న్యూఢిల్లీ: రుయాల చివరి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆర్సెలర్ మిట్టల్ వేసిన రూ.42,000 కోట్ల బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదం తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ అర్హతలను సవాలు చేస్తూ రుయాలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ కొట్టివేయడంతోపాటు, ఆర్సెలర్ బిడ్‌కు పచ్చజెండా ఊపింది. ఆర్సెలర్ మిట్టల్ అర్హత అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిష్కరించిందని, దీన్ని మళ్లీ, మళ్లీ లేవనెత్తరాదని రుయాల పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌సీఎల్‌ఏటీ వ్యాఖ్యానించింది. దాన్నే మళ్లీ, మళ్లీ ప్రస్తావించడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
ఎస్సార్ స్టీల్‌కు నిర్వహణ అవసరాలకు అరువిచ్చిన సంస్థలకు, బ్యాంకులతో సమానంగా రుణదాతల హోదాను అప్పిలేట్ ట్రిబ్యునల్ కల్పించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రూ.54,547 కోట్ల మేర బకాయి పడడంతో, ఎస్సార్ స్టీల్ కంపెనీని ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద వేలం వేయగా, ఆర్సెలర్ మిట్టల్ రూ.42,000 కోట్లతో టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ఈ మొత్తంలో రూ.2,500 కోట్ల మూలధన నిధులు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ క్రెడిటార్స్ చేసిన రూ.49,473 కోట్ల క్లెయిమ్‌లో 60.7 శాతం వాటికి వెళతాయని, మిగిలిన మొత్తం నిర్వహణ అవసరాలకు అరువు సమకూర్చిన కంపెనీలకు చెందుతాయని ఎన్‌సీఎల్‌ఏటీ తెలిపింది.
వాస్తవాలు తర్వాత వచ్చాయి...
‘‘సెక్షన్ 29ఏ కింద అనర్హతకు సంబంధించి కొత్త వాస్తవాలన్నవి సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వెలుగు చూశాయి. వీటిని తగిన పరిశీలనలోకి తీసుకోలేదు. పూర్తి ఆదేశాల కాపీ కోసం వేచి చూస్తున్నాం. అది అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ఏంటన్నది నిర్ణయిస్తాం’’ అని ఎస్సార్ స్టీల్ ప్రతిధిని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment