బజార్‌ఘాట్‌లోని నిలోఫర్ కేఫ్ అందరికీ తెలిసిందే. అయితే కేఫ్ యజమాని అనుముల బాబురావు సేవా దృక్పథం కొంతమందికే తెలుసు. ఎంతో కష్టపడి హోటల్‌లో క్లీనర్ నుంచి ఓనర్‌గా ఎదిగిన బాబురావు.. తనవంతుగా సమాజానికి సేవ చేయాలని సంకల్పించాడు. ప్రతిరోజూ 800 మందికి ఉచితంగా భోజనం అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
బాబురావు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా దేగ్గం మండలం లగ్గాలా గ్రామం. మహారాష్ట్రలోని పెద్దనాన్న కిరాణా దుకాణంలో పనిచేస్తూ చదువుకున్నాడు. పదో తరగతిలో పుస్తకాలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తండ్రి పాడి ఆవును విక్రయించి రూ.125 ఇచ్చాడు. అది చూసి బాబురావు ఎంతో చలించిపోయాడు. ఆర్థిక పరిస్థితిని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు. మొదట ఓ బట్టల షాప్‌లో పనిచేశాడు. తర్వాత కింగ్‌కోఠిలోని రాక్ సీ హోటల్‌లో క్లీనర్‌గా చేరాడు. అక్కడి నుంచి నిలోఫర్‌కు వచ్చాడు. బాబురావు పనితనాన్ని మెచ్చిన హోటల్ యజమాని టీ మాస్టర్‌గా, మేనేజర్‌గా ప్రమోట్ చేశాడు. 1993లో ఏకంగా అదే హోటల్‌ను అద్దెకు తీసుకున్న బాబురావు... తర్వాత దాన్ని కొనుగోలు చేశాడు. బాబురావు చక్కటి టీ మాస్టర్.. ఆయన టీకి అందరూ ఫిదా అవ్వాల్సిందే.
కష్టాలు కదిలించాయి...
నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులకు వచ్చే వారి కష్టాలు బాబురావును కదిలించాయి. వారికి తనవంతుగా సేవ చేయాలన్న ఆలోచనతో ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశాడు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ ఉచిత భోజనం నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 500 మందికి టిఫిన్, మధ్యాహ్నం 300 మందికి ఉచితంగా భోజనం అందజేస్తున్నాడు. ఇందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి జీతాలు ఇస్తున్నాడు. క్యాన్స్‌ర్ చికిత్స పొందుతూ ఎవరైనా మృతి చెందితే స్వగ్రామానికి తరలించేందుకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాడు బాబురావు.
సిబ్బందికి గుర్తింపు...
కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపునిస్తారు బాబురావు. ఆయన దగ్గర ఒక్కొక్కరు 15–20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. సిబ్బంది అందరికీ వంటల తయారీలో ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. టీ, బిస్కెట్స్, కేక్‌లు, కేఫ్‌లో అందించే ప్రత్యేక రుచుల తయారీ గురించి నేర్పిస్తారు. ప్రావీణ్యమున్న వారికి పదోన్నతులు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడి విధానంపై ఆసక్తితో యశోద ఫౌండేషన్ 20 మందికి శిక్షణనిచ్చే బాధ్యతను బాబురావుకు అప్పగించింది.
భవిష్యత్తులో ఆస్పత్రి..
వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తూ నమ్మకంగా పనిచేసినప్పుడే విజయం వరిస్తుంది. మేం తక్కువ ధరలోనే నాణ్యమైన టీ, బిస్కెట్స్ అందిస్తాం. కేఫ్ నిలోఫర్ ఉస్మానియా బిస్కెట్లు నగరంలోని 36 షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతోనే పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో ఓ ఆస్పత్రి నిర్మించాలని అనుకుంటున్నాను.
– అనుముల బాబురావు
Comments
Please login to add a commentAdd a comment