ట్‌ఫోలియో వృద్ధి అవశాలను ఇకపై చూడనున్నట్టు ప్రకటించారు. ‘‘ఈ డీల్ తర్వాత కూడా ఎస్సార్ గ్రూపు ఆస్తుల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 15 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల ఎబిటా కూడా ఉండనుంది. చమురు రంగంలో మాకున్న ఏకైక 9 మిలియన్ టన్నుల రిఫైనరీ ద్వారా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక లావాదేవీతో ఎస్సార్ గ్రూపు వృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయని సంస్థ వ్యవస్థాపకుడు శశిరుయా కూడా ప్రకటించారు. ఎస్సార్ స్టీల్ రుణాలు ఎగవేతే! ఎస్సార్ గ్రూపు పరిధిలోని ఎస్సార్ స్టీల్ రూ.44,000 కోట్ల మేర బ్యాంకుల రుణాలను ఎగవేయగా, ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఎస్సార్ గ్రూపు భారీ స్థాయిలో రుణాలను తిరిగి చెల్లించే కార్యక్రమం చేపట్టినప్పటికీ... ఎస్సార్స్టీల్ రుణాలను మాత్రం తిరిగి చెల్లించడం లేదు. ఇదే విషయాన్ని రుయాను ప్రస్తావించగా, ‘ఎస్సార్ ఆయిల్, ఎస్సార్ స్టీల్ రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నయి. ఒక కంపెనీ ఖాతా నుంచి మరో కంపెనీ ఖాతాలోకి నిధుల మళ్లింపునకు చట్టం ఒప్పుకోదు’ అని స్పష్టం చేశారు. రాస్‌నెఫ్ట్‌కు స్వాగతం: ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేసిన ఎస్సార్ గ్రూపును పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా యూసీపీ కన్సార్టియానికి స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించారు. సగం రుణభారం తీరిపోతుంది: కొచర్ ఎస్సార్ గ్రూపు రుణాలను తిరిగి తీర్చివేసే కార్యక్రమంతో ఆ గ్రూపునకు ఇచ్చిన రుణాలు సగం మేర తగ్గిపోనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ తెలిపారు. ఎస్సార్ ఆయిల్ అభివృద్ధికి కృషి: సెచిన్ కొత్త భాగస్వాములతో కలసి ఎస్సార్ ఆయిల్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, ఆస్తుల అభివృద్ధికి తగిన వ్యూహాన్ని అమల్లో పెడతామని రాస్‌నెఫ్ట్ అధినేత ఇగార్ సెచిన్ పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశంలో ఆయన పాల్గొనలేదు. -
ఎస్సార్ ఆయిల్, రోస్నెఫ్ట్ డీల్ పూర్తి
సాక్షి, ముంబై : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ చమురు సంస్థ ఎస్సార్ ఆయిల్‌తో, రష్యన్ ప్రభుత్వ ఆధీన సంస్థ రోస్నెఫ్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కుదుర్చుకున్న డీల్ ముగిసింది. ఎస్సార్ ఆయిల్ తన భారత ఆస్తులను పూర్తిగా రోస్నెఫ్ట్కు, దాని భాగస్వామ్య సంస్థలకు అమ్మేసింది. ఈ డీల్ విలువ రూ.12.9 బిలియన్ డాలర్లు(రూ.82,605 కోట్లు). గతేడాది అక్టోబర్ 15న గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. డీల్ ప్రకటించిన 10 నెలల అనంతరం ఈ రెండు సంస్థలు డీల్‌ను ముగించాయి. రూ.45వేల కోట్లకు పైనున్న రుణాలపై స్పష్టత ఇవ్వాలని బ్యాంకులు కోరడంతో, ఇన్నిరోజులు ఈ లావాదేవీ కొంత ఆలస్యమైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎస్సార్-రోస్నెఫ్ట్ డీలే. రోస్నెఫ్ట్ ఈ డీల్‌కు కన్సోర్టియంగా నిర్వహిస్తోంది. ఈ డీల్లోనే గుజరాత్‌లోని వదినార్‌లో వద్దనున్న 20 మిలియన్ టన్ను రిఫైనరీ అమ్మకం కూడా ఉంది. 3500 పైగా పెట్రోల్ పంపుల అమ్మకం కూడా డీల్‌లో భాగమే. ఈ డీల్ ముగిసిన నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, స్టాన్ఛార్ట్ వంటి లెండర్లకు రూ.70వేల కోట్లను సంస్థ చెల్లించనుంది. దేశంలో అత్యంత రుణ భారం మోస్తున్న కంపెనీల్లో ఒకటైన ఎస్సార్ గ్రూప్‌నకు ఈ డీల్ ముగింపుతో కొంత ఊరట కలిగింది. దీంతో ఎస్సార్ గ్రూప్ రుణ భారం 60 శాతం మేర తగ్గిపోనుంది. -
విదేశీ బంకుల హల్చల్!
♦ దేశీ చమురు రిటైల్‌లోకి విదేశీ దిగ్గజాలు ♦ రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్ రిఫైనరీ, బంకులు ♦ రూ.86,000 కోట్ల ఒప్పందానికి బ్యాంకులు ఓకే ♦ త్వరలో రిలయన్స్– బ్రిటిష్ పెట్రోలియం బంకులు కూడా ♦ ఇప్పటికే వేగంగా తెరుచుకుంటున్న రిలయన్స్ బంకులు ♦ విస్తరణపై షెల్ దృష్టి; త్వరలో మరిన్ని బంకులు ♦ ఆటో ఎల్పీజీ స్టేషన్లను పెంచుకోనున్న టోటల్ ♦ ప్రభుత్వ రిఫైనరీలో వాటా ద్వారా సౌదీ ఆరామ్కో! ♦ ప్రభుత్వ దిగ్గజాలది కూడా విస్తరణ బాటే ♦ నాలుగేళ్లలో మరో 9 వేల బంకులు: క్రిసిల్ (సాక్షి, బిజినెస్ విభాగం) పెట్రోల్ బంకులంటే!! భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం... ఇవే!. చమురు రిటైలింగ్‌లో ఇప్పటిదాకా ఈ ప్రభుత్వ కంపెనీలదే గుత్తాధిపత్యం. కాకపోతే మున్ముందు పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే గతనెల వరకూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో దాదాపు 95 శాతం వాటా వీటి చేతిలోనే ఉండగా... మెల్లగా అది తగ్గుతూ వస్తోంది. ప్రయివేటు కంపెనీలైన షెల్, ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ మెల్లగా వాటా పెంచుకోవటమే దీనిక్కారణం. కానీ మూడు నాలుగేళ్లలో ముఖచిత్రం మరింతగా మారిపోనుంది. ఎందుకంటే ప్రపంచ చమురు దిగ్గజాలైన రాస్‌నెఫ్ట్ (రష్యా), బ్రిటిష్ పెట్రోలియం (యూకే), ఆరామ్ కో (సౌదీ), రాయల్ డచ్ షెల్ (నెదర్లాండ్స్)... భారత రిటైల్ మార్కెట్‌పై కన్నేశాయి. గతంలోనే భారత్‌లోకి అరంగేట్రం చేసిన షెల్... భారీగా పెట్టుబడులు పెంచబోతుండగా... మిగిలిన కంపెనీలు ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. శుక్రవారంనాడు రాస్‌నెఫ్ట్ డీల్‌కు రుణదాతలు ఓకే చెప్పిన నేపథ్యంలో... ఇవన్నీ బంకులు ఏర్పాటు చేసే పరిణామం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. దేశంలో 2014కు ముందు వరకూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండేది. వినియోగదారులపై పడే భారాన్ని సబ్సిడీల రూపంలో ప్రభుత్వం భరించేది. కాకపోతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోవటం కేంద్ర ప్రభుత్వానికి కలిసొచ్చింది. దీంతో మెల్లగా తమ నియంత్రణను సడలించి, మార్కెట్ ధరలకు అనుగుణంగా నిర్ణయించే అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టింది. అప్పటికే ఈ రంగంలోకి వచ్చి... పోటీని తట్టుకోలేక చాలా బంకుల్ని మూసేసిన రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ వంటి సంస్థలకు ఈ పరిణామం కలిసొచ్చింది. సబ్సిడీల శకం ముగియటంతో 2014 నుంచీ ఇవి తమ బంకుల్ని తిరిగి తెరిపించటం మొదలెట్టాయి. 