List Of 7 Upcoming Hero And Director Combination Repeated Movies, Deets Inside - Sakshi
Sakshi News home page

కథ మళ్లీ కలిపింది

Published Sat, Jun 17 2023 4:24 AM

Hero-Director Combination Repeated movies - Sakshi

ఒక హీరో–ఒక డైరెక్టర్‌ ఒక హిట్‌ సినిమా ఇస్తే.. వారిది ‘హిట్‌ కాంబో’ అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్‌లో రెండో సినిమా రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటారు. తమ కాంబో రిపీట్‌ అవ్వాలని హీరో–డైరెక్టర్‌కి కూడా ఉంటుంది. కానీ కథ కుదరాలి. అలా కొందరు హీరో–దర్శకులను మళ్లీ కథ కలిపింది. రెండోసారి రిపీట్‌ అవుతున్న ఆ కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం.

దశాబ్దాల తర్వాత
హీరోగా కమల్‌హాసన్, దర్శకుడిగా మణి రత్నంలది ఇండస్ట్రీలో సుధీర్ఘ ప్రయాణం. కానీ కమల్‌హాసన్, మణిరత్నంల కాంబినేషన్‌లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రం ఒక్కటే. అదే ‘నాయకన్‌’ (తెలుగులో ‘నాయకుడు’–1987). అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఇంతటి బ్లాక్‌బాస్టర్‌ సక్సెస్‌ అందుకున్నప్పటికీ కమల్, మణిరత్నంల కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు.

ముప్పైఐదేళ్ల తర్వాత ఇప్పుడు కమల్, మణిరత్నంల కాంబో రిపీట్‌ కానుంది. మరోవైపు దర్శకుడు శంకర్‌తో ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ సినిమా చేస్తున్నారు కమల్‌హాసన్‌. శంకర్, కమల్‌ కాంబోలోనే 1996లో రిలీజైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌ ఇది. సో.. కమల్‌–శంకర్‌ కాంబో మళ్లీ సెట్‌ అవ్వడానికి పాతికేళ్లు పైనే పట్టింది అన్నమాట.
 
దేవర
ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఉన్న సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘జనతా గ్యారేజ్‌’ ఒకటి. క్లాస్‌ టచ్‌తో మాస్‌ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. విస్మరణకు గురైన భారతదేశ తీర ప్రాంతవాసుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ‘దేవర’ విడుదల కానుంది.

డబుల్‌ ఇస్మార్ట్‌
హీరో రామ్‌లోని పవర్‌ఫుల్‌ మాస్‌ యాంగిల్‌ని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019)లో వెండితెరపైకి తెచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఈ చిత్రం ఇటు రామ్, అటు పూరి జగన్నాథ్‌ కెరీర్‌లకు ఆ సమయంలో బాగా బూస్టప్‌ ఇచ్చింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చేయనున్నారు రామ్‌ అండ్‌ పూరి. వచ్చే ఏడాది మార్చి 8న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

ఫ్యామిలీ స్టార్‌
‘గీత గోవిందం’ (2018)తో రూ. వంద కోట్ల క్లబ్‌లో చేరారు హీరో విజయ్‌ దేవరకొండ.   ఈ సినిమాకు పరశురామ్‌ దర్శకుడు. ఐదేళ్ల తర్వాత విజయ్, పరశురామ్‌ కాంబోలో సెకండ్‌ ఫిల్మ్‌గా రూపొందనున్న సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. కాగా ఈ చిత్రానికి ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘కుటుంబరావు’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం.  

అడ్వంచరస్‌ డ్రామా
రెండున్నరేళ్ల క్రితం కోవిడ్‌ సమయంలో విడుదలైన ‘భీష్మ’ చిత్రాన్ని ఆడియన్స్‌ ఆదరించారు. నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పుడు నితిన్‌–వెంకీ కుడుమల రెండోసారి మరో ఫిల్మ్‌ చేస్తున్నారు. ‘భీష్మ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రంలో కూడా హీరోయిన్‌ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ఇటీవల మొదలయ్యాయి. అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

రాక్షస రాజు
‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) చిత్రంలో జోగేంద్ర పాత్రలో హీరో రానా కాస్త నెగటివ్‌ షేడ్స్‌లో మెప్పించారు. అలాంటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తేజ. అయితే రానా, తేజ కాంబోలో మరో సినిమా కన్ఫార్మ్‌ కావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. రానా, తేజ కాంబినేషన్‌లోని సెకండ్‌ ఫిల్మ్‌  ‘రాక్షస రాజు’ (వర్కింగ్‌ టైటిల్‌) షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

భైరవ కోనలో...
‘టైగర్‌’ (2015) చిత్రం కోసం తొలిసారి చేతులు కలిపారు హీరో సందీప్‌ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఊరిపేరు భైరవకోన’. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
 
వీరే కాదు.. మరికొందరు హీరోలు, దర్శకులు తమ కాంబోలో రెండో సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement