రాస్‌నెఫ్ట్ చేతికి ఎస్సార్ ఆయిల్...
♦ 13 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న రష్యా కంపెనీ
♦ విక్రయ లావాదేవీ పూర్తి
♦ దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ డీల్
♦ దేశీయ బ్యాంకులకు ఊరట
ముంబై: రుణభారంతో సతమతం అవుతున్న ఎస్సార్ గ్రూపు తన పరిధిలోని ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్‌కు విక్రయించింది. ఎస్సార్ ఆయిల్, దాని పరిధిలోని పోర్టు, విద్యుత్తు, రిటైల్ ఆస్తులను రాస్‌నెఫ్ట్‌తోపాటు ఇతర ఇన్వెస్టర్ల కన్సార్టియం 12.9 బిలియన్ డాలర్లు (రూ.82,500 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. వాస్తవానికి ఈ డీల్ గతేడాది అక్టోబర్ 15న గోవా బ్రిక్స్ సదస్సు సందర్భంగా సాకారం కాగా అదిప్పుడు పూర్తయింది. రాస్‌నెఫ్ట్ రష్యా ప్రభుత్వ సంస్థ. ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద చమురు, సహజవాయువు సంస్థగా ఉంది.
ఎస్సార్ ఆయిల్‌కు చెందిన గుజరాత్‌లోని 20 మిలియన్ టన్నుల వాదినార్ రిఫైనరీ, 58 మిలియన్ టన్నుల క్యాప్టివ్ పోర్ట్, 1,010 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, 3,500 పెట్రోల్ బంక్‌లు రాస్‌నెఫ్ట్, దాని కూటమికి చెందుతాయి. మొత్తం మీద ఈ ఆస్తుల్లో రాస్‌నెఫ్ట్ ఒక్కటే 49.13 శాతం వాటా కలిగి ఉంటుంది. మిగిలిన 49 శాతం వాటా నెదర్లాండ్స్‌కు చెందిన ట్రాఫిగురా గ్రూపు, రష్యన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ యునైటెడ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ (యూసీపీ) దక్కించుకున్నాయి. ఎస్సార్ ఆయిల్‌లో డీల్‌కు ముందు ఎస్సార్ ఎనర్జీ హోల్డింగ్స్‌కు 98.26 శాతం, బిడ్కో మారిషస్‌కు మిగిలిన వాటా ఉంది. తాజా డీల్‌తో రుయాలు పూర్తిగా కంపెనీ నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం కంపెనీలో రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా–యూసీపీ కన్సార్టియం కాకుండా మైనారిటీ వాటాదారుల చేతిలో ఇంకా 1.75 శాతం వాటా ఉంటుంది. ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్‌కు ముందు తమ షేర్లను విక్రయించని వారు వీరు. వీరి దగ్గరున్న వాటాలకు సెబీ బైబ్యాక్ నిబంధనల మేరకు చెల్లింపులు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక, ఎస్సార్ ఆయిల్‌ను విక్రయించిన తర్వాత కూడా చమురు రంగంలో రుయాల ప్రస్థానం కొనసాగనుంది. బ్రిటిష్ ఆస్తులు, ఓ ఆయిల్ రిఫైనరీ, కోల్‌బెడ్ మీథేన్ బ్లాక్‌లు వారి పరిధిలోనే ఉంటాయి.
బ్యాంకులకు దక్కేది రూ.4,000 కోట్లే
ఎస్సార్ ఆయిల్‌కు చెందిన 5 బిలియన్ డాలర్ల (రూ.35,000 కోట్లు) విలువైన రుణభారాన్ని సైతం ఒప్పందంలో భాగంగా రాస్‌నెఫ్ట్‌తోపాటు కొత్త యజమానులు స్వీకరించారు. రుణాలిచ్చిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు ఇతర రుణదాతలు తమ సమ్మతి తెలిపారు. దీంతో ఈ సంస్థలకు ప్రస్తుతానికి రూ.4,000 కోట్ల మేరే ఎస్సార్ గ్రూపు నుంచి చెల్లింపులు జరగనున్నాయి. రుణదాతలు కొత్త యజమానిగా రాస్‌నెఫ్ట్‌ను అంగీకరించడంతో మిగిలిన రుణానికి రష్యా కంపెనీ బాధ్యత వహిస్తుంది.
