Kshatriya
-
‘ఫ్యూచర్ సిటీ’లో పెట్టుబడులు పెట్టండి
గచ్చిబౌలి: తెలంగాణ అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వామ్యం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ‘ఫ్యూచర్‌సిటీ’లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలుగా ఉందని.. కొత్తగా అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్‌సిటీ నిర్మించనున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవాసమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ శివార్లలో 1960లోనే చిన్న గ్రామంగా ఉండే కొంపల్లి ప్రాంతానికి క్షత్రియులు వలస వచ్చి, పెట్టుబడులు పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫార్మా, వైద్య, విద్య, మీడియా రంగాల్లో రాజులు పెట్టుబడులు పెట్టి విజయం సాధించారన్నారు. సినీ రంగంలో కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేమని, బాహుబలి ప్రభాస్ కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో గర్వించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా రాంగోపాల్‌వర్మ ఎంతో ఎదిగారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి జీవం పోస్తాం తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాజులే ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నూతన విధానానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తోందన్నారు. క్షత్రియ భవన్‌కు స్థలం ఇస్తాం హైదరాబాద్‌లో క్షత్రియ భవన్ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో రాజుల దర్పం కనిపించేలా దివ్యమైన భవన నిర్మాణ బాధ్యత క్షత్రియ సమితి తీసుకోవాలన్నారు.క్షత్రియులకు అండగా ఉంటామని, రాజకీయంగా ఎదిగేలా ముందు పార్టీ లో పదవులు ఇచ్చి, అనంతరం పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పా రు. పార్టీలో చేరితే నాలుగేళ్లలో నాయకులుగా మార్చి, తర్వా త ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా ప్రొత్సహిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు క్రియాశీల పాత్ర పోషించారని ప్రశంసించారు.తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: శ్రీనివాస వర్మరాష్ట్ర విభజన సమయంలో తన్ని తరిమేస్తామన్నా ఎక్కడికీ వెళ్లబోమని క్షత్రియులు చెప్పారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. గోదావరి, వైజా గ్, చిత్తూరు జిల్లాల క్షత్రియులు అక్కడి పొలాలను అమ్ము కుని వచ్చి.. ఇక్కడ భూములు కొన్నారని, పరిశ్రమలు నెలకొల్పారని గుర్తు చేశారు. కష్టాన్ని నమ్ముకున్న క్షత్రియులు తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.హైదరాబాద్ క్షత్రియుల కర్మ భూమి అని.. ఇక్కడికి వచ్చిన క్షత్రియులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అభివృద్ధిలో సహకారం అందించాలని క్షత్రియులకు పిలుపునిచ్చారు. కాగా.. క్షత్రియులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, క్షత్రియభవన్కు స్థలం ఇవ్వాలని, పేద క్షత్రియులకు రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు విజ్ఞప్తి చేశారు. -
నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్‌గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమి తులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్‌కు రూపకల్పన చేసింది. ‘మూన్ టు మార్స్’ కార్యక్రమానికి సారథ్యం వహించనున్న అమిత్ క్షత్రియ నాసా ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ మిషన్ డైరెక్టరేట్‌లో కొత్తగా ఏర్పాటయ్యే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఆయన కామన్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ డెవలప్మెంట్ డివిజన్ తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. 2003 నుంచి అంతరిక్ష కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వచ్చారు. క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూక్‌ఫీల్డ్‌లో పుట్టారు. -
సీఎం వైఎస్ జగన్‌తో క్షత్రియ సేవా సమితి నేతల భేటీ
సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరిట జిల్లా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్‌ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పేరిచర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లూరి సీతారామరాజు పేరుతో నూతన జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌ను సన్మానించారు. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? అలాగే అల్లూరి 125వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ధన్యవాదాలు తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ సామాజికవర్గంలోని పేదలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వారు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రఘురామరాజు, వి.వెంకటేశ్వరరాజు, అఖిల భారత క్షత్రియ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ దాట్ల, భీమవరం క్షత్రియ పరిషత్ సభ్యులు గాదిరాజు సుబ్బరాజు, దక్షిణ భారత క్షత్రియ సంఘం సభ్యులు మంతెన సోమరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్షత్రియ సమితి.. సేవానిరతి
ఆకివీడు: మానవత్వానికి కొదవ లేదు.. దాతృత్వానికి అవధుల్లేవు.. అన్నట్టు ఉంది పశ్చిమ గోదావరి జిల్లా చెరుకుమిల్లి గ్రామం. అనాథలను ఆదుకుంటూ, ఆపదలో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉంటూ, గ్రామాభివృద్ధికి తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామానికి చెందిన క్షత్రియ సేవా సమితి నిర్వాహకులు. గ్రామానికి చెందిన పలువురు క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వారు సంపాదించిన దానిలో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడెక్కడో సేవలు చేసేకన్నా సొంత గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం చేయాలనే తలంపుతో గ్రామంలో క్షత్రియ సేవా సమితిని ఏర్పాటుచేశారు. ట్రస్టు ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు సూచనల మేరకు 2007లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం ఆయన సూచనల మేరకు 25 మంది ఒంటరి వృద్ధులు, వ్యక్తులకు రోజూ రెండు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. ఇంటి వద్దకే క్యారేజీలతో భోజనం పంపించే ఏర్పాట్లు చేశారు. మొదట్లో క్షత్రియ, క్షత్రియేతరులకు క్యారేజీల ద్వారా భోజనం అందజేశారు. ప్రస్తుతం క్షత్రియ సామాజికవర్గంలోని వృద్ధులు, వితంతువులు, అనాథలకు క్యారేజీల భోజనం అందజేస్తున్నారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో పూర్తి ఆర్థిక సహకారాన్ని వెచ్చిస్తున్నారు. రుచితో పాటు నాణ్యత క్యారేజీల ద్వారా అందిస్తున్న ఆహారం ఇంట్లో వండుకున్నట్టుగా ఉంటుందని, రుచితో పాటు నాణ్యత మెండు అని వృద్ధులు అంటున్నారు. రోజూ ఉదయం పప్పు, పచ్చడి, రసం, కూర లేదా పులుసు కూర, పెరుగు, సాయంత్రం ఇగురు కూర, వేపుడు, సాంబారు, పచ్చడి, పెరుగుతో భోజనాన్ని అందిస్తున్నారు. కరోనా విపత్తులోనూ.. కరోనా విపత్తులోనూ ఉచిత భోజనాన్ని వృద్ధుల ఇళ్లకు చేర్చారు. కరోనాను ఎదుర్కొనేలా రోజూ కోడి గుడ్డు, చికెన్ భోజనాన్ని అందించారు. దాతలు ప్రత్యక్ష దేవుళ్లు ఇక్కడ దాతలు మాతకు ప్రత్యక్ష దేవుళ్లు, 14 ఏళ్లుగా ఉచితంగా భోజనం చేస్తున్నాను. ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు క్యారేజీలు సిద్ధమవుతాయి. సంస్థ ఆఫీసు దగ్గరకు వెళ్లి తెచ్చుకోలేనివారికి ఇళ్లకే పంపిస్తున్నారు. నేను 14 ఏళ్లుగా వెళ్లి తెచ్చుకుంటున్నాను. ఈ గ్రామంలో పుట్టినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. – దాట్ల రామలింగరాజు, చెరుకుమిల్లి ఇబ్బంది లేకుండా.. రెండు పూటలా భోజనం ఇబ్బంది లేకుండా పెడుతున్నారు. పిల్లలు దగ్గర లేకపోవడంతో గతంలో భోజనానికి చాలా ఇబ్బంది పడే దాన్ని. ఇంట్లో వండుకునే విధంగానే రుచి, శుచి క్యారేజీల్లో భోజనం ఉంటుంది. దాదాపు 13 ఏళ్లుగా ఇక్కడ భోజనం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వీరి కార్యక్రమం అభినందనీయం. – మంతెన కస్తూరి, చెరుకుమిల్లి వండుకునే బాధలేదు ముసిలిదానినై పోయాను. ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నారు. వృద్ధాశ్రమాలకన్నా ఈ విధానం ఎంతో బాగుంది. పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. పనిమనిషి మిగిలిన పనులు చేస్తుంది. పిల్లలు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారు. క్షత్రియ సేవాసమితి ఔదార్యం ఎంతో గొప్పది. చాలా ఆనందంగా ఉంది. – దాట్ల మంగమ్మ, చెరుకుమిల్లి రుచీశుచితో.. సేవా సమితి ప్రాంగణం శుభ్రతగా ఉంచడంతో పాటు రుచికరమైన ఆహారం అందిస్తున్నాం. పెరడులో పండిన పంటలను వినియోగిస్తున్నాం. దాతలు అందించిన కూరగాయలు, పిండి వంటలను కూడా క్యారేజీల్లో పంపుతున్నాం. నిత్య పర్యవేక్షణతో కార్యక్రమం నడుస్తోంది. –దాట్ల వెంకట కృష్ణంరాజు, ఇన్చార్జి, సేవాసమితి, చెరుకుమిల్లి -
సీఎం జగన్‌తో క్షత్రియ నేతల భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు క్షత్రియ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం వారు సీఎంతో భేటీ అయ్యారు. క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ పి.వి.సూర్యనారాయణరాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు, గాదిరాజు నారాయణరాజు తదితరులున్నారు. చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు -
కులాలకు కేసులకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే.. ఆయన కులం చాటున దాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని క్షత్రియ నేతలు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ డి.సూర్యనారాయణరాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కె.కె.రాజు మండిపడ్డారు. కులాలకు– కేసులకు సంబంధం లేదని, తప్పు చేసిన వారు ఏ కులంవారైనా శిక్ష పడుతుందని వారు స్పష్టంచేశారు. ‘‘రాజకీయ, న్యాయ వివాదాల్లో... ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాల్లో కులసంఘాల జోక్యం సబబు కాదు. అశోక్‌గ జపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ పేరిట చేసిన మోసాలు, అవినీతి వ్యవహారాలను ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు వదిలిపెట్టాలే తప్ప కుల సంఘాల జోక్యం తగదు. అశోక్‌గజపతిరాజు తప్పు చేసి క్షత్రియ కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదెంతమాత్రం క్షమార్హం కాదు’’ అని విశాఖలో ఉత్తరాంధ్ర నేతలు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజయవాడలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘గతంలోనూ చంద్రబాబు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడూ ఎల్లో మీడియా సాయంతో రెడ్డి, క్షత్రియుల మధ్య గొడవలు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రజలు ఛీ కొట్టినా ఆయనకు బుద్ధి రాకపోవడం సిగ్గు చేటు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులకు సంబంధించి ఊరు, పేరు లేకుండానే క్షత్రియుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు ప్రకటనలివ్వడం దారుణం. క్షత్రియులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు... సిద్ధాంతాలకు కట్టుబడే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు చెప్పారు. బాబు హైదరాబాద్‌లో కూర్చుని ఇక్కడ కులాల కురుక్షేత్రాన్ని కోరుకోవడం మానుకోవాలని హితవు పలికారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి వైఎస్ జగన్ క్షత్రియులకు మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, మంత్రి పదవి ఇచ్చారని, దీన్నెవరూ మరచిపోరని చెప్పారాయన. మహిళపై వివక్ష క్షత్రియ ధర్మమా? విశాఖలో మాట్లాడిన క్షత్రియ నేతలు... ఇప్పుడు అశోక్‌గజపతిరాజును సమర్థిస్తూ, కొమ్ముకాస్తున్న ఒక వర్గం క్షత్రియ నేతలే గతంలో ఆయన తండ్రి దోపిడీదారుడని విమర్శించారని గుర్తుచేశారు. అశోక్‌గజపతిరాజు అంశాన్ని కులానికి ముడిపెట్టి కొన్ని పత్రికల్లో కథనాలు రాయడాన్ని క్షత్రియుల తరఫున ఖండిస్తున్నామన్నారు. అశోక్‌గజపతిరాజు తన అన్న కూతురు సంచయితకు ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై వివక్ష చూపించడం క్షత్రియ ధర్మమా? అసలు క్షత్రియ కుటుంబంలో మహిళలకు ఎంత గౌరవమిస్తారో అశోక్ గజపతికి తెలుసా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎటువంటి హక్కులుండవని చెప్పడమే అశోక్ గజపతి ఉద్దేశమయితే.. ఆ వాదనను రాష్ట్రంలో క్షత్రియలెవ్వరూ సమర్థించరని చెప్పారు. ‘‘పంచగ్రామాల సమస్య పరిష్కారానికి అనుకూలమో, వ్యతిరేకమో.. అశోక్‌గ జపతి తక్షణమే చెప్పాలి. కోటిపల్లి వద్దనున్న మాన్సాస్ ట్రస్టు భూములను ఏపీఎండీసీకి (2020కి ముందు) అప్పగించక మునుపు అక్కడ ఇసుకను లెక్కాపత్రం లేకుండా దోచుకున్నది ఎవరు? మాన్సాస్ విద్యాసంస్థలకు రావాల్సిన రూ.35 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం« దరఖాస్తు కూడా చేయకుండా ఆ సంస్థలను నాశనం చేసింది ఎవరు? మాన్సాస్ భూములను కోర్టుకు తెలియకుండా వేలం వేయించింది ఎవరు? 20 ఏళ్లుగా మాన్సాస్ ట్రస్టు అకౌంట్లను ఆడిటింగ్ చేయించలేదంటే.. ఇది ట్రస్టుగా నడుస్తోందా? లేక అశోక్‌గజపతి సొంత వ్యవహారంలా నడుస్తోందా? అని ప్రశ్నించారు. వీరితో పాటు ఈ సమావేశంలో విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్‌రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రఘురామరాజు, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, మాజీ సీఈసీ సభ్యుడు శ్రీనివాసరాజు, కార్పొరేటర్లు అనిల్‌కుమార్‌రాజు, భూపతిరాజు సుజాత, జానకిరామరాజు, పార్టీ అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణంరాజు, సంయుక్త కార్యదర్శి కిరణ్‌రాజు పాల్గొన్నారు. -
3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
-
రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు
సాక్షి, అమరావతి : అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు. -
ఎంపీ రఘురామకృష్ణరాజుపై క్షత్రియ నాయకుల ధ్వజం
-
రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఎంపీ రఘురామకృష్ణరాజు తీరును క్షత్రియ నాయకులు తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆదివారం భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లి గూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారన్నారు. రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రఘురామకృష్ణరాజుకు స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని.. స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. రఘురామ మాట్లాడే విధానం, పద్ధతి అపహస్యంగా ఉందని మండిపడ్డారు. ‘‘గడిచిన 14 నెలలుగా ఒక్కసారి కూడా సొంత నియోజకవర్గానికి రాలేదు. హైదరాబాద్, ఢిల్లీలో మకాం పెట్టి రోజుకో కులాన్ని దూషిస్తున్నాడు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసే ఎవ్వరికీ సపోర్ట్ చేయమని’’ క్షత్రియ నాయకులు స్పష్టం చేశారు. చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు? -
'దీపికా చెవులు, ముక్కు కోస్తే కోటి రూపాయలు'
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే దాదాపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను తగులబెడుతూ విధ్వంసానికి పాల్పడుతున్న కర్ణిసేన మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ చిత్రాన్ని విడుదల చేయాడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్నా ఆ సినిమా గురువారం విడుదల కావడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. క్షత్రియ మహాసభ అధ్యక్షుడు గజేంద్ర సింగ్ ఈ చిత్రంలో పద్మావత్‌గా నటించిన దీపికా పదుకొనేపై నిప్పులు చెరిగాడు. 'దీపికా పదుకునే చెవులు, ముక్కులు కోసినవారికి క్షత్రియ కమ్యూనిటీ రూ.కోటి బహుమతిగా ఇస్తుంది' అని ఆయన ప్రకటించారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఈ మేరకు సంచలన ఆఫర్ చేశారు. ఇదిలా ఉండగా, పద్మావత్ చిత్రం విడుదల అయినప్పటికీ ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడివారిని అక్కడ నిర్బందంలోకి తీసుకుంటున్నా ఏ మాత్రం వారు వెనక్కి తగ్గడం లేదు. గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరగుతున్నాయి. మహిళలు కూడా పెద్ద మొత్తంలో ఈ ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. కొంతమంది కత్తులతో రోడ్లపై వీరంగం చేస్తున్నారు. మాల్స్‌పై కూడా దండయాత్రలు చేస్తున్నారు. Kshatriya community will contribute & give the person a reward of Rs 1 Crore who chops off Deepika Padukone's ears and nose: Gajendra Singh, President Kshatriya Mahasabha (24.1.2018) #Padmaavat pic.twitter.com/OP9R4EmaG1 — ANI UP (@ANINewsUP) 25 January 2018 -
కుల శౌర్యానికి పతాకం ఎత్తిన క్షత్రియ పుత్రుడు
‘లేపు... నీలోని మృగాన్ని నిద్రలేపు’ అంటాడు నాజర్. అతడి చేతిలో కొడవలి ఉంటుంది. ఎదురుగా కమలహాసన్ నిరాయుధుడిగా ఉంటాడు. ఇద్దరూ దాయాదులు. అన్నదమ్ముల బిడ్డలు. ఊళ్లో ఆధిపత్యం కోసం నాజర్ ప్రయత్నిస్తుంటాడు. పెదనాన్న కొడుకైన కమలహాసన్ దానికి అడ్డం. ఆ అడ్డాన్ని తొలగించుకోవాలి. అందుకే చేతిలో కొడవలి. ‘మృగాన్ని నిద్ర లేపరా’ అని మళ్లీ అంటాడు నాజర్. కమలహాసన్ ఇప్పుడు కత్తి పట్టుకోవాలి. పట్టుకోవాల్సిందే. ఎవరో ఒకరు మిగలాలి. ఎవరో ఒకరు. దేశంలో సహస్ర కులాలు ఉన్నాయి. కలి పురుషుడి శిరస్సు నుంచి కొన్ని కులాలు పుట్టాయట. వక్షం నుంచి కొన్నట. ఊరువుల నుంచి కొన్ని... పాదాల నుంచి కొన్ని... వీటిలో కొన్ని ఎక్కువ. కొన్ని తక్కువ. మనిషికి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడం ఇన్స్టింక్ట్. ఆ ఆధిక్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం ఇన్స్టింక్ట్. తమిళనాడు దక్షిణ జిల్లాలలో విరివిగా ఉండే దేవర్లు తమను తాము గొప్ప కులంగా క్షత్రియులుగా భావిస్తారు. మాటకు విలువివ్వడం, పరువు కోసం ఎంతకైనా తెగించడం వీరి నైజం. గ్రామాలలో కులమే ఒక ఉనికి అయినప్పుడు ఆ కులం ఆధారంగా పెత్తనం చెలాయించాలనుకున్నప్పుడు ఘర్షణలు తప్పవు. ఒకే కులంలోని ఒకే వంశంలో అధికారం అనువంశికం అయినప్పుడు దాయాది పోరు వస్తుంది. ఈ సినిమాలో ఊరి పెద్దగా, పెద్ద దేవర్‌గా శివాజీ గణేశన్ ఉంటాడు. ఆయన తమ్ముడు ఏనాడో అతడి నుంచి విడిపోయాడు. ఆస్తులు విడిపోయాయి. కాని పంతాలు పట్టింపులు ఉండిపోయాయి. శివాజీ గణేశన్ కొడుకు కమలహాసన్. తమ్ముడి కొడుకు నాజర్. ఈ రెండు కుటుంబాల కోసం ఊరు రెండుగా చీలిపోయి ఉంటుంది. ఇరు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పు. ఈ నిప్పు ఏ క్షణాన్నయినా ఊరిని దహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ నిప్పును అనుకోకుండా రాజేసినవాడు పెద్ద దేవర్ కొడుకు కమలహాసనే. కమలహాసన్ లండన్‌లో చదువుకున్నాడు. అక్కడే తనకు పరిచయమైన గౌతమిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుని పిజా, బర్గర్లు అమ్మే ఫుడ్ చెయిన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెటిల్ అవ్వాలనేది కోరిక. ఆ మాట చెప్పిపోదామనే గౌతమితో కలిసి ఊరికి వస్తాడు. అతడి దృష్టిలో అతడు భవిష్యత్తును వెతుక్కుంటున్న యువకుడు. కాని ఊరి దృష్టిలో అతడు చిన్న దేవర్. తండ్రి దృష్టిలో తన అధికారానికి వారసుడు. అల్లరి చిల్లరిగా వచ్చిన కమల హాసన్ తన ప్రియురాలి మెచ్చుకోలు కోసం ఇరువర్గాలు పంతాలతో తాళాలు వేసి ఉన్న ఊరి గుడి తలుపులను తెరిపిస్తాడు. దీని కోసమే కాచుకుని ఉన్న నాజర్ వర్గం ఎవడైతే తాళాలు తీయడంలో కమలహాసన్‌కు సాయం చేస్తాడో అతడి చేయి నరికేస్తారు. అందుకు బదులుగా కమలహాసన్ వర్గం ఆ వ్యక్తి ఇంటిని తగలబెడుతుంది. దానికి బదులుగా నాజర్ వర్గం చెరువు కట్ట తెగ్గొట్టి ఊళ్లో బీదా బిక్కి జనాల చావుకు కారణమవుతుంది. ఒక పది రోజుల వ్యవధిలోనే ఊరు రణరంగం అవుతుంది. ఏదో చూసి పోదామని వచ్చినవాడు కమలహాసన్ తండ్రి హఠాన్మరణంతో ఊరికి పెద్ద దిక్కుగా మారాల్సి వస్తుంది. బరి ఒక్కోసారి ఎంతటి ప్రమాదకరమైనదంటే ప్రేక్షకుణ్ణి కూడా తనలోకి లాగి పోటీదారుణ్ణి చేస్తుంది. ఇప్పుడు కమలహాసన్ పోటీదారు. నాజర్ అతడి ప్రత్యర్థి. ఆట నియమం ప్రకారం ఒకరే మిగలాలి. ఒక మృగం ఇంకో మృగం మెడ కొరకాల్సిందే. ఎవరా మృగం? ఊరి బాగు కోసం కమలహాసన్ తన ప్రేమను త్యాగం చేసి రేవతిని చేసుకుంటాడు. తన భవిష్యత్తును వదిలేసి తండ్రిలా ఊరికే అంకితమవుతాడు. నాజర్ వర్గంతో సర్దుబాటు కోసమే అనుక్షణం పాకులాడతాడు. మనం ఏమనుకుంటామంటే చెడ్డవాడు ఏదో ఒకరోజు మారతాడు అని. కాని ఎప్పటికీ మారని చెడ్డవాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే అది వారికి జన్మలక్షణం. నాజర్ అలాంటి వాడు. ఊరి మీద పెత్తనం కోసం తనకు పోటీ లేకుండా ఉండటం కోసం ఆఖరికి అతడు అమ్మవారి ఉత్సవంలో రథాన్నే పేల్చేందుకు తెగిస్తాడు. కథ క్లయిమాక్స్‌కు వస్తుంది. రాక్షస సంహారం జరిగే తీరాలి. ఊరి శివార్లలో గ్రామ శక్తి చేతిలోని గండ్ర కొడవలిని తీసుకొని నాజర్‌తో కలబడతాడు కమలహాసన్. లోహాలు ఖణేల్మంటాయి. సచ్చీలుని చేతిలోని ఆయుధమే గెలుస్తుంది. నాజర్ తల మెడ నుంచి బంతి ఎగిరినట్టు ఎగిరి విడివడుతుంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు.చేసిన నేరానికి కమలహాసన్ జైలుకు పోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా ప్రాథమిక మానవోద్వేగాల విశ్వరూపం చూపిస్తుంది. మొదట తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చూపుతుంది. శివాజీ గణేశన్, కమలహాసన్‌ల మధ్య అనుబంధానికి ప్రేక్షకుడు అనుసంధానమవుతాడు. కమలహాసన్, గౌతమిల మధ్య ప్రేమను చూపుతుంది. వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. కమలహాసన్, రేవతిల మధ్య పెళ్లి బంధానికి విలువ ఇస్తుంది. దీనిని ప్రేక్షకుడు గౌరవిస్తాడు. కమలహాసన్, నాజర్‌ల మధ్య పగను తీవ్రంగా చూపిస్తుంది. దీనికి ప్రేక్షకుడు స్పందిస్తాడు. దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కులం ఉంటుంది. దానికి ఏదో ఒక శౌర్యం ఉంటుంది. దానిని నిరూపించుకోవాలనుకునే భావోద్వేగం కూడా ప్రేక్షకులను సినిమాతో ఐడెంటిఫై చేసేలా చేస్తుంది. క్షత్రియ పుత్రుడులో కులం గెలిచింది. కాని అదే సర్వస్వం అనుకున్నప్పుడు మనిషి ఓడిపోతాడని హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఈ దేశంలో కులం ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది. దేవర్ మగన్ కమలహాసన్ నిర్మాతగా భరతన్ దర్శకత్వంలో 1992లో వచ్చిన గొప్ప ట్రెండ్ సెట్టర్ ‘దేవర్ మగన్’. తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. భారతీయ సినిమాలలో కులవర్గాల పోరును సమర్థంగా ప్రవేశపెట్టిన సినిమా ఇది. వేటకొడవళ్ల ఆనవాయితీని కూడా ఈ సినిమాయే ప్రవేశపెట్టింది. ఈ సినిమా నుంచి కనీసం ముప్పై నలభై సినిమాలు, కనీసం వంద సీన్లు పుట్టి ఉంటాయి. ఇది వచ్చిన మరో ఏడేళ్లకు ‘సమర సింహారెడ్డి’ వచ్చిందని మనం గుర్తు చేసుకోవాలి. ‘సీతారామరాజు’ నుంచి నిన్నమొన్నటి ‘దమ్ము’ వరకూ ఎన్నో సినిమాలకు క్షత్రియ పుత్రుడు మాతృక. ‘అతడు’లో కంచె నాటే సీను, ‘బాహుబలి’లో చేయి కురచగా ఉండే నాజర్ పాత్ర... ఇవన్నీ క్షత్రియ పుత్రుడు నుంచే వచ్చాయి. పక్షవాతం వచ్చిన వృద్ధ విలన్ ఉండటం ఈ సినిమాలో కొత్త. అది చూసి ‘చూడాలని ఉంది’, ‘అంతఃపురం’ సినిమాలలో కేరెక్టర్లు పుట్టించారు. తండ్రి వారసునిగా కమలహాసన్ తండ్రివలే గెటప్ మార్చుకునే ఇంటర్వెల్ బ్యాంగ్ గొప్ప ఇంటర్వెల్ బ్యాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. శివాజీ గణేశన్ ఇందులో సహజమైన గెటప్‌లో అద్భుతంగా నటించడం చూస్తాం. గౌతమికి ఈ సినిమాతో చాలా పేరు వచ్చింది. రేవతికి కూడా. ‘సన్నజాజి పడక’ పాటలో రేవతి నోటితో దరువు వేయడం ఆ పాత్ర అథెంటిసిటీని చూపి ఆకట్టుకుంటుంది. పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు ఒక ముతక గ్రామీణ శోభను తెచ్చాడు. తమిళంలో రెండొందల రోజులు ఆడిన ఈ సినిమా తెలుగువారికి కూడా అంతే ఇష్టమైంది. హిందీ రీమేక్ ‘విరాసత్’ కూడా పెద్ద హిట్టే. – కె -
2014లో తొలి సినిమా
కొత్త సంవత్సరానికి శ్రీకాంత్ శుభారంభం పలకబోతున్నారు. 2014 జనవరి 1న శ్రీకాంత్ హీరోగా నటించిన ‘క్షత్రియ’ చిత్రం విడుదల కాబోతోంది. నిధి అన్వేషణే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందింది. కుంకుమ్ కథానాయిక. కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జియేందర్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రివ్యూను హైదరాబాద్‌లో తిలకించిన శ్రీకాంత్... ప్రేక్షకులకు తప్పక నచ్చే సినిమా ఇదని నమ్మకం వ్యక్తం చేశారు. సస్పెన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజు తోట, సంగీతం: విశ్వ. -
‘క్షత్రియ’ సినిమా స్టిల్స్
శ్రీకాంత్, కుంకుమ్ జంటగా కె.ఉదయ చందు దర్శకత్వంలో వి.మహేందర్-మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘క్షత్రియ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌కు అందించారు. ఇందులో పాటలు ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సాగర్, భరద్వాజ్, వీరశంకర్, మల్టీ డెమైన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు. -
చాలా థ్రిల్లింగ్‌గా ఉంది - శ్రీకాంత్
‘‘ఈ కథ చాలా కొత్తగా అనిపించింది. అలాగే చాలా థ్రిల్లింగ్‌గా కూడా అనిపించింది. నేను ఇటువంటి థ్రిల్లర్ మూవీ చేయడం ఇదే తొలిసారి’’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్, కుంకుమ్ జంటగా కె.ఉదయ చందు దర్శకత్వంలో వి.మహేందర్-మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘క్షత్రియ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌కు అందించారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘శ్రీకాంత్ 110 సినిమాలు చేసినప్పటికీ తన మొదటి సినిమా సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అతను 200 సినిమాలు పూర్తి చేయాలి’’ అని అన్నారు. ఇందులో పాటలు ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సాగర్, వీరశంకర్, మల్టీ డెమైన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.