‘లేపు... నీలోని మృగాన్ని నిద్రలేపు’ అంటాడు నాజర్. అతడి చేతిలో కొడవలి ఉంటుంది. ఎదురుగా కమలహాసన్ నిరాయుధుడిగా ఉంటాడు. ఇద్దరూ దాయాదులు. అన్నదమ్ముల బిడ్డలు. ఊళ్లో ఆధిపత్యం కోసం నాజర్ ప్రయత్నిస్తుంటాడు. పెదనాన్న కొడుకైన కమలహాసన్ దానికి అడ్డం. ఆ అడ్డాన్ని తొలగించుకోవాలి. అందుకే చేతిలో కొడవలి. ‘మృగాన్ని నిద్ర లేపరా’ అని మళ్లీ అంటాడు నాజర్. కమలహాసన్ ఇప్పుడు కత్తి పట్టుకోవాలి. పట్టుకోవాల్సిందే. ఎవరో ఒకరు మిగలాలి. ఎవరో ఒకరు.
దేశంలో సహస్ర కులాలు ఉన్నాయి. కలి పురుషుడి శిరస్సు నుంచి కొన్ని కులాలు పుట్టాయట. వక్షం నుంచి కొన్నట. ఊరువుల నుంచి కొన్ని... పాదాల నుంచి కొన్ని... వీటిలో కొన్ని ఎక్కువ. కొన్ని తక్కువ. మనిషికి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవడం ఇన్‌స్టింక్ట్. ఆ ఆధిక్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం ఇన్‌స్టింక్ట్. తమిళనాడు దక్షిణ జిల్లాలలో విరివిగా ఉండే దేవర్‌లు తమను తాము గొప్ప కులంగా క్షత్రియులుగా భావిస్తారు. మాటకు విలువివ్వడం, పరువు కోసం ఎంతకైనా తెగించడం వీరి నైజం. గ్రామాలలో కులమే ఒక ఉనికి అయినప్పుడు ఆ కులం ఆధారంగా పెత్తనం చెలాయించాలనుకున్నప్పుడు ఘర్షణలు తప్పవు. ఒకే కులంలోని ఒకే వంశంలో అధికారం అనువంశికం అయినప్పుడు దాయాది పోరు వస్తుంది. ఈ సినిమాలో ఊరి పెద్దగా, పెద్ద దేవర్‌గా శివాజీ గణేశన్ ఉంటాడు. ఆయన తమ్ముడు ఏనాడో అతడి నుంచి విడిపోయాడు. ఆస్తులు విడిపోయాయి. కాని పంతాలు పట్టింపులు ఉండిపోయాయి. శివాజీ గణేశన్ కొడుకు కమలహాసన్. తమ్ముడి కొడుకు నాజర్. ఈ రెండు కుటుంబాల కోసం ఊరు రెండుగా చీలిపోయి ఉంటుంది. ఇరు వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పు. ఈ నిప్పు ఏ క్షణాన్నయినా ఊరిని దహించడానికి సిద్ధంగా ఉంటుంది.
ఆ నిప్పును అనుకోకుండా రాజేసినవాడు పెద్ద దేవర్ కొడుకు కమలహాసనే.
కమలహాసన్ లండన్‌లో చదువుకున్నాడు. అక్కడే తనకు పరిచయమైన గౌతమిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుని పిజా, బర్గర్‌లు అమ్మే ఫుడ్ చెయిన్స్ ఎస్టాబ్లిష్ చేసి సెటిల్ అవ్వాలనేది కోరిక. ఆ మాట చెప్పిపోదామనే గౌతమితో కలిసి ఊరికి వస్తాడు. అతడి దృష్టిలో అతడు భవిష్యత్తును వెతుక్కుంటున్న యువకుడు. కాని ఊరి దృష్టిలో అతడు చిన్న దేవర్. తండ్రి దృష్టిలో తన అధికారానికి వారసుడు. అల్లరి చిల్లరిగా వచ్చిన కమల హాసన్ తన ప్రియురాలి మెచ్చుకోలు కోసం ఇరువర్గాలు పంతాలతో తాళాలు వేసి ఉన్న ఊరి గుడి తలుపులను తెరిపిస్తాడు. దీని కోసమే కాచుకుని ఉన్న నాజర్ వర్గం ఎవడైతే తాళాలు తీయడంలో కమలహాసన్‌కు సాయం చేస్తాడో అతడి చేయి నరికేస్తారు. అందుకు బదులుగా కమలహాసన్ వర్గం ఆ వ్యక్తి ఇంటిని తగలబెడుతుంది. దానికి బదులుగా నాజర్ వర్గం చెరువు కట్ట తెగ్గొట్టి ఊళ్లో బీదా బిక్కి జనాల చావుకు కారణమవుతుంది. ఒక పది రోజుల వ్యవధిలోనే ఊరు రణరంగం అవుతుంది. ఏదో చూసి పోదామని వచ్చినవాడు కమలహాసన్ తండ్రి హఠాన్మరణంతో ఊరికి పెద్ద దిక్కుగా మారాల్సి వస్తుంది. బరి ఒక్కోసారి ఎంతటి ప్రమాదకరమైనదంటే ప్రేక్షకుణ్ణి కూడా తనలోకి లాగి పోటీదారుణ్ణి చేస్తుంది. ఇప్పుడు కమలహాసన్ పోటీదారు. నాజర్ అతడి ప్రత్యర్థి. ఆట నియమం ప్రకారం ఒకరే మిగలాలి. ఒక మృగం ఇంకో మృగం మెడ కొరకాల్సిందే. ఎవరా మృగం?
ఊరి బాగు కోసం కమలహాసన్ తన ప్రేమను త్యాగం చేసి రేవతిని చేసుకుంటాడు. తన భవిష్యత్తును వదిలేసి తండ్రిలా ఊరికే అంకితమవుతాడు. నాజర్ వర్గంతో సర్దుబాటు కోసమే అనుక్షణం పాకులాడతాడు. మనం ఏమనుకుంటామంటే చెడ్డవాడు ఏదో ఒకరోజు మారతాడు అని. కాని ఎప్పటికీ మారని చెడ్డవాళ్లు కూడా ఉంటారు. ఎందుకంటే అది వారికి జన్మలక్షణం. నాజర్ అలాంటి వాడు. ఊరి మీద పెత్తనం కోసం తనకు పోటీ లేకుండా ఉండటం కోసం ఆఖరికి అతడు అమ్మవారి ఉత్సవంలో రథాన్నే పేల్చేందుకు తెగిస్తాడు. కథ క్లయిమాక్స్‌కు వస్తుంది. రాక్షస సంహారం జరిగే తీరాలి. ఊరి శివార్లలో గ్రామ శక్తి చేతిలోని గండ్ర కొడవలిని తీసుకొని నాజర్‌తో కలబడతాడు కమలహాసన్. లోహాలు ఖణేల్‌మంటాయి. సచ్చీలుని చేతిలోని ఆయుధమే గెలుస్తుంది. నాజర్ తల మెడ నుంచి బంతి ఎగిరినట్టు ఎగిరి విడివడుతుంది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు.చేసిన నేరానికి కమలహాసన్ జైలుకు పోవడంతో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా ప్రాథమిక మానవోద్వేగాల విశ్వరూపం చూపిస్తుంది. మొదట తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం చూపుతుంది. శివాజీ గణేశన్, కమలహాసన్‌ల మధ్య అనుబంధానికి ప్రేక్షకుడు అనుసంధానమవుతాడు. కమలహాసన్, గౌతమిల మధ్య ప్రేమను చూపుతుంది. వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. కమలహాసన్, రేవతిల మధ్య పెళ్లి బంధానికి విలువ ఇస్తుంది. దీనిని ప్రేక్షకుడు గౌరవిస్తాడు. కమలహాసన్, నాజర్‌ల మధ్య పగను తీవ్రంగా చూపిస్తుంది. దీనికి ప్రేక్షకుడు స్పందిస్తాడు. దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కులం ఉంటుంది. దానికి ఏదో ఒక శౌర్యం ఉంటుంది. దానిని నిరూపించుకోవాలనుకునే భావోద్వేగం కూడా ప్రేక్షకులను సినిమాతో ఐడెంటిఫై చేసేలా చేస్తుంది. క్షత్రియ పుత్రుడులో కులం గెలిచింది. కాని అదే సర్వస్వం అనుకున్నప్పుడు మనిషి ఓడిపోతాడని హెచ్చరించింది. ఈ హెచ్చరిక ఈ దేశంలో కులం ఉన్నంత కాలం ఉంటూనే ఉంటుంది.
దేవర్ మగన్
కమలహాసన్ నిర్మాతగా భరతన్ దర్శకత్వంలో 1992లో వచ్చిన గొప్ప ట్రెండ్ సెట్టర్ ‘దేవర్ మగన్’. తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’గా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. భారతీయ సినిమాలలో కులవర్గాల పోరును సమర్థంగా ప్రవేశపెట్టిన సినిమా ఇది. వేటకొడవళ్ల ఆనవాయితీని కూడా ఈ సినిమాయే ప్రవేశపెట్టింది. ఈ సినిమా నుంచి కనీసం ముప్పై నలభై సినిమాలు, కనీసం వంద సీన్లు పుట్టి ఉంటాయి. ఇది వచ్చిన మరో ఏడేళ్లకు ‘సమర సింహారెడ్డి’ వచ్చిందని మనం గుర్తు చేసుకోవాలి. ‘సీతారామరాజు’ నుంచి నిన్నమొన్నటి ‘దమ్ము’ వరకూ ఎన్నో సినిమాలకు క్షత్రియ పుత్రుడు మాతృక. ‘అతడు’లో కంచె నాటే సీను, ‘బాహుబలి’లో చేయి కురచగా ఉండే నాజర్ పాత్ర... ఇవన్నీ క్షత్రియ పుత్రుడు నుంచే వచ్చాయి. పక్షవాతం వచ్చిన వృద్ధ విలన్ ఉండటం ఈ సినిమాలో కొత్త. అది చూసి ‘చూడాలని ఉంది’, ‘అంతఃపురం’ సినిమాలలో కేరెక్టర్లు పుట్టించారు. తండ్రి వారసునిగా కమలహాసన్ తండ్రివలే గెటప్ మార్చుకునే ఇంటర్‌వెల్ బ్యాంగ్ గొప్ప ఇంటర్‌వెల్ బ్యాంగ్స్‌లో ఒకటిగా నిలిచింది. శివాజీ గణేశన్ ఇందులో సహజమైన గెటప్‌లో అద్భుతంగా నటించడం చూస్తాం. గౌతమికి ఈ సినిమాతో చాలా పేరు వచ్చింది. రేవతికి కూడా. ‘సన్నజాజి పడక’ పాటలో రేవతి నోటితో దరువు వేయడం ఆ పాత్ర అథెంటిసిటీని చూపి ఆకట్టుకుంటుంది. పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు ఒక ముతక గ్రామీణ శోభను తెచ్చాడు. తమిళంలో రెండొందల రోజులు ఆడిన ఈ సినిమా తెలుగువారికి కూడా అంతే ఇష్టమైంది. హిందీ రీమేక్ ‘విరాసత్’ కూడా పెద్ద హిట్టే.
– కె
Comments
Please login to add a commentAdd a comment