సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్‌ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు.
ఉపాధి వనరుగా..
ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్‌లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్‌ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు.
దేశంలో ఇలా..
దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్‌లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్‌పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్‌లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్‌లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది.
లద్ధాఖ్‌కు ప్రత్యేక గుర్తింపు!
ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్‌లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment