నక్షత్రాలు దూసిన ఆకాశం
ప్రతి ఆడకూతురూ ప్రదక్షిణ చేస్తుంది. ఆషాఢం వచ్చిన ప్రతిసారీ ఆ చెట్టు..
నక్షత్రాలు దూసిన ఆకాశం
తూరుపులా రుబ్బురోలు పండేకా
సంధ్యవేళకి పడతుల పడతి పేరెత్తగానే
సిగ్గు మందారం అరచేతిలో విచ్చుకుంటుంది
అరా కొరా మిగిలిన ఆనందాన్ని
ఆటలో బుడంకాయలాంటి నాకు
అరచేతిలో అప్పచ్చి అంటూ
చందమామని నాకు పంచిన మర్నాడు
మధ్యలో బంతి ఆకు
ఎలా వచ్చిందో నేను చెప్పను
గోరింటాకు చెట్టున్న మా పాపత్త
వాడ అంతటికీ బంధువు
ఆషాఢం వచ్చిన ప్రతిసారీ
ఆ చెట్టు
నక్షత్రాలని దూసిన ఆకాశం
- వర్మ కలిదిండి
ఫోన్: 9948943337
సాహిత్యం పేజీలో (ఆగస్టు 2, 2015) ‘రాబోవు పుస్తకం’ కింద ‘జయమ్’ గురించిన అనుబంధం చదివి రాస్తున్నాను.
పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొన్ని దశాబ్దాలుగా నిష్ణాతులైన పండితులు వ్యాస మహాభారతంలో శతాబ్దాలుగా ఎవరికై వారు చొప్పించిన ఉపాఖ్యానాలు, అసంబద్ధ చేర్పులు ఏరి చివరికి జైమిని రాసిన జయం కావ్యానికి చేరువకావాలన్నది వారి లక్ష్యం. దానికోసం అన్ని లిపులలో ఉన్న ప్రాచీన గ్రంథాలని సేకరించి, క్రిటికల్ ఎడిషన్‌ని పదకొండు సంపుటాలుగా ప్రచురించారు. ఎనిమిదవ శతాబ్దం పూర్వపు ప్రతులు దొరకలేదు. అన్వేషణ ఇంకా జరుగుతోంది. భగవద్గీత భారతంలో భాగం కాదని నిరూపించారు. ఉపగీతని నిరాకరించారు. రీసెర్చ్ ఇంకా జరుగుతోంది. డాక్టర్ ఇరావతి కర్వే రాసిన యుగాంత పుస్తకం ఉపోద్ఘాతంలో మరింత సమాచారం లభ్యమవుతుంది. అదే మార్గంలో బహుశా ఒంటరిగా సాగుతున్న నాయుని కృష్ణమూర్తి అభినందనీయులు.
- గబ్బిట కృష్ణమోహన్
ప్రపంచ మూలవాసీ దినోత్సవం (9 ఆగస్టు 2015) సందర్భంగా
నల్లమలలో మూలవాసీ చెంచులతో ఆత్మీయ కలయిక
ఆదివాసీ తెగకు సంబంధించిన సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. వారి స్థానిక, ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. వాటి అమలు విధానంలో జాగ్రత్త వహించాలి. ఒకే పథకం అన్ని తెగలకీ, ఒక్కో తెగలోని వివిధ ప్రాంతాలలో నివసించే అందరికీ యాంత్రికంగా వర్తింపజేయడం సరికాదు. ప్రస్తుతం మూలవాసీ చెంచులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి నేల వారిది కాకుండా పోతున్నది. నీరు, రవాణా, వైద్యం, ప్రభుత్వ పథకాల అమలు వంటి ఎన్నో రంగాలలో వారు ఎదుర్కొనే సాధకబాధకాలను అధ్యయనం చేసి, వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది.
శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు దగ్గర, ఫరాబాదుకి 20 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో గల అప్పాపూర్ (లింగాల మండలం, మహబూబ్‌నగర్) చెంచు గ్రామం, దాని పరిసరాల్లోని ఆరు గ్రామాల చెంచుల మధ్యన ఒక సభ ఏర్పాటుచేస్తున్నాం. చెంచుల నోటి సాహిత్యం, సంస్కృతి, భాషా విశేషాలు, జీవనవిధానం, ఆర్థికాంశాలను అధ్యయనం చేస్తాం. నాగర్‌కర్నూల్ శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో అదే రోజున వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం.
మొదట చెంచులదే అయిన కిన్నెర తంత్రీ వాద్యం ఇప్పుడు అక్కడ కనిపించకుండా పోయింది. అడవి పందులు, సొర తీగను, కాయలను నాశనం చేయడం వల్ల సొరబుర్రలు, విత్తనాలు మాయమయ్యాయి. అందువల్ల కిన్నెర వాద్యం తయారీ ఆగిపోయింది. అయితే చెంచుల పన్నెండు మెట్ల కిన్నెర వాద్యాన్ని ఏడు మెట్ల కిన్నెరగా మార్చుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల డక్కలి వారు కిన్నెరను తమదిగా స్వీకరించి, మైదాన గ్రామాల్లో వినిపిస్తున్నారు. ఈ కిన్నెరవాద్యాన్ని తిరిగి చెంచులకు బహూకరించనున్నాం. అలాగే చెంచుల కిన్నెర వాదన కూడా ఏర్పాటుచేశాం.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కేంద్రంగా పనిచేసే ‘చెంచులోకం’ సంస్థ, సిడాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పాలమూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, రచయితలు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారందరికీ ఆహ్వానం. మరిన్ని వివరాలకు బెల్లి యాదయ్య ఫోన్: 9848392690.
- జయధీర్ తిరుమలరావు
అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక
పుస్తక పరిచయ సభ
‘సాహితీమిత్రులు’ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి చాంబర్స్‌లో శిఖామణి పుస్తకాలు ‘పొద్దున్నే కవిగొంతు’, ‘స్మరణిక’, ‘తెలుగు మరాఠీ దళిత కవిత్వం’ పరిచయ సభ జరగనుంది. వక్తలు పాపినేని శివశంకర్, సీతారాం, బండ్ల మాధవరావు.