సిటీకి చెందిన అమూల్య డాక్టర్. ఓ రోజు విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా ఆకలితో అలమటిస్తున్న వృద్ధుడిని చూసి చలించిపోయింది. రూ.200 ఇచ్చి ఏమైనా తినమని చెప్పింది. ఇంకా ఇలాంటి వారెందరో ఉన్నారనే ఆలోచన ఆమెను ఆలోచింపజేసింది. అంతే.. స్నేహితులతో కలిసి ఓ గ్రూప్ ఏర్పాటు చేసి రోజుకు 150 మంది ఆకలి తీరుస్తోంది.
యూఎస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అమూల్య నగరంలో ఓ హాస్పిటల్ నిర్వహిస్తోంది. ఆమె సందేశంతో ముందుకొచ్చిన నవనీత్, ఉమ, తేజ, సంస్కృతిలతో కలిసి నగరంలోని ప్రధాన సిగ్నల్ పాయింట్స్ వద్ద ఉండే యాచకులు, దూర ప్రాంతాల నుంచి ఆస్పత్రులకు వచ్చే పేదలకు భోజనం అందిస్తోంది. ఈ బృందం ప్రతి రోజు సుమారు 150 మందికి ఆహార ప్యాకెట్లు అందజేస్తోంది. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చు చేస్తున్నట్లు అమూల్య చెప్పారు. కృష్ణా జిల్లాలోని పెడన సమీపంలోని కప్పలదొడ్డిలో 40 వృద్ధ కుటుంబాలున్నాయని తెలుసుకున్న అమూల్య... ప్రతి నాలుగు నెలలకు అక్కడి వెళ్లి, వారికి కావాల్సినవి అందజేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని వారు ఎదురుచూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంటుందన్నారు.
అందరి ఆకలి తీర్చాలి..
మేం ప్రస్తుతం కొద్ది మంది ఆకలే తీరుస్తున్నాం. భవిష్యత్తులో మరింత మంది ఆకలి తీర్చాలని అనుకుంటున్నాం. స్నేహితులు కూడా ఖర్చు విషయంలో రాజీ పడట్లేదు. ఎంత ఖర్చయినా అందరి ఆకలి తీర్చాలనేదే మా కోరిక. మాతో మరింత మంది కలిసి రావాలని ఆశిస్తున్నాం.– అమూల్య
Comments
Please login to add a commentAdd a comment