అభివృద్ధిలో రాజులంతా భాగస్వాములు కండి
క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
రాజులు ఆరంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం
హైదరాబాద్‌లో క్షత్రియ భవన్‌కు స్థలం కేటాయిస్తాం
క్షత్రియులకు మొదట పార్టీ పదవులు.. తర్వాత టికెట్లు ఇస్తామని హామీ
గచ్చిబౌలి: తెలంగాణ అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వామ్యం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ‘ఫ్యూచర్‌సిటీ’లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలుగా ఉందని.. కొత్తగా అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్‌సిటీ నిర్మించనున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవాసమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ శివార్లలో 1960లోనే చిన్న గ్రామంగా ఉండే కొంపల్లి ప్రాంతానికి క్షత్రియులు వలస వచ్చి, పెట్టుబడులు పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫార్మా, వైద్య, విద్య, మీడియా రంగాల్లో రాజులు పెట్టుబడులు పెట్టి విజయం సాధించారన్నారు. సినీ రంగంలో కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేమని, బాహుబలి ప్రభాస్ కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో గర్వించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా రాంగోపాల్‌వర్మ ఎంతో ఎదిగారని చెప్పారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీకి జీవం పోస్తాం
తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాజులే ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నూతన విధానానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తోందన్నారు.
క్షత్రియ భవన్‌కు స్థలం ఇస్తాం
హైదరాబాద్‌లో క్షత్రియ భవన్ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో రాజుల దర్పం కనిపించేలా దివ్యమైన భవన నిర్మాణ బాధ్యత క్షత్రియ సమితి తీసుకోవాలన్నారు.
క్షత్రియులకు అండగా ఉంటామని, రాజకీయంగా ఎదిగేలా ముందు పార్టీ లో పదవులు ఇచ్చి, అనంతరం పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పా రు. పార్టీలో చేరితే నాలుగేళ్లలో నాయకులుగా మార్చి, తర్వా త ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా ప్రొత్సహిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు క్రియాశీల పాత్ర పోషించారని ప్రశంసించారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: శ్రీనివాస వర్మ
రాష్ట్ర విభజన సమయంలో తన్ని తరిమేస్తామన్నా ఎక్కడికీ వెళ్లబోమని క్షత్రియులు చెప్పారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. గోదావరి, వైజా గ్, చిత్తూరు జిల్లాల క్షత్రియులు అక్కడి పొలాలను అమ్ము కుని వచ్చి.. ఇక్కడ భూములు కొన్నారని, పరిశ్రమలు నెలకొల్పారని గుర్తు చేశారు. కష్టాన్ని నమ్ముకున్న క్షత్రియులు తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
హైదరాబాద్ క్షత్రియుల కర్మ భూమి అని.. ఇక్కడికి వచ్చిన క్షత్రియులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అభివృద్ధిలో సహకారం అందించాలని క్షత్రియులకు పిలుపునిచ్చారు. కాగా.. క్షత్రియులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, క్షత్రియభవన్‌కు స్థలం ఇవ్వాలని, పేద క్షత్రియులకు రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment