వి‘పత్తి’! | drought of government support as cotton farmer | Sakshi
Sakshi News home page

వి‘పత్తి’!

Published Tue, Dec 2 2014 1:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

వి‘పత్తి’! - Sakshi

వి‘పత్తి’!

పరిగి: ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ప్రభుత్వ ‘మద్దతు’ కరువైంది. పత్తి రైతుకు చివరికి పుట్టెడు దుఃఖం తప్ప ఏమీ మిగలని పరిస్థితి ఎదురవుతోంది. రైతులకు అందుబాటులో ఉండేలా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నాయి. దీంతో దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. పరిగి వ్యవసాయ మార్కెట్లో గత నెల మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరుసటిరోజే కొనుగోలు కేంద్రం అడ్డా మార్చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం లాల్‌పహాడ్‌లోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులు తమ పంటను అంత దూరం తీసుకెళ్లేందుకు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కష్టపడి అక్కడి వరకు పత్తి తీసుకెళ్లినా. మిల్లు వద్ద ట్రాక్టర్లతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ అవస్థలు పడలేని రైతులు గత్యంతరం లేక గ్రామాల్లోకి వచ్చే దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు. దళారులు, జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాన్ని మార్చారని ఆరోపిస్తున్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ సోమవారం పరిగి మార్కెట్‌కు చేరుకున్న రైతులు మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్‌ను నిలదీశారు. కొనుగోళ్లు పరిగిలోనే జరపాలని డిమాండ్ చేశారు.
 
నష్టపోతున్న రైతులు..
పత్తి కొనుగోలు ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. లాల్‌పహాడ్ జిన్నింగ్ మిల్లులో స్థలం లేదంటూ వారానికి మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నారు. పత్తి తీసుకుని మిల్లుకు వెళ్లాక సీసీఐ సిబ్బంది రైతుల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోంది. జిన్నింగ్‌మిల్లు యజమానులు క్వింటాలుకు రూ.3,500 నుంచి 3,600 చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు అంతదూరం పత్తిని తీసుకెళ్లి తిరిగి రాలేక అయిన కాడికి అక్కడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారు.  
 
రోజుల తరబడి నిరీక్షణ..  
పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలో ఏర్పాటు చేసి తూకాలు మహబూబ్‌నగర్ జిల్లా లాల్‌పహాడ్ వద్ద చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రం బోర్డును మాత్రం పరిగి వ్యవసాయ మార్కెట్లో తగిలించారు. అక్కడికి  రైతులు పత్తి తీసకువస్తే ఇక్కడ కాదు లాల్‌పహాడ్‌కు వెళ్లమంటున్నారు. అంతదూరం వెళ్లాక పంటతో తిరిగి వెనక్కి వెళ్లలేరు కాబట్టి ఏం చేసినా నడుస్తుందులే అనుకుని తేమ సాకుతో ధర నిర్ణయిస్తున్నారు.

మిల్లులోనే తూకాలు వేసి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు వాహనాలు వెతుక్కుని.. అందులో పత్తి నింపి.. ఆ తరువాత పరిగిలోని కొనుగోలు కేంద్రానికి, అక్కడి నుంచి లాల్‌పహాడ్‌కు వెళ్లి.. తేమ చూపించుకుని.. తూకాలు వేయించుకుని విక్రయించటం తతంగా మారింది. మరోవైపు రోజుల తరబడి ఉండాల్సి రావడంతో తీసుకెళ్లిన వాహనకిరాయి తడిసి మోపెడవుతోంది. ఇంత చేసినా పత్తి కొనుగోలు చేశాక మరోవారం రోజులకు గానీ చెక్కులలివ్వడంలేదు.
 
ఇవేం తిప్పలు..?
గత శనివారం పత్తి ట్రాక్టర్‌లో నింపుకుని పరిగికి వస్తే లాల్‌పహాడ్ వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లాక తీసుకునేందుకు సీసీఐ వారు ఒప్పుకోలేదు. ఇదేమని నిలదీస్తే స్థలం లేదు.. అందుకే మూడు రోజులు సెలవులిచ్చామన్నారు. చేసేదిలేక అక్కడే జిన్నింగ్ మిల్లు యజమానులకు విక్రయించాం. ఇంత దూరం వచ్చాక ఎలాగూ తిరిగి వెళ్లలేరు కదా అని క్వింటాలుకు రూ.3,600కు కొనుగోలు చేశారు. దళారులు తీసుకువస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేస్తున్నారు.
 - హన్మంతురెడ్డి, రైతు, రాఘవాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement