న్యూఢిల్లీ: అన్ని దేశాలు సార్వభౌమత్వాన్ని, సమగ్రతను గౌరవించుకోవాలని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్ సంక్షోభం, అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తదితర అంశాలను చర్చించిన బ్రిక్స్ దేశాల నేతలు ఆయా సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని నొక్కిచెప్పారు. చైనా అధ్యక్షతన జరిగిన ఐదు దేశాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది.
యుద్ధం కారణంగా తలెత్తిన మానవీయ సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య చర్చలే పరిష్కారమంది. ఈ విషయంలో ఐరాస, రెడ్ క్రాస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. సీమాంతర ఉగ్రవాదం సహా అన్ని రకాలైన ఉగ్రవాదంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని తీర్మానించింది. అంతకుముందు ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఇంకా తొలిగిపోలేదని, దీని నుంచి బయటపడేందుకు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం సహాయకారిగా ఉంటుందని చెప్పారు.
‘‘కరోనా మహమ్మారి నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ వరుసగా మూడో ఏడాది మనం సమావేశమయ్యాం. ఇంతకుముందు కంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు తగ్గినప్పటికీ, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై ఇప్పటికీ కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక రంగం విషయంలో బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే రకమైన వైఖరి కలిగి ఉన్నాయి. ఆర్థికంగా తిరిగి పుంజుకునేందుకు మనం పరస్పరం సహకరించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది’’అని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.
బ్రిక్స్‌ను కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రసంగించారు. ఏకపకంగా కొందరు విధించే ఆంక్షలను, చిన్న కూటముల ఏర్పాటుకు సాగే ప్రయత్నాలను వ్యతిరేంచాలని పిలుపునిచ్చారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి విధానాలు, ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ‘‘కొన్ని దేశాలు సైనిక కూటములను విస్తరించుకునేందుకు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఆధిపత్యం సాధించుకునే క్రమంలో ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలను కాలరాస్తున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిని ఉపేక్షిస్తే మరింత అస్థిర పరిస్థితులు ఏర్పడతాయి’’అని పరోక్షంగా ఆయన అమెరికా, ఈయూలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా, ఈయూల నాటో విస్తరణ కాంక్షే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మూల కారణమన్నారు. భేటీలో మోదీ, జిన్‌పింగ్‌లతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా పాల్గొన్నారు. ప్రపంచ జనాభాలో 41%, జీడీపీలో 24%, వాణిజ్యంలో 16% బ్రిక్స్‌లోని ఐదు దేశాలదే.
Comments
Please login to add a commentAdd a comment