
బ్రిక్స్‌లో భిన్నస్వరాలు!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు, అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు అయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ‘ఇద్దరు కొత్త మిత్రుల కన్నా ఒక పాత మిత్రుడు ఉత్తమం’ అన్న రష్యా సామెతను మోదీ గుర్తుచేశారు. అయితే ఆ ప్రస్తావనలోని అంతరార్ధాన్ని రష్యాగానీ, చైనాగానీ గ్రహించలేదని బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను చూస్తే అర్ధమవుతుంది. పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చల సమయంలోనూ, శిఖరాగ్ర సదస్సులోనూ ఉగ్రవాదానికి దోహదపడుతున్న పాకిస్తాన్ వ్యవహార శైలి గురించి మోదీ వివరంగా మాట్లాడారు. పాకిస్తాన్‌కు రాజకీయ, ఆయుధ సాయాన్ని తగ్గించుకోవాలని పరోక్షంగా చైనాకు సూచించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లకు సరైన జవాబివ్వాలని సదస్సును కోరారు. కానీ మన ఆకాంక్షలకు అనుగుణంగా సదస్సు స్పందించలేదని సంయుక్త ప్రకటన చూస్తే తెలుస్తుంది.
ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని బ్రిక్స్ పిలుపునిచ్చిన మాట వాస్తవమే అయినా... అందులో స్పష్టత లేదు. ప్రధానంగా ఆర్ధిక సహ కారానికి సంబంధించిన అంశాలకే పరిమితమయ్యే బ్రిక్స్ సమావేశంలో ఈసారి మోదీ ఒకటికి రెండుసార్లు పాకిస్తాన్ తీరును ఎత్తిచూపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కానీ సంయుక్త ప్రకటన ఆ విషయంలో మౌనంగా ఉండి పోయింది. పాక్ గురించి ఇన్నేళ్లుగా మనం చెబుతున్న మాటల్లో అవాస్తవమేమీ లేదని ఇటీవల అక్కడ జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థల విషయంలో పౌర ప్రభుత్వం, సైన్యం తలపడు తున్నాయి. ‘మీరు దారికి రాకపోతే ప్రపంచం దృష్టిలో దోషిగా మారతామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యాన్ని హెచ్చరించినట్టు అక్కడి అగ్రశ్రేణి ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ బట్టబయలు చేసింది. మూడు వేర్వేరు వర్గాల నుంచి ధ్రువీకరించుకున్నాకే ఆ కథనాన్ని బయట పెట్టానని దాన్ని రాసిన పాత్రికేయుడు అంటున్నాడు.
నిజానికి జరుగుతున్న దేమిటో ఆ పాత్రికేయుడికన్నా రష్యా, చైనాలకు మరింత లోతుగా తెలిసి ఉంటుంది. కానీ పాక్ చేస్తున్నది తప్పని చెప్పడంలో అవి నీళ్లు నమిలాయి. అందుకు బ్రిక్స్ సంయుక్త ప్రకటనే రుజువు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ‘ప్రపంచ దేశాలకు’ పిలుపునివ్వడం బాగానే ఉన్నా... పాకిస్తాన్ వైఖరిని లేదా అక్కడ వేళ్లూనుకుని మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్న జైషే మహమ్మద్‌లాంటి సంస్థలను పరోక్షంగానైనా ఖండించలేని ఇలాంటి ప్రకటనలవల్ల ఒరిగేదేమిటి? ఎందుకీ అశక్తత? ఇంతకూ ప్రపంచ దేశాలంటే ఏవి? బ్రిక్స్ దేశాలు అందులో భాగం కాదా?
సంయుక్త ప్రకటన పరమ లౌక్యంగా వ్యవహరించింది. ఉగ్రవాదంపై భారత్ అభిప్రాయాలను మన్నిస్తున్నట్టు కనిపిస్తూనే నిర్దిష్టత దగ్గరకొచ్చేసరికి నీళ్లు నమిలింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ను పేరెట్టి ప్రస్తావించి ఖండించిన బ్రిక్స్‌కు జైష్ సంస్థ కనబడలేదు. సిరియాలో ఉగ్రవాద ఉదంతాలకు పాల్పడుతున్న జభత్ అల్ నస్రా సంస్థను ఎత్తి చూపినవారికి పాక్‌లో లష్కరే తొయిబా, హక్కానీ నెట్‌వర్క్ వంటి సంస్థల సంగతి తెలియలేదు. ఎంత విచిత్రం! హక్కానీ నెట్ వర్క్ సంగతలా ఉంచి ఐఎస్, అల్ నస్రా సంస్థల్లాగే జైష్, లష్కరేలు కూడా ఐక్యరాజ్యసమితి నిషేధించినవేనని గుర్తుంచుకోవాలి. సిరియాలో అక్కడి సర్కారుకు దన్నుగా రంగంలోకి దిగిన రష్యాకు తలనొప్పిగా మారాయి గనుక అల్ నస్రా, ఐఎస్ సంస్థలను బ్రిక్స్ ప్రకటన ఖండించిందని... మనల్ని ఇబ్బందిపెడుతున్న సంస్థలు మాత్రం దాని కళ్లకు కనబడలేదని అనుకోవాల్సి వస్తుంది.
