చుక్కల ఆకాశంలోకి...చక్కగా ప్రయాణమై!
రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూస్తుంటే...ఎంత కాదన్నా భావుకత తన్నుకు వస్తుంది. ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో చక్కగా మాట్లాడాలనే కల కంటాం కూడా. అది వాస్తవరూపం దాల్చని అందమైన కల. అయితే రాత్రి వచ్చే కలలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. భేషుగ్గా...ఆకాశదేశానికి వెళ్లి అందమైన చుక్కలతో తనివితీరా మాట్లాడవచ్చు. కొద్దిమందికి చుక్కల దగ్గరికి వెళ్లినట్లు కల వస్తుంటుంది.
దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం...
ఆకాశం అనేది మనలో ఎప్పటి నుంచో ఉన్న సుదీర్ఘ లక్ష్యం అయితే, అక్కడికి వెళ్లి చుక్కలను పలకరించడం అనేది లక్ష్యాన్ని చేరుకోవడాన్ని లేదా చేరువ కావడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇక ప్రేమికుల విషయంలో అయితే ‘ప్రేమ ఫలించడం’ అనే అర్థంలో దీన్ని చూడవచ్చు.
మాటమాత్రంగా కూడా ఎప్పుడూ ఊహించని అవకాశాలు వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ఆకాశంలో చుక్కలు ఉన్నట్టుండి రాలిపడడం, లేదా ఆకాశం నల్లగా మారి చుక్కలు కనిపించకపోవడం అనేది... మంచి అవకాశం ఒకటి వచ్చినట్లే వచ్చి చేజారడాన్ని సూచిస్తుంది. కొన్ని మానసిక విశ్లేషణల ప్రకారం, వచ్చే జన్మ లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారికి కూడా చుక్కల మధ్య విహరించినట్లు కలలు వస్తాయి.
ఆధ్యాత్మిక విశ్లేషణల ప్రకారం అయితే, సరికొత్త జ్ఞానానికి చేరువ కావడాన్ని ఈ కల సూచిస్తుంది. శాస్త్రసాంకేతిక విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, అంతరిక్షం ఎప్పుడూ ఒక ప్రహేళిక లాంటిదే. వారిలో ఎప్పటికప్పుడు ఎన్నో ప్రశ్నలు మొలకెత్తుతుంటాయి. వాటికి సమాధానాలు మాత్రం అంత తేలిగ్గా దొరకవు. అలాంటి వారు ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో మాట్లాడడం అనేది... సమాధాన తృష్ణను ప్రతిబింబిస్తుంది.