బీజింగ్ : హోటల్‌కెళ్లి సుష్టుగా భోంచేయడం.. ఆపై బిల్లు ఎగ్గొట్టడం కోసం ప్లేట్‌లో వెంట్రుకలు, బొద్దింకలు లాంటివి వేయడం చాలా సినిమాల్లో చూశాం కదా. ఇదే ట్రిక్కు ప్రయోగించబోయి.. ఆఖరుకి జైలు పాలయ్యడో వ్యక్తి. బిల్లు ఎగ్గొట్టడం కోసం ఏకంగా భోజనంలో చచ్చిన ఎలుకను వేశాడు. ఆ తర్వాత ఏమైంది... చదవండి. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదిలావో అనేది చైనాలో చాలా ఫేమస్ రెస్టారెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ వ్యక్తి సదరు రెస్టారెంట్‌లో ఉచితంగా భోజనం చేయాలని భావించాడు. ఎలా అని ఆలోచిస్తుండగా రోడ్డు పక్కన ఓ చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో అతడి బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది.
ఆ ఎలుకను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేశాడు. తినడం పూర్తయిన తరువాత తనతో పాటు తీసుకువచ్చిన ఎలుకను ప్లేట్‌లో వేశాడు. ఆ తర్వాత తనకు భోజనంలో ఎలుక వచ్చిందని చెప్పి నానా హంగామా సృష్టించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెస్టారెంట్‌కున్న పేరు పొతుందని భావించిన యాజమాన్యం.. సదరు వ్యక్తి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ అందుకతడు ఒప్పుకోలేదు. దాంతో ఓ రెండు లక్షల రూపాయలు ఇస్తామంది. ఆ వ్యక్తి దాన్ని కూడా తిరస్కరించి.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు.
ఈ వివాదం ఎటు తేలకపోవడంతో.. సదరు రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉచితంగా భోజనం చేయాలని భావించి.. చచ్చిన ఎలుకను తెచ్చి ఈ నాటకం ఆడానని.. కానీ చివర్లో అత్యాశకు పోవడంతో దొరికిపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment