సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణకు సంబంధించి దాఖలైన కేసులో పాఠశాల విద్యాశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. బకాయి పడిన నిధులు ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని, నిధులు చెల్లింపునకు కేసు విచారణ అడ్డంకికాదని స్పష్టం చేసింది. ప్రభుత్వహాస్టళ్లకు ఆరోగ్యకిట్లు పంపిణీ చేసినా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో మాయార్న్ అండ్ ఫైబర్స్ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి 9% వడ్డీతో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. ఈ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది. విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఆ వడ్డీని 6 శాతానికి తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది. మూడు వారాల్లో చెల్లించాలని ఆదేశిస్తూ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. అయితే 2 నెలలు కావొస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో సదరు సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment