బ్రసీలియాలో పుతిన్, మోదీ కరచాలనం
బ్రసీలియా: తాజా బ్రిక్స్ సదస్సుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు జరగనున్న 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు మోదీ బుధవారం బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాకు చేరుకున్నారు. ‘బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌కు వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశమవుతున్నాను’ అని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి కానుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్ ఉంది. ప్రస్తుత బ్రిక్స్ సదస్సును ‘సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
మోదీకి పుతిన్ ఆహ్వానం
బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. తరచుగా నిర్వహించే సమావేశాల వల్ల మన సంబంధాలు మరింత పటిష్టమవుతాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్ రష్యాకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే ఉత్సవాలకు హాజరుకావాలని మోదీని కోరారు. ఇరుదేశాల వాణిజ్యంలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment