![Miss Hyderabad Title Winner Monika Established Foundation In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/17/mounika.jpg.webp?itok=py_qffww)
అక్షర్ బ్యాండ్ బృంద సభ్యులతో మౌనిక (ఎడమ నుంచి రెండో వ్యక్తి)
అందాల పోటీల్లో గెలుపొందిన తర్వాత దాదాపు ప్రతి బ్యూటీక్వీన్ చెప్పేమాట సేవాబాట పడతామనే. అయితే ఆ మాటను నిలబెట్టుకునేవారు అరుదే. దీనికి తాను భిన్నం అంటున్నారు నగరానికి చెందిన మౌనిక. ఐదేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ... సేవలోనే అందం ఆనందం అంటున్నారు.
సాక్షి, రంగారెడ్డి: ‘కేన్సర్‌పై ఎంతగా అవగాహన పెరుగుతున్నా.. ఇంకా కేన్సర్ మరణాలు ఆగడం లేదు’ అంటున్న మౌనిక తంగల్లపల్లి.. ఐదేళ్ల క్రితం తన ప్రాచుర్యానికి బాట వేసిన మిస్ హైదరాబాద్ టైటిల్‌ని కేన్సర్ బాధితుల సేవకు ఒక మార్గంగా మలుచుకున్నారు.2014లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన అనంతరం మిస్ ఇండియా టూరిజం ఇంటర్నేషనల్ కూడా గెలుచుకున్న మౌనిక ఉత్సవి ఫౌండేషన్ ప్రారంభించారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల అంశాలను ఎంచుకుని నిధుల సమీకరణ చేస్తున్నారు. ఏటా పెరుగుతున్న కేన్సర్ మరణాలు, ఆ వ్యాధి బాధితుల కోసం జుంబా, యోగా తదితర ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో అక్షర్ బ్యాండ్‌తో గత నెల 14న నగరంలోని స్కైలాంజ్‌లో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రానున్న ఫిబ్రవరి వరకూ ఈ ఈవెంట్స్ కొనసాగిస్తామని వచ్చే నిధులను కేన్సర్ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న సంస్థలకు అందిస్తామని అంటున్నారు మౌనిక.
ర్యాప్ సింగర్ ‘షేర్ ఎ మీల్’ అన్నదానం
రోజూ ఆకలితో అలమటించే వారెందరో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూసే అచేతన హృదయాలేనో.. ఉరుకుల పరుగుల నగర జీవితంలో మనసుతో వినగలిగితే వినిపించే ఆకలి కేకలెన్నో... అవి వినే తీరిక కొందరికి ఉండదు. విన్నా వాటి కోసం చేయగలిగే స్తోమత మనకి లేదనుకుంటారు మరికొందరు. అయితే ఆ యువకుడు మాత్రం తనతో పాటు మరొకరి ఆకలి తీర్చలేనా? అనుకున్నాడు. రోజూ ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. అంతులేని తృప్తిని మనసులో నింపుకొంటున్నాడు. ‘ఇప్పటికీ ఓ మనిషి ఆకలితో బాధపడడం అది సాటి మనుషులుగా మన అందరికీ అవమానం’ అంటాడు మేఘ్‌రాజ్ రవీంద్ర. అలాంటి ఆలోచనలో నుంచే ఆయన షేర్ ఎ మీల్ పేరిట వ్యక్తిగతంగా ఒక కార్యక్రమం రూపొందించుకున్నాడు.
తనవంతుగా రోజుకి ఒకరికైనా ఆకలి తీర్చాలనే ఆలోచనతో తన సంపాదనలో రోజూ ఒక్కరికి అన్నదానం చేస్తున్నాడు. ఒక సంవత్సరం గడిచాక రెట్టింపైన ఆనందంతో తదుపరి ఏడాది నుంచి నిత్యం కనీసం ఇద్దరికి అన్నం పెడుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన అన్నసేవ నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికి దాదాపు 1600 మందికి పైగా ఆకలి కడుపులకు వ్యక్తిగతంగా సాంత్వన చేకూర్చాడు. నిత్యం తను గాంధీ హాస్పిటల్, కేన్సర్ హాస్పిటల్, పద్మారావునగర్ తదితర ప్రాంతాలలో ఉన్న అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాడు.
పాటే ఉపాధి బాట..
వ్యక్తిగతంగా మేఘరాజ్ ర్యాప్ సింగర్. తాజాగా విడుదలైన జార్జిరెడ్డి సినిమాలోనూ ఓ పాత్ర పోషించాడు. గొప్ప ఆదాయం లేకపోయినా మరొకరి ఆకలి తీర్చడంలోని ఆనందం ఎంత ఖర్చు పెట్టినా రాదంటాడు మేఘరాజ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చూసిన ఎంతో మంది యువత తనని ఆదర్శంగా తీసుకుని వారు కూడా ఇలా అన్నదానం చేయడం ఇంకెంతో సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఆకలి తీర్చే క్రమంలో తనకు ఎదురైన అనుభవాలు, ఆవేదనలు, ఆకలి అవస్థలు ఏన్నో ఎన్నెన్నో.. ‘ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి ఆకలి తీర్చాలి’ అనేదే తన ధ్యేయం అంటున్నాడు మేఘరాజ్.
Comments
Please login to add a commentAdd a comment