జైష్, లష్కరే వంటి సంస్థల వల్ల కేవలం మన దేశానికి మాత్రమే నష్టం కాదు. బ్రిక్స్‌లో భారత్‌లాంటి కీలకమైన దేశం దెబ్బతింటే దాని ప్రభావం ఆ సంస్థపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంగతిని చైనా గుర్తించినట్టే కనబడింది. ప్రకృతి వైపరీత్యాలు, భూతాపం, అంటువ్యాధులు వగైరాల్లాగే ఉగ్రవాదం కూడా ఆర్ధిక ప్రగతికి అవరోధమైనదని జీ జిన్‌పెంగ్ తన ప్రసంగంలో అన్నారు. కానీ ఆ వెంటనే ఆయన ఉగ్రవాదానికి దోహదపడుతున్న ‘మూలకారణాల’ గురించి, ‘రాజకీయ పరిష్కారం’ గురించి మాట్లాడారు. ఇది పాకిస్తాన్ భాష! మనం అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదం ఊసెత్తినప్పుడల్లా పాకిస్తాన్ అచ్చం ఇలాగే మాట్లాడుతుంది. కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా ఉండిపోవడంవల్లే ఉగ్రవాదం పుట్టుకొస్తున్నదని చెబుతుంది. కానీ ఆ ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చి, మారణాయుధాలందించి, శిక్షణనిచ్చి పంపు తున్నది తన సైన్యమేనన్న సంగతిని దాస్తుంది. ఇప్పుడు చైనా తలకెత్తుకున్నది ఆ వాదాన్నే!
ఏదీ గాల్లోంచి ఊడిపడదు. ఉగ్రవాదమైనా అంతే. కానీ దానికి కొన్ని దేశాలు నారూ, నీరూ పోయడం తప్పని చెప్పాలా, వద్దా? చైనా వాదనే సరైందనుకుంటే ఐఎస్ పుట్టుకకూ కారణాలున్నాయి. అమెరికా ఇరాక్‌ను దురాక్రమించకపోతే, సైనిక పదఘట్టనలతో ఆ దేశాన్ని సర్వనాశనం చేయకపోతే ఐఎస్ ఉనికిలోకొచ్చేదా? సజావుగా సాగుతున్న సిరియాలో చిచ్చు పెట్టకపోతే... అందుకోసం డబ్బు, ఆయు దాలు కుమ్మరించకపోతే ఐఎస్ ఇంతగా విస్తరించేదా? అలాగని అమెరికాను తప్పు బట్టడంతో సరిపుచ్చుకుంటారా? ఐఎస్ కార్యకలాపాలను విస్మరిస్తారా?
బ్రిక్స్ దేశాల్లో ఆర్ధికంగా అంతో ఇంతో పచ్చగా కనిపిస్తున్నదీ, ప్రగతి సాధిస్తున్నదీ మన దేశమే. భారత్ సాధించే ప్రగతి వల్ల మొత్తంగా బ్రిక్స్ దేశాలన్నీ లాభపడతాయి. పరస్పర సహకారంతో ప్రపంచంలో బ్రిక్స్ ఒక శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంగతిని ఏమాత్రం గుర్తించినా చైనా, రష్యాల తీరు భిన్నంగా ఉండాలి. అయితే అలాంటి ధోరణి కనబడలేదు. జీ జిన్‌పింగ్ ప్రసంగం కనీసం ఉగ్రవాదాన్నయినా ప్రస్తావించింది. ద్వైపాక్షిక చర్చల సందర్భంలో ఆ విషయమై మనకు మద్దతునిచ్చినట్టు కనబడిన పుతిన్ బ్రిక్స్‌లో ఆ మాత్రమైనా మాట్లాడ లేక పోయారు. సమష్టి గొంతు వినిపించలేనప్పుడూ, నిక్కచ్చిగా వ్యవహరించ లేన ప్పుడూ బ్రిక్స్ లాంటి సంస్థలు సాధించేదేమిటి?