పగటి నిద్ర మేలే సుమా! | Sakshi Guest Column On Daytime sleep is enough | Sakshi
Sakshi News home page

పగటి నిద్ర మేలే సుమా!

Published Mon, Aug 12 2024 5:44 AM | Last Updated on Mon, Aug 12 2024 5:44 AM

Sakshi Guest Column On Daytime sleep is enough

అభిప్రాయం

పగటి నిద్ర పనికి చేటు అన్నారు మనవాళ్లు. కానీ పరిశోధకులు మరోరకంగా అంటున్నట్టున్నారు. పగటి పూట పని చేసుకునేట ప్పుడు  కళ్ళు బరువెక్కుతాయి. నిద్ర వస్తున్న భావన కలుగుతుంది. అప్పుడు కాసేపు పడుకుంటే తప్పా? అంటే కాదు అంటున్నారు పరిశోధకులు. ఆరోగ్యం దృష్ట్యా చూస్తే కొంతసేపు పడుకోవడం మంచిదే అంటున్నారు. అయితే ఈ పగటి నిద్ర అందరిపైనా ఒకే ప్రభావం కలిగిస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. 

చాలామందిలో మాత్రం కొంతసేపు పడుకుంటే మంచి జరుగుతుంది అని గమనించినట్లు పరిశోధకులు చెబు తున్నారు. క్రమంగా ప్రతి నిత్యం మధ్యాహ్నం కొంచెం సేపు పడుకుంటే అన్ని రకాల మంచిదే. దాని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి అని కొంత కాలం క్రితమే తెలుసుకున్నారు. మెదడుకు కూడా మంచిదే అంటున్నారు. మెదడు కణాలు తగ్గకుండా ఉంటే జ్ఞాపకశక్తి తగ్గడం అనే సమస్య తగ్గుతుంది. 

అయితే ఎంతసేపు పడుకోవాలి అన్నది పెద్ద ప్రశ్న. అరగంట వరకు పడుకుంటే తప్పు లేదు. మెదడుకు మంచి ఆరోగ్యం అందుతుంది, అది పనిచేసే, పెరిగే తీరు సక్రమంగా సాగుతుంది అంటున్నారు విక్టోరియా గార్ఫీల్డ్‌. ఆమె యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పరిశోధ కురాలు. 

సరైన సమయంలో కొద్దిపాటి నిద్ర వెంటనే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విష యాన్ని చాలా పరిశోధనల్లో నిర్ధారించారు. ఆరో గ్యంగా ఉన్నవారు ఒక క్రమంలో నిద్రపోతూ ఉంటే వాళ్ల మీద పరిశోధనలు జరిగాయి. పాత పరిశోధనల ఫలితాలను ఇక్కడి ఫలితాలతో సరిపోల్చి చూశారు. నిజానికి 2009లోనే ఇటు వంటి పరిశోధనా ఫలితాలు ‘స్లీప్‌ రీసెర్చ్‌’ అనే పత్రికలో వచ్చాయి. 

కొంతసేపు పడుకున్న వారిలో వారు పరిస్థితులకు ప్రతిచర్య చూపించే తీరు, చురుకుదనం, జ్ఞాపకశక్తి లాంటి అంశా లలో మంచి ప్రభావాలు కనిపించాయి. నిద్ర పోయి లేచిన తర్వాత సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంటే కొత్త అంశాలను ఊహించడం కూడా బాగా జరుగుతుంది. ఈ అంశం ఇటీవల పరిశోధనల్లో గమనించారు. 

పరిశోధనకు కూర్చున్న వారికి కొన్ని లెక్కలు ఇచ్చి చేయమన్నారు. ఆ లెక్కల్లో కొన్నింటికి సులభ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి మాత్రం వాలంటీర్లకు చెప్పలేదు. ప్రశ్న ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు పరిశోధకులు. కొద్దిసేపు కునికిన వారు కూడా ఆ లెక్కలను సులభంగా సాల్వ్‌ చేయగలిగారు. 

వారికి స్వల్ప మార్గాలు చటుక్కున తోచాయి. అదే ఎక్కువ సేపు నిద్ర పోయిన వారిలో మాత్రం ఇటువంటి చురుకు దనం కనిపించలేదు. అంటే మెదడులో ఎక్కడో విరామం కలిగే అవకాశం గల స్థానం ఉందని, దానివల్ల యురేకా అనుభవం కలుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

నిద్ర సరిగా రానివారూ, కావలసినంత నిద్ర పోలేని వారు కూడా కొద్దిసేపు పడుకున్నందుకు మంచి ప్రభావాలు ఉంటాయి అంటు న్నారు. షిఫ్ట్‌లలో పనిచేసేవారూ, చిన్న శిశు వులతో బతికే తల్లితండ్రులూ, రాత్రిపూట సరిగా నిద్ర పట్టని పెద్ద వయసు వారూ చిన్న కునుకు వల్ల లాభం పొందినట్టు గమనించారు. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న వాళ్లు షిఫ్ట్‌ మధ్యలో కొద్ది సేపు పడుకుంటే తప్పకుండా నిద్ర మత్తు తగ్గుతుంది. అసలు నిద్ర వస్తున్న భావమే కలు గదు. కొద్దిసేపు పడుకుని లేచిన తరువాత త్వర లోనే పరిస్థితి మారిపోతుంది. వారిలో చురుకు దనం కనిపిస్తుంది. 

వర్జీనియా కామన్వెల్త్‌ యూనివర్సిటీలో పని చేస్తున్న నటాలి డాటోవిచ్‌ బృందం వారు కూడా ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. వారికి నిజానికి ఔషధాలు తయారు చేసే కంపెనీలు, వైద్య పరికరాల కంపెనీలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. 20 నిమిషాలు పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గంటనుంచి గంటన్నరసేపు పడుకుంటే మరింతమంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు నటాలి. పడుకుంటే 20 నిమిషాలు పడు కోవాలి, లేదంటే గంటపైన పడు కోవాలి. అంతే కానీ మధ్యలో లేస్తే అంత మంచి ప్రభావం ఉండదు అని గమనించారు. 

ఎక్కువ రోజులపాటు ఇలా కునుకులు తీసే వారి మీద ప్రభావం గురించి మాత్రం అంతగా సమాచారం లేదు. నిద్రకు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి గల సంబంధాన్ని గురించి చెప్పడం అంత తేలిక కాదు అని కూడా ఈ పరిశోధకులు అంటున్నారు. 

‘కొంచెం సేపు నిద్రపోతే మంచిదేనట’ అని నిద్రకు ఉపక్రమించేవారు ఫలితాలను గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.మంచి ఫలితాలు కనిపిస్తే కొంచెం సేపు నిద్రించ వచ్చు. ఆ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసు కోవాల్సినది.

డా‘‘ కె. బి. గోపాలం 
వ్యాసకర్త సైన్స్‌ విషయాల రచయిత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement