జగిత్యాల జిల్లా సారంగాపూర్ హాస్టల్‌లో దుప్పట్లు లేకుండానే పడుకున్న విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అదో ప్రభుత్వ హాస్టల్.. రాత్రి పది గంటలవుతోంది.. ఎముకలు కొరికే చలి.. కటిక నేలపై పిల్లలంతా పడుకున్నారు.. చలికి గజగజ వణికిపోతున్నారు.. కప్పుకునేందుకు దుప్పట్లు లేవు.. పల్చటి రగ్గులున్నా అవి చలిని కాయడం లేదు.. వారు నిద్రిస్తున్న గదికి తలుపులు లేవు.. కిటికీలకు రెక్కలూ లేవు!!
ఇది ఏదో ఒక హాస్టల్‌కు పరిమితమైన సమస్య కాదు.. రాష్ట్రంలోని చాలా హాస్టళ్లలో ఇలాంటి దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. చలి తీవ్రమైనా చాలాచోట్ల నేటికీ దుప్పట్లు పంపిణీ చేయలేదు. అక్కడక్కడ ఇచ్చినా పలు చటి దుప్పట్లు ఇవ్వడంతో అవి చలిని తట్టుకోవడం లేదు. దీంతో ఇద్దరు, ముగ్గురు పిల్లలు వాటిని జోడించి ఒకే దుప్పటిగా మార్చి కప్పుకుంటున్నారు. కాలేజీ పిల్లల హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి. చాలాచోట్ల కిటికీ తలుపులు లేకపోవడంతో చలిని తట్టుకునేందుకు వాటికి టవల్స్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు.
కోట్లు వెచ్చిస్తున్నా..
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాల పిల్లల కోసం కోట్లు ఖర్చు చేస్తూ వసతి గృహాలను నిర్వహిస్తోంది. అయితే వీటి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతోంది. సరైన పర్యవేక్షణ లేని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుస్తులు, ట్రంకు పెట్టెలు, టూత్‌పేస్టు, టూత్‌బ్రష్‌లు, సబ్బులు, నూనె తదితర కాస్మోటిక్స్ సరిగా సరఫరా కావడం లేదు. పాత పుస్తకాలనే తిరగేస్తూ లెక్కలు రాస్తుండటంతో పిల్లలకు దుప్పట్లు ఉంటే బెడ్‌షీట్లు, బెడ్‌షీట్‌లు ఉంటే దుప్పట్లు అందడం లేదు. ఈ నెల 15 నుంచి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో 12 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.8 డిగ్రీలు, మెదక్ జిల్లాలో 10 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వసతి గృహాల్లో విద్యార్థులు వణికిపోతున్నారు.
ఇంటి నుంచి దుప్పటి తెచ్చుకున్నా..
హాస్టల్‌లో ఇప్పటి వరకు దుప్పటి రాలేదు. చలి బాగా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. హాస్టల్‌లో అన్నీ ఇస్తామని చెప్పి చేర్పించారు. ఇక్కడ మాత్రం ఏమీ ఇవ్వటం లేదు.
– ఎం.మణికంఠ, ఎస్సీ హాస్టల్ విద్యార్థి, 6వ తరగతి, కల్లూరు, ఖమ్మం జిల్లా
పాత దుప్పట్లతోనే..
ఐదేళ్లుగా హాస్టల్‌లో ఉంటున్నా.. ఏటా దుప్పట్లు జూన్‌లోనే ఇచ్చేవాళ్లు. ఈ సంవత్సరం దుప్పట్లు, యూనిఫాం రాలేదు. చెçప్పులు కూడా ఇవ్వలేదు. పాత దుప్పట్లనే కప్పుకుంటున్నాం. అవికూడా చిరిగి పోయాయి.
– ఎం.సాయి, ఎస్సీ హాస్టల్ విద్యార్ధి, 10వ తరగతి, మిట్టపల్లి
ఇంటి నుంచి చద్దర్లు తెచ్చుకున్న..
ఈ సంవత్సరమే హాస్టల్‌లో కొత్తగా చేరాను. చలి ఎక్కువగా ఉంది. హాస్టల్లో దుప్పట్లు ఇవ్వకపోవడంతో పది రోజుల కిందట ఇంటి నుంచి మూడు చద్దర్లు తెచ్చుకున్నా. ప్రభుత్వం వెంటనే దుప్పట్లు ఇస్తే అందరికీ మంచిగుంటది.
– కొత్తూరి రమేశ్, 8వ తరగతి, దుర్శేడ్, కరీంనగర్ జిల్లా
ఇంకా ఇవ్వలేదు
కొత్తగా హాస్టల్‌కు వచ్చిన. ఇంకా నాకు దుప్పట్లు.. బెడ్ షీట్లు ఇవ్వలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్నవి వాడుకుంటున్నాం. రూంల కిటికీలు దెబ్బతిన్నయ్.. వాటి నుంచి చలి వస్తుంది. – నీలేష్, ఏడో తరగతి, కోరుట్ల, సోషల్‌వెల్ఫేర్ హాస్టల్
Comments
Please login to add a commentAdd a comment