మండుటెండల్లో బాల‘శిక్ష’
- ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో యథాతథంగా క్లాసులు ∙
- గాలికి కొట్టుకుపోయిన ‘వేసవి కార్యాచరణ’
- ఎండలు భగ్గుమంటున్నా కొనసాగుతున్న పాఠశాలలు ∙
- లక్షలాది మంది విద్యార్థులకు అవస్థలు
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు.. తొమ్మిది దాటితే చాలు ఎండ సుర్రు మంటోంది.. ఏకంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. వేడి తీవ్ర తకు తట్టుకోలేక పెద్దలే ఇంటిపట్టున ఉండిపోతున్నారు.. పిల్లలు మాత్రం ఇంతటి ఎండల్లోనూ స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది! లక్షలాది మంది విద్యార్థులు విలవిల్లాడుతున్నా వారిని పట్టించుకునే నాథుడే లేడు!! సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తరహాలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించి క్లాసులు కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యాశాఖ బోధనను కొనసాగిస్తోంది.
వేసవి కార్యాచరణలో చెప్పినా..
ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉం టే ఉదయం 11 గంటలలోపు పాఠశాలల్లో బోధన పూర్తి చేసి విద్యార్థులను ఇళ్లకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికలో స్పష్టంగా పేర్కొంది. వారంపాటు రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినా విద్యాశాఖకు పట్టడం లేదు. సాధారణ పాఠశాలల్లో ఉదయం 7:43 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బోధనను కొనసాగిస్తోంది. చివరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి జరుగుతున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్ష కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాలుకానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు అంగీకరిస్తున్నా.. బడుల కొనసాగింపును నిలిపివేయాలని గట్టిగా అడగలేకపోతున్నాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తులు రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అలాంటపుడు తామెలా నిర్ణయం తీసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చెబితే స్కూళ్లలో బోధనను నిలిపివేస్తామని పేర్కొంటున్నారు. అయినా ఈ నెల 23వ తేదీ వరకే కదా.. ఏముందీలే అంటూ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.