క్యారేజీలతో భోజనం సిద్ధం చేస్తున్న దృశ్యం
ఆకివీడు: మానవత్వానికి కొదవ లేదు.. దాతృత్వానికి అవధుల్లేవు.. అన్నట్టు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా చెరుకుమిల్లి గ్రామం. అనాథలను ఆదుకుంటూ, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులు. గ్రామానికి చెందిన పలువురు క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారు సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.
ఎక్కడెక్కడో సేవలు చేసేకన్నా సొంత గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తలంపుతో గ్రామంలో క్షత్రియ సేవా సమితిని ఏర్పాటుచేశారు. ట్రస్టు ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు సూచనల మేరకు 2007లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆయన సూచనల మేరకు 25 మంది ఒంటరి వృద్ధులు, వ్యక్తులకు రోజూ రెండు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంటి వద్దకే క్యారేజీలతో భోజనం పంపించే ఏర్పాట్లు చేశారు. మొదట్లో క్షత్రియ, క్షత్రియేతరులకు క్యారేజీల ద్వారా భోజనం అందజేశారు. ప్రస్తుతం క్షత్రియ సామాజికవర్గంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు క్యారేజీల భోజనం అందజేస్తున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఆర్థిక సహకారాన్ని వెచ్చిస్తున్నారు.
రుచితో పాటు నాణ్యత
క్యారేజీల ద్వారా అందిస్తున్న ఆహారం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంటుందని, రుచితో పాటు నాణ్యత మెండు అని వృద్ధులు అంటున్నారు. రోజూ ఉదయం పప్పు, పచ్చడి, రసం, కూర లేదా పులుసు కూర, పెరుగు, సాయంత్రం ఇగురు కూర, వేపుడు, సాంబారు, పచ్చడి, పెరుగుతో భోజనాన్ని అందిస్తున్నారు.
కరోనా విపత్తులోనూ..
కరోనా విపత్తులోనూ ఉచిత భోజనాన్ని వృద్ధుల ఇళ్లకు చేర్చారు. కరోనాను ఎదుర్కొనేలా రోజూ కోడి గుడ్డు, చికెన్ భోజనాన్ని అందించారు.
దాతలు ప్రత్యక్ష దేవుళ్లు
ఇక్కడ దాతలు మాతకు ప్రత్యక్ష దేవుళ్లు, 14 ఏళ్లుగా ఉచితంగా భోజనం చేస్తున్నాను. ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు క్యారేజీలు సిద్ధమవుతాయి. సంస్థ ఆఫీసు దగ్గరకు వెళ్లి తెచ్చుకోలేనివారికి ఇళ్లకే పంపిస్తున్నారు. నేను 14 ఏళ్లుగా వెళ్లి తెచ్చుకుంటున్నాను. ఈ గ్రామంలో పుట్టినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను.
– దాట్ల రామలింగరాజు, చెరుకుమిల్లి
ఇబ్బంది లేకుండా..
రెండు పూటలా భోజనం ఇబ్బంది లేకుండా పెడుతున్నారు. పిల్లలు దగ్గర లేకపోవడంతో గతంలో భోజనానికి చాలా ఇబ్బంది పడే దాన్ని. ఇంట్లో వండుకునే విధంగానే రుచి, శుచి క్యారేజీల్లో భోజనం ఉంటుంది. దాదాపు 13 ఏళ్లుగా ఇక్కడ భోజనం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీరి కార్యక్రమం అభినందనీయం.
– మంతెన కస్తూరి, చెరుకుమిల్లి
వండుకునే బాధలేదు
ముసిలిదానినై పోయాను. ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నారు. వృద్ధాశ్రమాలకన్నా ఈ విధానం ఎంతో బాగుంది. పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. పనిమనిషి మిగిలిన పనులు చేస్తుంది. పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. క్షత్రియ సేవాసమితి ఔదార్యం ఎంతో గొప్పది. చాలా ఆనందంగా ఉంది.
– దాట్ల మంగమ్మ, చెరుకుమిల్లి
రుచీశుచితో..
సేవా సమితి ప్రాంగణం శుభ్రతగా ఉంచడంతో పాటు రుచికరమైన ఆహారం అందిస్తున్నాం. పెరడులో పండిన పంటలను వినియోగిస్తున్నాం. దాతలు అందించిన కూరగాయలు, పిండి వంటలను కూడా క్యారేజీల్లో పంపుతున్నాం. నిత్య పర్యవేక్షణతో కార్యక్రమం నడుస్తోంది.
–దాట్ల వెంకట కృష్ణంరాజు, ఇన్‌చార్జి, సేవాసమితి, చెరుకుమిల్లి
Comments
Please login to add a commentAdd a comment