government hostel
-
మమ్మల్ని హింసిస్తున్నారు.. ఇంటికి పంపించేయండి
ఆరిలోవ: జాతీయ రహదారిని ఆనుకుని విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించారు. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్ పర్యవేక్షణాధికారి ఎ.వి. సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. విషయం తెలుసుకున్న రూరల్ తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు. దీంతో.. వారిని ఏయే జిల్లాల సీడబ్ల్యూసీల నుంచి తీసుకొచ్చారో.. వారితో సంప్రదించి ఆయా జిల్లాలకు తీసుకెళ్లిపోవాలని అధికారులు కోరారు. బాలికల తల్లిదండ్రులకు ఫోన్‌చేసి, వారిని ఇళ్లకు తీసుకుపోవాలని సూచించారు. దీంతో బాలికలు శాంతించారు. అనంతరం ఉమెన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ జయదేవి వసతిగృహానికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. మమ్మల్ని ఇంటికి పంపించేయండి.. తమకు మైనార్టీ తీరిపోయినా బయటకు పంపడంలేదని.. వసతిగృహంలో కుమారి అనే సహాయకురాలు తమను ఇబ్బంది పెడుతున్నట్లు బాలికలు వాపోయారు. తమను మానసిక రోగులుగా చిత్రీకరించి, నిద్రమాత్రలు ఇస్తున్నారని ఆరోపించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని కోరారు. దీనిపై గృహం సూపరింటెండెంట్ సునీత మాట్లాడుతూ.. బాలికలందర్నీ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలిపారు. మైనారిటీ తీరిన తర్వాత కూడా సీడబ్ల్యూసీ అనుమతితోనే బయటికి పంపిస్తామని, తమకు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు. ఐదుగురిలో నలుగురు బాలికలకు కొద్దిరోజులుగా మెంటల్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ఫోన్‌చేశామని, వారొస్తే బాలికలను అప్పగిస్తామని వెల్లడించారు. మరోవైపు.. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, సీపీని కోరారు. -
‘ఆరోగ్య కిట్ బకాయిలు ఎందుకు చెల్లించలేదు?’
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణకు సంబంధించి దాఖలైన కేసులో పాఠశాల విద్యాశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. బకాయి పడిన నిధులు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని, నిధులు చెల్లింపునకు కేసు విచారణ అడ్డంకికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వహాస్టళ్లకు ఆరోగ్యకిట్లు పంపిణీ చేసినా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో మాయార్న్ అండ్ ఫైబర్స్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి 9% వడ్డీతో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఆ వడ్డీని 6 శాతానికి తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. మూడు వారాల్లో చెల్లించాలని ఆదేశిస్తూ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. అయితే 2 నెలలు కావొస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో సదరు సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. -
వణుకుతున్న ‘వసతి’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అదో ప్రభుత్వ హాస్టల్.. రాత్రి పది గంటలవుతోంది.. ఎముకలు కొరికే చలి.. కటిక నేలపై పిల్లలంతా పడుకున్నారు.. చలికి గజగజ వణికిపోతున్నారు.. కప్పుకునేందుకు దుప్పట్లు లేవు.. పల్చటి రగ్గులున్నా అవి చలిని కాయడం లేదు.. వారు నిద్రిస్తున్న గదికి తలుపులు లేవు.. కిటికీలకు రెక్కలూ లేవు!! ఇది ఏదో ఒక హాస్టల్‌కు పరిమితమైన సమస్య కాదు.. రాష్ట్రంలోని చాలా హాస్టళ్లలో ఇలాంటి దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. చలి తీవ్రమైనా చాలాచోట్ల నేటికీ దుప్పట్లు పంపిణీ చేయలేదు. అక్కడక్కడ ఇచ్చినా పలు చటి దుప్పట్లు ఇవ్వడంతో అవి చలిని తట్టుకోవడం లేదు. దీంతో ఇద్దరు, ముగ్గురు పిల్లలు వాటిని జోడించి ఒకే దుప్పటిగా మార్చి కప్పుకుంటున్నారు. కాలేజీ పిల్లల హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి. చాలాచోట్ల కిటికీ తలుపులు లేకపోవడంతో చలిని తట్టుకునేందుకు వాటికి టవల్స్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల పిల్లల కోసం కోట్లు ఖర్చు చేస్తూ వసతి గృహాలను నిర్వహిస్తోంది. అయితే వీటి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సరైన పర్యవేక్షణ లేని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుస్తులు, ట్రంకు పెట్టెలు, టూత్‌పేస్టు, టూత్‌బ్రష్‌లు, సబ్బులు, నూనె తదితర కాస్మోటిక్స్ సరిగా సరఫరా కావడం లేదు. పాత పుస్తకాలనే తిరగేస్తూ లెక్కలు రాస్తుండటంతో పిల్లలకు దుప్పట్లు ఉంటే బెడ్షీట్లు, బెడ్షీట్లు ఉంటే దుప్పట్లు అందడం లేదు. ఈ నెల 15 నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 12 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.8 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 10 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వసతి గృహాల్లో విద్యార్థులు వణికిపోతున్నారు. ఇంటి నుంచి దుప్పటి తెచ్చుకున్నా.. హాస్టల్లో ఇప్పటి వరకు దుప్పటి రాలేదు. చలి బాగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్లో అన్నీ ఇస్తామని చెప్పి చేర్పించారు. ఇక్కడ మాత్రం ఏమీ ఇవ్వటం లేదు. – ఎం.మణికంఠ, ఎస్సీ హాస్టల్ విద్యార్థి, 6వ తరగతి, కల్లూరు, ఖమ్మం జిల్లా పాత దుప్పట్లతోనే.. ఐదేళ్లుగా హాస్టల్లో ఉంటున్నా.. ఏటా దుప్పట్లు జూన్‌లోనే ఇచ్చేవాళ్లు. ఈ సంవత్సరం దుప్పట్లు, యూనిఫాం రాలేదు. చెçప్పులు కూడా ఇవ్వలేదు. పాత దుప్పట్లనే కప్పుకుంటున్నాం. అవికూడా చిరిగి పోయాయి. – ఎం.సాయి, ఎస్సీ హాస్టల్ విద్యార్ధి, 10వ తరగతి, మిట్టపల్లి ఇంటి నుంచి చద్దర్లు తెచ్చుకున్న.. ఈ సంవత్సరమే హాస్టల్లో కొత్తగా చేరాను. చలి ఎక్కువగా ఉంది. హాస్టల్లో దుప్పట్లు ఇవ్వకపోవడంతో పది రోజుల కిందట ఇంటి నుంచి మూడు చద్దర్లు తెచ్చుకున్నా. ప్రభుత్వం వెంటనే దుప్పట్లు ఇస్తే అందరికీ మంచిగుంటది. – కొత్తూరి రమేశ్, 8వ తరగతి, దుర్శేడ్, కరీంనగర్ జిల్లా ఇంకా ఇవ్వలేదు కొత్తగా హాస్టల్‌కు వచ్చిన. ఇంకా నాకు దుప్పట్లు.. బెడ్ షీట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్నవి వాడుకుంటున్నాం. రూంల కిటికీలు దెబ్బతిన్నయ్.. వాటి నుంచి చలి వస్తుంది. – నీలేష్, ఏడో తరగతి, కోరుట్ల, సోషల్వెల్ఫేర్ హాస్టల్ -
ఎనీ టైం..
కాట్రేనికోన : విద్యార్థుల సంఖ్య 50లోపు ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను తొలగించి, వాటిలో ఉన్న విద్యార్థులను గురుకుల పాఠశాలలకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందనే సాకుతో ప్రభుత్వం గతేడాది 24 వసతి గృహాలను తొలగించి మూసివేసింది. దీంతో జిల్లాలో 94 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు మాత్రమే మిగిలాయి. 2016-17 విద్యాసంవత్సరంలో 50లోపు విద్యార్థులున్న 22 ఎస్సీ, 15 బీసీ వసతి గృహాలను తొలగించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. నియోజకవర్గంలో కాట్రేనికోన, కందికుప్ప ఎస్సీ వసతి గృహాలు, ముమ్మిడివరం ఎస్సీ బాలుర, తాళ్లరేవు బీసీ వసతి గృహాలు తొలగించే జాబితాలో ఉన్నాయని సమాచారం. అయితే తొలగించబోయే వసతి గృహ విద్యార్థులకు సరిపడా సీట్లు గురుకుల పాఠశాలలో లేకపోవడం, ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు అందకపోవడంతో వసతి గృహ సంక్షేమ అధికారులు తర్జనభర్జన పడు తున్నారు. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థుల అడ్మిషన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు అందక సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వసతి గృహాలను రక్షించుకునేందుకు నూరుశాతం అడ్మిషన్ల కోసం వసతి గృహ అధికారులు పరుగులు తీస్తున్నారు. తొలగిస్తే సహించేది లేదు వసతి గృహాలను మండల కేంద్రాల నుంచి తొలగిస్తే సహించేది లేదని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణిని వివరణ కోరగా.. ‘‘ప్రభుత్వం నుంచి ఈ ఏడాదికి ఏవిధమైన ఆదేశాలు లేవు. విద్యార్థుల సంఖ్య ఉన్న వసతి గృహాల ప్రపోజల్స్ పంపించాం. రెసిడెన్సీ స్కూల్స్‌లో అంత వేకెన్సీ లేదని చెప్పారు. దీనిపై ప్రస్తుతానికి అడగలేదు. నూరు శాతం విద్యార్థులను చేర్పిస్తే తొలగింపు ఉండక పోవచ్చు. నూరు శాతం అడ్మిషన్లు చేయాలని వసతి గృహ అధికారులకు ఆదేశించాం’’ అని అన్నారు. -
ఆహారం వికటించి విద్యార్థులకు అస్వస్థత
లక్సెట్టిపేట మండలకేంద్రంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నాం భోజనం వికటించడంతో వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో హుటాహుటిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.