2021 నాటికి ఈ రెండు సంస్థలూ దాదాపు 8000 బంకుల వరకూ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల క్రిసిల్ నివేదిక ఒకటి వెల్లడించింది. ‘‘దీంతో ప్రస్తుతం 4–5 శాతంగా ఉన్న వీటి వాటా 2021 నాటికి 15 శాతానికి చేరుతుంది. అయితే ప్రస్తుతం 53 వేల బంకులున్న ప్రభుత్వ రంగ బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ కూడా అప్పటికి మరో 9వేల బంకుల్ని ఏర్పాటు చేస్తాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు పెరగనున్న డిమాండ్ దృష్ట్యా ఇవన్నీ విస్తరణ ప్రణాళికలు వేస్తున్నాయి’’ అని క్రిసిల్ వివరించింది. ప్రస్తుతం ఎస్సార్ ఆయిల్‌కు దేశవ్యాప్తంగా 2,700 బంకుల వరకూ ఉండగా... ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 1200 వరకూ ఉన్నాయి. వీటిలో చాలావరకూ మూతపడగా... ఇటీవలే ఒక్కొక్కటిగా వేగంగా తెరుచుకుంటున్నాయి. డచ్ దిగ్గజం షెల్‌కు దేశంలో 83 బంకులున్నాయి. బ్రిటిష్ పెట్రోలియంతో రిలయన్స్ జట్టు! ఇక దేశీ చమురు దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దేశవ్యాప్తంగా 5000 బంకుల వరకూ ఏర్పాటు చేయటానికి లైసెన్సుంది. మూతపడ్డవి కూడా కలిపితే దీనికి ఇప్పటికే 1200 బంకులున్నాయి. అంతర్జాతీయ దిగ్గజం బ్రిటిష్ పెట్రోలియానికి కూడా దేశంలో 3,500 బంకులు ఏర్పాటు చేయటానికి సూత్రప్రాయంగా అనుమతి ఉంది. ఇటీవలే రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ... ఇక్కడికొచ్చిన బ్రిటిష్ పెట్రోలియం అధినేత డూడ్లీతో చర్చలు జరిపారు. అనంతరం రెండు సంస్థలూ కలిసి దేశీ చమురు రిటైల్ రంగంలో అవకాశాల్ని అందిపుచ్చుకుంటాయని సంయుక్త సమావేశంలో ప్రకటించారు కూడా. దీంతో త్వరలో రిలయన్స్–బీపీ బంకులు కూడా సాకారం కానున్నాయనేది ధ్రువపడింది. విస్తరణ దిశగా టోటల్, షెల్! నెదర్లాండ్స్‌కు చెందిన చమురు దిగ్గజం రాయల్ డచ్ షెల్ కంపెనీకి గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో 83 బంకులున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఏడాది 25 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్లో ఎంత మొత్తాన్ని ఇండియా కార్యకలాపాల కోసం వెచ్చిస్తారన్నది ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే పోటీ పెరుగుతున్న దృష్ట్యా భారత మార్కెట్లో పెట్టుబడులు కూడా ఉంటాయని, తమ నెట్వర్క్ పెరుగుతుందని షెల్ ఇండియా సీఈఓ నితిన్ ప్రసాద్ ఈ మధ్యే చెప్పారు. కాకపోతే జీఎస్టీ వల్ల పెట్రోల్, గ్యాస్ వ్యాపారం మరింత ఖరీదైనదిగా మారుతుందని కూడా చెప్పారాయన. ఇక ఫ్రెంచ్ దిగ్గజం టోటల్‌కు ఇప్పటికే 40కి పైగా ఆటోగ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లున్నాయి. వీటి సంఖ్య కూడా మరింత పెరగవచ్చని పెట్రోలియం శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే ఆరామ్కో ఆసక్తి! దేశీ రిటైల్ చమురు రంగంపై సౌదీకి చెందిన అంతర్జాతీయ దిగ్గజం ఆరామ్కో ఇదివరకే ఆసక్తి చూపించింది. పెట్రో ధరలు తగ్గుతున్న దృష్ట్యా దేశంలో మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ సంస్థ ఇతర అవకాశాల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే రిటైల్‌లోకి అడుగు పెట్టనున్నట్లు గతంలో సంస్థ వర్గాలు వెల్లడించాయి. అయితే తాజాగా ఈ సంస్థ దాదాపు 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.4 లక్షల కోట్లు) ఐపీఓకు రావటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరామ్‌కోలో దేశీ చమురు దిగ్గజాలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు వాటా తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూడూ కలిసి దేశంలోనే అతిపెద్దదైన చమురు రిఫైనరీని మహారాష్ట్రలో దాదాపు రూ.2 లక్షల కోట్లతో ఏర్పాటు చేయటానికి ఇటీవలే ఒప్పందం చేసుకున్నాయి. ఈ రిఫైనరీలో ఆరామ్కోకు వాటా ఇచ్చి... బదులుగా ఆ సంస్థలో వాటా తీసుకునే అవకాశముందని పెట్రోలియం మంత్రి ఇటీవలే చెప్పారు కూడా. ఇదే జరిగితే ఆరామ్కో దేశీ రిటైల్ ప్రవేశానికి మార్గం సుగమమవుతుంది కూడా. ఎస్సార్ ఆయిల్ రూట్లో ‘రాస్‌నెఫ్ట్’ గుజరాత్‌లోని వడినార్‌లో భారీ చమురు రిఫైనరీతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 2,700 రిటైల్ బంకులున్న ఎస్సార్ ఆయిల్‌ను రూ.84,000 కోట్లు పెట్టి కొనుగోలు చేయటానికి రష్యాకు చెందిన చమురు అన్వేషణ, రిఫైనింగ్ దిగ్గజం రాస్‌నెఫ్ట్ గతేడాది అక్టోబర్‌లోనే ఒప్పందం చేసుకుంది. కాకపోతే ఎస్సార్ ఆయిల్‌కు భారీగా రుణాలుండటంతో ఆ మేరకు ఆ సంస్థ షేర్లు బ్యాంకుల కన్సార్షియం వద్ద ఉన్నాయి. దీంతో ఒప్పందానికి ఈ అంశం అడ్డంకిగా నిలిచింది. శుక్రవారంనాడు ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల నేతృత్వంలోని 23 బ్యాంకుల కన్సార్షియం ఈ ఒప్పందానికి సమ్మతించింది. షేర్లను విడుదల చేయటానికి ఒప్పుకుంది. దీంతో ఎస్సార్ ఆయిల్లో రాస్‌నెఫ్ట్ 49 శాతం వాటాను, కమోడిటీ ట్రేడింగ్ సంస్థ ట్రాఫిగురా–యూసీపీ జాయింట్ వెంచర్ 25 శాతం వాటాను దక్కించుకోవటానికి మార్గం సుగమమైంది. దీంతో త్వరలోనే రాస్‌నెఫ్ట్ బంకులు సాక్షాత్కారం కానున్నాయి. -
రాస్ నెఫ్ట్, ట్రాఫిగుర సంస్థల చేతికి ఎస్సార్ ఆయిల్
♦ రేపు గోవాలో పుతిన్ సమక్షంలో ఒప్పందం ♦ డీల్ విలువ రూ. 86,000 కోట్లు న్యూఢిల్లీ: ఎస్సార్ ఆయిల్ కంపెనీని రష్యా ఆయిల్ దిగ్గజం రాస్‌నెఫ్ట్, ఇతర సంస్థలతో కలిసి కొనుగోలు చేయనున్నది. రాస్‌నెఫ్ట్ కంపెనీ, యూరప్ కమోడిటీస్ ట్రేడర్ ట్రాఫిగుర, రష్యా ఫండ్ యూసీపీతో కలిసి ఎస్సార్ ఆయిల్ కంపెనీని 1,300 కోట్ల డాలర్లకు (రూ. 86,000 కోట్లు) కొనుగోలు చేయనున్నాయని సమాచారం. వాటాను విక్రయించిన తర్వాత ఎస్సార్ ఆయిల్లో 2 శాతం వాటా మాత్రమే ప్రస్తుత ప్రమోటర్లు, రుయా కుటుంబానికి ఉంటుంది. ఈ డీల్‌లో భాగంగా ఎస్సార్ ఆయిల్ కంపెనీకి వున్న 450 కోట్ల డాలర్ల రుణ భారాన్ని కొనుగోలు సంస్థలు టేకోవర్ చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రేపు(శనివారం) గోవాలో సంతకాలు జరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవాలో ఈ నెల 15-16 తేదీల్లో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదురనున్నది. ఈ ఒప్పందంలో భాగంగా రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీ సంస్థ 49 శాతం వాటాను, ట్రాఫిగుర గ్రూప్ పీటీఈ, యూసీపీలు కలసి మరో 49 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ డీల్‌లో వాదినర్ రిఫైనరీ, వాదినర్ పోర్ట్, 2,500కు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. రిఫైనరీకి సేవలందిస్తున్న విద్యుత్ ప్లాంట్, కంపెనీ కోల్ బెడ్ మీధేన్(సీబీఎం) బ్లాక్‌లు ఈ ఒప్పందం కిందకు రావు. -
రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను
♦ 19.5% వాటా విక్రయించనున్న రాస్‌నెఫ్ట్ ♦ కొంత వాటా కొనుగోలుపై భారత కంపెనీల కన్ను న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్సీలో 19.5% వాటాను రష్యా విక్రయిం చనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ వాటాలో కొంత కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలు యోచిస్తున్నాయని వివరించారు.ఈ నెల మొదట్లో ధర్మేంద్ర ప్రధాన్ రష్యా రాజధాని మాస్కోను సందర్శించారు. ఓవీఎల్ చర్చలు: ప్రస్తుతం ఓఎన్జీసీ కంపెనీ విదేశీ విభాగం ఓఎన్జీసీ విదేశ్ వాటా కొనుగోలు నిమిత్తం చర్చలు జరపుతోందని, త్వరలోనే మిగిలిన చమురు కంపెనీలు చర్చల్లో భాగం పంచుకోనున్నాయని ప్రధాన్ పేర్కొన్నారు. బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి రష్యా ప్రభుత్వం ఈ వాటాను విక్రయిస్తోందని, ఈ వాటాను ప్రజలకు విక్రయించడం కంటే వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించడానికే రష్యా మొగ్గు చూపుతోందని వివరించారు. భారత కంపెనీలకు వాంకోర్‌లో 50% వాటా కాగా గత నెలలోనే రాస్‌నెఫ్ట్ సంస్థ, రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రమైన వాంకోర్‌లో 15 శాతం వాటాను 126.8 కోట్ల డాలర్లకు ఓవీఎల్‌కు విక్రయించింది. ఈ చమురు క్షేత్రంలో మరో 23.9% వాటాను ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొ, భారత పెట్రోలియం కార్పొలతో కూడిన కన్సార్షియమ్కు 200 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనలో ఒక ఒప్పందం కుదిరింది. ఇదే చమురు క్షేత్రంలో మరో 11% వాటాను ఓవీఎల్‌కు విక్రయించడానికి ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ పూర్తయితే ఈ చమురు క్షేత్రంలో భారత కంపెనీల వాటా దాదాపు 50%కి చేరుతుందని ప్రధాన్ పేర్కొన్నారు.