రుణదాతలకు తక్షణం రూ. 4,000 కోట్లు చెల్లిస్తాం: ప్రశాంత్ రుయా
ఎస్సార్ గ్రూపు మొత్తం రుణ భారం రూ.1.35 లక్షల కోట్లు కాగా, ఎస్సార్ విక్రయం నేపథ్యంలో రూ.70,400 కోట్ల మేర రుణ భారం తమ గ్రూప్ నుంచి తగ్గుతుందని ఎస్సార్ గ్రూపు డైరెక్టర్ ప్రశాంత్ రుయా తెలిపారు. రుయాల మొత్తం రుణంలో ఇది 60 శాతం. ‘‘ఈ డీల్‌కు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ. దేశ చరిత్రలో భారీ స్థాయిలో రుణాలను తీర్చివేస్తున్న డీల్. మూడోది రష్యా నుంచి ఓ దేశానికి భారీ స్థాయిలో నిధులు వెళుతున్న సందర్భం కూడా ఇదే’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు.
విక్రయ ఒప్పందం పూర్తయినట్టు సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కంపెనీ బ్యాలన్స్ షీట్లలో గణనీయమైన రుణాలను తీర్చివేయనున్నట్టు చెప్పారు. రాస్‌నెఫ్ట్ డీల్ తర్వాత భారత్‌లోని రుణదాతలకు రూ. 4000 కోట్ల మేర నేరుగా చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అందులో ఎల్‌ఐసీకి రూ. 800 కోట్లవరకూ చెల్లిస్తామని అన్నారు. మిగిలిన మొత్తాన్ని ఏ బ్యాంకుకు లేదా బీమా కంపెనీకి ఎంతెంత చెల్లించేదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. రూ.1.2 లక్షల కోట్ల మూలధన విస్తరణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత విస్తృతమైన తమ పోర్ట్‌ఫోలియో వృద్ధి అవశాలను ఇకపై చూడనున్నట్టు ప్రకటించారు.
‘‘ఈ డీల్ తర్వాత కూడా ఎస్సార్ గ్రూపు ఆస్తుల విలువ 17 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 15 బిలియన్ డాలర్ల ఆదాయం, 2 బిలియన్ డాలర్ల ఎబిటా కూడా ఉండనుంది. చమురు రంగంలో మాకున్న ఏకైక 9 మిలియన్ టన్నుల రిఫైనరీ ద్వారా పెట్టుబడులు కొనసాగుతాయి’’ అని ప్రశాంత్ రుయా పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక లావాదేవీతో ఎస్సార్ గ్రూపు వృద్ధికి నూతన ద్వారాలు తెరుచుకున్నాయని సంస్థ వ్యవస్థాపకుడు శశిరుయా కూడా ప్రకటించారు.
ఎస్సార్ స్టీల్ రుణాలు ఎగవేతే!
ఎస్సార్ గ్రూపు పరిధిలోని ఎస్సార్ స్టీల్ రూ.44,000 కోట్ల మేర బ్యాంకుల రుణాలను ఎగవేయగా, ఈ కేసు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఎస్సార్ గ్రూపు భారీ స్థాయిలో రుణాలను తిరిగి చెల్లించే కార్యక్రమం చేపట్టినప్పటికీ... ఎస్సార్‌స్టీల్ రుణాలను మాత్రం తిరిగి చెల్లించడం లేదు. ఇదే విషయాన్ని రుయాను ప్రస్తావించగా, ‘ఎస్సార్ ఆయిల్, ఎస్సార్ స్టీల్ రెండు వేర్వేరు సంస్థలు, వేర్వేరు వ్యాపారాల్లో ఉన్నయి. ఒక కంపెనీ ఖాతా నుంచి మరో కంపెనీ ఖాతాలోకి నిధుల మళ్లింపునకు చట్టం ఒప్పుకోదు’ అని స్పష్టం చేశారు.
రాస్‌నెఫ్ట్‌కు స్వాగతం: ధర్మేంద్ర ప్రధాన్
ఈ ఒప్పందాన్ని పూర్తి చేసిన ఎస్సార్ గ్రూపును పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న రాస్‌నెఫ్ట్, ట్రాఫిగురా యూసీపీ కన్సార్టియానికి స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించారు.
సగం రుణభారం తీరిపోతుంది: కొచర్
ఎస్సార్ గ్రూపు రుణాలను తిరిగి తీర్చివేసే కార్యక్రమంతో ఆ గ్రూపునకు ఇచ్చిన రుణాలు సగం మేర తగ్గిపోనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందాకొచర్ తెలిపారు.
ఎస్సార్ ఆయిల్ అభివృద్ధికి కృషి: సెచిన్
కొత్త భాగస్వాములతో కలసి ఎస్సార్ ఆయిల్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, ఆస్తుల అభివృద్ధికి తగిన వ్యూహాన్ని అమల్లో పెడతామని రాస్‌నెఫ్ట్ అధినేత ఇగార్ సెచిన్ పేర్కొన్నారు. కాగా, మీడియా సమావేశంలో ఆయన పాల్గొనలేదు.