బ్రాహ్మణులకు ‘నారాయణ ప్రసాదం’
కర్నూలు(అర్బన్): బ్రాహ్మణులు మృతి చెందితే వారి కుటుంబాలకు నారాయణ ప్రసాద పథకం ద్వారా ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. శనివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, నెయ్యి తదితర వస్తువులను అందించాలనుకునే వారు సంకల్‌బాగ్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని నగర సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ను సంప్రదించాలన్నారు. ఈ దేవాలయంలోని వనానికి నారాయణవనం అని పేరు పెట్టామన్నారు. ఎండోమెంట్‌తో సంబంధం లేకుండా అర్చకులు, పురోహితుల ఉపనయనాలకు రూ.25 వేలు, చంద్రశేఖర్ పథకం ద్వారా వధూవరులకు రూ.1 లక్ష అందిస్తామన్నారు. త్వరలోనే కర్నూలు నగరంలో బ్రాహ్మణులు అపకర్మలు చేసుకునేందుకు భవనంతో పాటు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ వసతి, వేద పాఠశాల, వృద్ధాశ్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి హెచ్‌కే మనోహర్‌రావు, నగర అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్, సీవీ దుర్గాప్రసాద్, శ్యాంసుందరశర్మ, హెచ్‌కే రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.